శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Jun 28, 2020 , 02:43:07

నిజాయితీకి నిలువెత్తు రూపం..

నిజాయితీకి నిలువెత్తు రూపం..

  •  పీవీకి రాజకీయ జిమ్మిక్కులు తెలియదు
  •  పీవీ సీఎంగా ఉన్న సమయంలో
  •  నేను చీఫ్‌ విప్‌గా ఉన్నా
  • ఆయన స్ఫూర్తిని భావితరాలకుఅందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అభినందనీయం
  • మాజీ మంత్రి కమతం రాంరెడ్డి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలుగుజాతి గర్వించదగిన వ్యక్తి అని మాజీ మంత్రి కమతం రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. పీవీ మహా పండితుడని, రాజకీయాల్లో పీవీ లాంటి మహానీయులు చాలా అరుదుగా ఉంటారని కమతం అభిప్రాయపడ్డారు.

పీవీ సీఎంగా ఉన్న సమయంలో తాను ప్రభుత్వ చీఫ్‌విప్‌గా ఉన్నట్టు గుర్తుచేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీవీ నరసింహరావు సిండికేట్‌ సభ్యులుగా ఉన్న సమయం నుంచి తనకు పరిచయమని, చాదర్‌ఘట్‌లోని లా కాలేజీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో మర్రి చెన్నారెడ్డితోపాటు పీవీ నరసింహారావు తనకు అనేక విషయాల్లో సహకరించినట్టు తెలిపారు. బ్రహ్మనందారెడ్డి తర్వాత ముఖ్యమంత్రి పదవి పీవీ చేపట్టిన సమయంలోనూ చీఫ్‌విప్‌గా తనను కొనసాగించినట్టు కమతం తెలిపారు.

1972లో భారీ మెజార్టీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ పీవీకి జిమ్మిక్కులు తెలియకపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. పీవీ అంటేనే నిజాయితీకి నిలువెత్తు స్వరూపమని, అవినీతిని ఆయన అస్సలు సహించేవారు కాదని తెలిపారు. పీవీ నరసింహరావు గొప్ప పండితుడని, ఎప్పుడు ఆయన ఇంటికి వెళ్లినా పుస్తకాలు చదువుతూ కనిపించేవారని అన్నారు. పీవీ లాంటి గొప్ప వ్యక్తికి ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలు చేయడం సంతోషకరమని, ఆయన స్ఫూర్తిని భావి తరాలకు అందించడానికి చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయమని కొనియాడారు.  

తాజావార్తలు


logo