మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Jun 25, 2020 , 23:19:04

మొదటి రోజు నాటిన లక్షకుపైగా మొక్కలు

మొదటి రోజు నాటిన లక్షకుపైగా మొక్కలు

  • పరిగి మండలం మిట్టకోడూర్‌ అటవీ ప్రాంతంలో పాల్గొన్న మంత్రి సబితారెడ్డి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : వికారాబాద్‌ జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించారు. జిల్లాలో ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని గురువారం విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పరిగి మండలం మిట్టకోడూర్‌ అటవీ ప్రాంతంలో చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొక్కలను నాటడంతోపాటు వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని, భావితరాలకు పర్యావరణాన్ని కానుకగా ఇవ్వాలనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఆరో విడుతలో వికారాబాద్‌ జిల్లాలో 44 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ‘జంగల్‌ బచావో జంగల్‌ బడావో’ నినాదంతో 33 శాతం మేరకు అడవులు పెంచే దిశగా సీఎం కేసీఆర్‌ 2015లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. 230 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్రంలో హరితహారాన్ని ప్రారంభించి గత ఐదు విడుతల్లో 182 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు.

నాటిన మొక్కలను కాపాడే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంటుందని మంత్రి సూచించారు. మానవాళి మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. వికారాబాద్‌ మండలం అనంతగిరి అటవీ ప్రాంతంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌, కొడంగల్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డ్‌లో ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డి, తాండూరు మున్సిపల్‌ పరిధిలో శాంతినగర్‌లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్‌ వద్ద కలెక్టర్‌ పౌసుమి బసు, నవాబుపేట మండలంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నారాయణ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. 

తొలి రోజు జిల్లాలో 1,12,509 మొక్కలు..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరో విడుత హరితహారం కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైంది. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో 1,12,509 మొక్కలను నాటారు. వీటిలో అన్ని గ్రామ పంచాయతీల్లో 79,806 మొక్కలు నాటగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 17,150 మొక్కలు నాటారు. ఎక్సైజ్‌ శాఖ 3500, ఉద్యానవన శాఖ 2000, విద్యాశాఖ 2006, ఇరిగేషన్‌ శాఖ 100, వ్యవసాయ శాఖ 506, పోలీస్‌ శాఖ 400, పరిశ్రమల శాఖ 1000, గిరిజన సంక్షేమ శాఖ 400, ఆర్‌అండ్‌బీ 200, మైనింగ్‌ శాఖ 1000, మార్కెటింగ్‌ శాఖ 1080, పశు సంరక్షణ శాఖ 711, పీఆర్‌ రోడ్‌ 950, విద్యుత్‌ శాఖ 200, వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో కలిపి 1500 మొక్కలను నాటారు. 


logo