సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jun 27, 2020 , 00:40:16

పంటరుణాలు @ రూ.1610 కోట్లు

పంటరుణాలు @ రూ.1610 కోట్లు

  • జిల్లా వార్షిక  రుణ ప్రణాళిక సిద్ధం 
  • 1,47,564 మంది రైతులకు రుణాలిచ్చేందుకు నిర్ణయం
  • అర్హులందరికీ  మంజూరు చేసేందుకు సన్నాహాలు
  • వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.4834.11 కోట్లు  ఇవ్వడమే లక్ష్యం
  • ప్రాధాన్యత రంగాలకు రూ.4047.61 కోట్లు..
  • ప్రాధాన్యేతర రంగాలకు రూ.786.50 కోట్లు..
  •  పౌల్ట్రీ, డెయిరీ, మత్స్య, ఉద్యానవన రైతులకు రూ.697 కోట్లు
  • సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు రూ.316 కోట్లు ఇవ్వాలని నిర్ణయం
  • వచ్చే నెల 3న జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం

 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు.  గతంతో పోలిస్తే  2020-21 ఆర్థిక సంవత్సరానికి రుణాల లక్ష్యాన్ని పెంచారు.  వానకాలం, యాసంగి సీజన్‌లకు కలిపి ఈ ఏడాది పంట రుణాలుగా రూ.1,610 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. గత ఏడాదితో పోలిస్తే  ఇది వంద కోట్లు ఎక్కువ. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.4,834 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే నెల 3వ తేదీన కలెక్టరేట్‌లో నిర్వహించనున్న సమావేశంలో రుణ ప్రణాళికను విడుదల చేస్తారు.  కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ సమావేశంలో మంత్రి సబితారెడ్డితో పాటు ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారు. గత ఏడాది రుణాల మంజూరులో జరిగిన లోటుపాట్లు సవరించి  ఈసారి లక్ష్యాలకు అనుగుణంగా సిబ్బంది పనిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని లీడ్‌బ్యాంక్‌ అధికారులు తెలిపారు.

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను సిద్ధం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు మంజూరు చేసే రుణాల లక్ష్యాన్ని పెంచుతూ జిల్లా లీడ్‌ బ్యాంకు అధికారులు ప్రణాళికను రూపొందించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.100 కోట్లు పెంచుతూ రుణ ప్రణాళికను తయారు చేశారు. అంతేకాకుండా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు మంజూరు చేసే రుణాలను కూడా రూ. వంద కోట్లకుపైగా పెంచారు. అయితే పంట రుణాలతోపాటు పౌల్ట్రీ, మత్స్య, డెయిరీ, ఉద్యానవన రైతులకు రుణాలిచ్చేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ఈ ఏడాది అర్హులైన ప్రతీ రైతుకు రుణాలను మంజూరు చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వచ్చేనెల 3న జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించనున్నారు. ఈ ఏడాది వానకాలం, యాసంగి సీజన్‌లకు కలిపి రూ.1610 కోట్ల పంట రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ కీలకమైన పంట రుణాల మంజూరులో బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు వచ్చేలా చేస్తున్నారు. 

ఈ ఏడాది పంట రుణాలు  రూ.1610 కోట్లు...

ఈ ఆర్థిక సంవత్సరానికిగాను వానకాలం, యాసంగి సీజన్‌లలో రూ.1610 కోట్ల పంట రుణాలను మంజూరు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1509 కోట్ల పంట రుణాలను టార్గెట్‌గా నిర్దేశించిన లీడ్‌ బ్యాంక్‌ అధికారులు ఈ ఏడాది రూ.100 కోట్లను పెంచుతూ నిర్ణయించారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.4834 కోట్ల రుణాలను మంజూరు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో ప్రాధాన్యత రంగాలకు రూ.4047 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.786 కోట్ల రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా పౌల్ట్రీ, డెయిరీ, మత్స్యకారులు, ఉద్యానవన రైతులకు రూ.697 కోట్ల రుణాలు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రూ.316 కోట్ల రుణాలిచ్చేందుకు టార్గెట్‌గా నిర్ణయించారు. అయితే గతేడాది వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.4729 కోట్ల రుణాలను లక్ష్యంగా పెట్టుకోగా ప్రాధాన్యత రంగాలకు రూ.3942  కోట్లు, ప్రాధాన్యనేతర రంగాలకు రూ.786 కోట్లు, పంట రుణాలకు రూ.1509 కోట్లతో గతేడాది రుణ ప్రణాళికను రూపొందించారు. 

గతేడాది రూ.779 కోట్ల రుణాలు మంజూరు...

జిల్లాలో గతేడాది వానకాలం, యాసంగి సీజన్‌లలో బ్యాంకర్లు అంతంతమాత్రంగానే రుణాలను మంజూరు చేశారు. రెన్యూవల్‌ తప్ప కొత్త రుణాలను మంజూరు చేయడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వానకాలం, యాసంగి రెండు సీజన్‌లకు కలిపి కేవలం 53 శాతం రుణాలను మాత్రమే మంజూరు చేశారు. వానకాలం, యాసంగిలలో రూ.1509 కోట్ల రుణాలను 1,12,758 మంది రైతులకు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా కేవలం రూ.779 కోట్ల రుణాలను మాత్రమే బ్యాంకర్లు మంజూరు చేశారు. వానకాలం సీజన్‌కుగాను రూ.905 కోట్ల రుణాలను జిల్లా రైతాంగానికి మంజూరు చేయాలని నిర్ణయించగా 520 కోట్లు, అదేవిధంగా యాసంగి సీజన్‌లో రూ.603 కోట్ల రుణాలను 75,170 మంది రైతులకు అందించాలని లక్ష్యంగా నిర్ణయించగా కేవలం రూ.259 కోట్లను మాత్రమే మంజూరు చేశారు. అయితే గతేడాది రైతులు వ్యవసాయ పనులు వదులుకొని రోజు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా బ్యాంకర్లు మాత్రం కరుణించలేదు. 

జూలై 3న బ్యాంకర్ల సమావేశం...

జూలై 3న కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళికను ఆరోజు విడుదల చేయనున్నారు. ఈ సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరుగనుంది, సమావేశానికి మంత్రి సబితారెడ్డితోపాటు జిల్లాలోని కొడంగల్‌, పరిగి,తాండూర్‌, వికారాబాద్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నరేందర్‌ రెడ్డి, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, ఆనంద్‌ పాల్గొననున్నారు. 

అర్హులైన ప్రతీరైతుకు రుణాలందేలా చూస్తాం..

ఈ ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక రుణ ప్రణాళికను సిద్ధం చేశామని జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సుమలత రెడ్డి తెలిపారు. వానకాలం, యాసంగి సీజన్‌లలో అర్హులైన ప్రతీ రైతుకు రుణాలను మంజూరు చేసే విధంగా చర్యలు చేపడుతామన్నారు. రైతులకు పంట రుణాల మంజూరులో బ్యాంకర్లు నిర్లక్ష్యం వహించకుండా చూస్తామని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వెల్లడించారు. 

- జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సుమలత రెడ్డి


logo