సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jun 28, 2020 , 00:22:17

నియంత్రిత పంటల వైపు మొగ్గుచూపుతున్న రైతులు

నియంత్రిత పంటల వైపు మొగ్గుచూపుతున్న రైతులు

  • వికారాబాద్‌ జిల్లాలో అంచనాలకు మించి పత్తి, కంది పంటలు..  
  • అత్యధికంగా 1,50,530 ఎకరాల్లో పత్తి సాగు 
  • బంట్వారం మండలంలో రికార్డు స్థాయిలో పత్తివైపు మొగ్గు..
  • మక్కజొన్న పై ఆసక్తి చూపని జిల్లా రైతాంగం
  • సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు

సీఎం కేసీఆర్‌ సూచనలు, అధికారులు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. మూస ధోరణి  మాని.. నియంత్రిత పంటలవైపు వికారాబాద్‌ జిల్లా రైతులు అడుగులు వేస్తున్నారు. లక్షన్నర ఎకరాల్లో పత్తి సాగు చేయడంతో పాటు కంది, పెసర, మినుముల సాగును అంచనాలకు మించి పెంచారు.  అధికారులు, ప్రజాప్రతినిధులు ఊరూరా రైతులకు అవగాహన కల్పించడంతో పత్తిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మక్కజొన్న పంటలపై రైతులెవ్వరూ ఆసక్తి చూపడం లేదు.

బంట్వారం మండలంలో రికార్డు స్థాయిలో రైతులు పత్తి పంట వేశారు. మొత్తం జిల్లాలో 4,76,283 ఎకరాలుండగా ఇప్పటివరకు 2,35,555 ఎకరాల్లో సాగు ప్రారంభించారు. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావ డంతో రైతులు ఉత్సాహంగా వ్యవసాయల్లో పనులు నిమగ్నమయ్యారు.

 వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు జిల్లా రైతాంగం నియంత్రిత పంటల సాగువైపు వెళ్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 49 శాతం మేర ఆయా పంటల విత్తనాలను నాటారు. ఇప్పటివరకు రైతులు సాగు చేసిన పంటల్లో అత్యధికంగా నియంత్రిత సాగు విధానం మేరకు పంటలను రైతులు సాగు చేశారు. అయితే వ్యవసాయాధికారుల అంచనాలకు తగినట్లుగా జిల్లాలో పత్తి, కంది పంటలను అధిక మొత్తంలో సాగు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో సాగైన పంటల్లో మెజార్టీ శాతం పత్తి పంటనే జిల్లా రైతాంగం సాగు చేసింది. ప్రభుత్వ సూచనలతో పత్తి పంట సాగువైపే రైతన్నలు మొగ్గు చూపుతుండడం గమనార్హం. ఈ వానకాలం సీజన్‌లో రికార్డు స్థాయిలో జిల్లాలో పత్తి సాగవుతుందని జిల్లా వ్యవసాయధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని బంట్వారం మండలంలో సాధారణ సాగుకు మించి పత్తి పంట సాగయ్యింది. ప్రభుత్వం సూచించిన ప్రకారమే రైతులు మక్కజొన్న పంట సాగువైపు ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

జిల్లాలోని మెజార్టీ రైతులు పత్తి, కంది, మినుము, పెసర పంటల సాగువైపు అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా ఈ వానకాలం సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 4,76,283 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 2,35,555 ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేశారు. మరో నెలరోజుల వరకు పంటలను సాగు చేసేందుకు అదును ఉన్నందున వానకాలం సీజన్‌లో అంచనాలకు మించి ఆయా పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం అంచనా వేస్తున్నది. అయితే జూలై 15 వరకు కంది, పత్తి పంటలతోపాటు మిగతా అన్ని పంటలకు సంబంధించి విత్తనాలు నాటొచ్చని, ఒకవేళ వర్షాల వల్ల జాప్యం జరిగితే జూలై 31 వరకు పత్తి, కంది పంటలను సాగు చేయుచ్చని జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. 

2,35,555 ఎకరాల్లో ఆయా పంటలు సాగు...

జిల్లాలో వానకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు ఆయా పంటల సాగు విస్తీర్ణం 2,35,555 ఎకరాలకు చేరింది. అయితే ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 4,76,283 ఎకరాలుకాగా 49 శాతం మేర రైతులు పంటలను సాగు చేశారు. అయితే అత్యధికంగా పత్తి, కందులు, సోయాబీన్‌, పెసర, మినుము పంటలు సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2,13,192 ఎకరాలు కాగా.. 1,50,530 ఎకరాల్లో పత్తి పంట, కందులు 1,75,900 ఎకరాలకు 58,863 ఎకరాల్లో, పెసర 20,800 ఎకరాలకు 9953 ఎకరాల్లో, మినుములు 9500 ఎకరాలకు 5232 ఎకరాల్లో, జొన్న 15000 ఎకరాలకు 2494 ఎకరాల్లో, ఆముదం 761 ఎకరాలకు 20 ఎకరాల్లో, సోయాబీన్‌ 2047 ఎకరాలకు 1204 ఎకరాల్లో, చెరుకు 6508 ఎకరాలకు 5807 ఎకరాల్లో, మొక్కజొన్న 1187 ఎకరాల్లో, వేరుశనగ 1300 ఎకరాలకు 18 ఎకరాల్లో, రాగులు 217 ఎకరాలకు 8 ఎకరాల్లో, చిరుధాన్యాలు 328 ఎకరాలకు 49 ఎకరాల్లో, ఇతర ఆహార పంటల సాధారణ సాగు విస్తీర్ణం 536 ఎకరాలు కాగా.. 191 ఎకరాల్లో సాగు చేశారు.

ఆయా మండలాల్లో పంటల సాగుకు సంబంధించి జిల్లాలోని పూడూరు మండలంలో అత్యధికంగా 95 శాతం ఆయా పంటలను సాగు చేశారు. పూడూరు మండలంలో సాధారణ సాగు విస్తీర్ణం 26,332 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 25,060 ఎకరాల్లో ఆయా పంటలను సాగు చేశారు. బంట్వారం మండలంలో 88 శాతం, కోట్‌పల్లి మండలంలో 76 శాతం, మర్పల్లి మండలంలో 74 శాతం, ధారూరు మండలంలో 68 శాతం, నవాబుపేట మండలంలో 65 శాతం మేర విత్తనాలను నాటారు. 

రికార్డు దిశగా పత్తిసాగు...

రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లా రైతాంగం పత్తి పంటవైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అంచనాల దిశగా పత్తి సాగవుతున్నది. ఇప్పటివరకు సాగైన పంటల్లో సగానికిపైగా పత్తి పంటనే సాగయ్యింది. పత్తి పంట సాగుతోనే రైతులు అధిక మొత్తంలో లాభాలు అర్జించొచ్చని, రాష్ట్రంలో పండించే పత్తికి దేశీయంగా చాలా డిమాండ్‌ ఉండడం, ఎంత పత్తి పంటను సాగు చేసినా స్థానికంగానే ఆయా జిల్లాల్లోనే జిన్నింగ్‌ మిల్లుల ద్వారా సీసీఐ కొనుగోలు చేస్తుండడంతోపాటు ప్రభుత్వం మద్దతు ధర కూడా అందిస్తుండడం ప్రతీ రైతు పత్తినే సాగు చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ఊరూరా రైతులకు అవగాహన కల్పించడంతో జిల్లాలో పత్తిసాగు రికార్డు దిశగా సాగుతున్నది. అయితే ఇప్పటివరకు సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 71 శాతం మేర పత్తి పంటను రైతులు సాగు చేశారు.

అత్యధికంగా జిల్లాలోని బంట్వారం మండలంలో రికార్డు స్థాయిలో రైతులు పత్తి పంటను సాగు చేశారు. బంట్వారం మండలంలో సాధారణ సాగు విస్తీర్ణానికి మించి పత్తి సాగయింది. బంట్వారం మండలంలో సాధారణ సాగు విస్తీర్ణం 7251 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 8600 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. పూడూరు మండలంలో 97 శాతం రైతులు పత్తి పంటను సాగు చేశారు. తాండూరు, మర్పల్లి, ధారూర్‌ మండలాల్లో అధికంగా రైతులు పత్తిని సాగు చేశారు. పూడూరు మండలంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 22,554 ఎకరాలు కాగా.. 21,875 ఎకరాల్లో, మర్పల్లిలో 19,297 ఎకరాలకు 16,550 ఎకరాలు, ధారూరులో 10,689 ఎకరాలకు 8855 ఎకరాలు, తాండూరులో 4571 ఎకరాలకు 3850 ఎకరాలు, కొడంగల్‌లో 21,869 ఎకరాలకు 16,401 ఎకరాలు, దౌల్తాబాద్‌లో 9505 ఎకరాలకు 6653 ఎకరాలు, పరిగిలో 18,539 ఎకరాలకు 12,977 ఎకరాలు, కోట్‌పల్లి మండలంలో సాధారణ సాగు విస్తీర్ణం 12,299 ఎకరాలు కాగా.. 9435 ఎకరాల్లో ఇప్పటివరకు పత్తిని సాగు చేశారు. 

సాధారణం కంటే అధిక వర్షపాతం...

జిల్లాలో ఇప్పటివరకు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది వర్షాకాలం ఆరంభంలోనే నైరుతి రుతుపవనాలు రావడంతో సాధారణానికి మించి వర్షాలు కురిశాయి. అయితే జూన్‌ మాసంలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 79.4 మి.మీటర్లు కాగా ఈ నెల 22 వరకు 99.3 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని కోట్‌పల్లి మండలంలో అతి తక్కువ వర్షపాతం నమోదుకాగా, తాండూరు, పరిగి మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని మండలాల్లో సాధారణం, సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మర్పల్లి మండలంలో అత్యధిక వర్షాలు కురిశాయి. మర్పల్లి మండలంలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 80.4 మి.మీటర్లుకాగా 178.9 మి.మీ, బొంరాస్‌పేట్‌లో 50 మి.మీలకు 109.7 మి.మీ, మోమిన్‌పేట్‌లో 85.2 మి.మీలకు 173.1 మి.మీ, నవాబుపేటలో 86.2 మి.మీలకు 123.9 మి.మీ, కొడంగల్‌లో 83.5 మి.మీలకు 112.9 మి.మీ, పూడూర్‌లో 86.6 మి.మీలకు 108.8 మి.మీ, ధారూర్‌లో 83.2 మి.మీలకు 100.1 మి.మీ, యాలాల మండలంలో సాధారణం 76.3 మి.మీటర్లు కాగా.. 116.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. 

నియంత్రిత పంటలనే సాగు చేస్తున్నారు..

ప్రభుత్వ సూచనల మేరకు రైతులు నియంత్రిత పంటలనే సాగు చేస్తున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో పత్తి పంట సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చేనెలాఖరు వరకు విత్తనాలను నాటొచ్చు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా సరిపోను ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాం. మరోవైపు మక్కజొన్నను వానకాలం సీజన్‌లో సాగు చేయొద్దని రైతులకు అవగాహన కల్పించడంతో మక్కలను సాగు చేసేందుకు మొగ్గు చూపలేదు. కేవలం స్వీట్‌కార్న్‌కు సంబంధించి మక్కలను మాత్రమే 1100 ఎకరాల్లో సాగు చేశారు.   

- జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌



logo