మంగళవారం 01 డిసెంబర్ 2020
Vikarabad - Jun 22, 2020 , 23:47:55

కల్లాల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోండి

కల్లాల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోండి

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : జిల్లాలో చిన్న, సన్నకారు, పెద్ద రైతులు జాతీయ ఉపాధిహామీ పథకం కింద పం టను ఆరబెట్టుకోవడానికి వీలుగా సొంత పొలంలో సిమెంట్‌ కల్లాలు నిర్మించుకోవడానికి ఈ నెల 30లోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కల్లాల నిర్మాణానికి ఆసక్తిగల రైతులు త మ పేర్లు సంబంధిత ఎంపీడీవో, ఏఈఓ దగ్గర నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక్కో కల్లం యూనిట్‌ కాస్ట్‌ 50 చదరపు మీటర్లకు రూ. 56వేలు, 60 చదరపు మీటర్లకు రూ.68 వేలు, 75 చదరపు మీటర్లకు రూ.85వేలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బీసీ, జనరల్‌ రైతులకు యూనిట్‌ కాస్ట్‌ 10 శాతం డబ్బులు వాటాగా చెల్లించాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి ఉచితంగా కల్లాలు నిర్మిస్తారన్నారు. ఈ కల్లాల నిర్మాణానికి ఆసక్తిగల రైతులు సెల్ప్‌ హెల్ప్‌ గ్రూపు మెంబర్స్‌ అయి ఉండాలన్నారు. ఉపాధిహామీ జాబ్‌కార్డు ఉన్న రైతులు అర్హులన్నారు. రైతులు ముందుగా సొంత ఖర్చులతో సూచించిన కొలతలు, నియమాలతో కల్లాలు నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వం రెండు విడుతల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందన్నారు. రైతులు ఈ నెల 30 లోపు మండల వ్యవసాయాధికారి, విస్తరణ అధికారి, ఎంపీడీవోలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

ఆమనగల్లు

మండలంలోని రైతులందరూ తమ వ్యవసాయ పొలాల్లో కల్లాలు నిర్మించుకోవడానికి అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో వెంకట్రాములు సూచించారు. సోమవారం ఆమనగల్లు మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో కల్లాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మం డలంలోని 13పంచాయతీలు, మున్సిపాలిటీలోని సన్న, చిన్నకారు, స్వయం సహాయ సంఘాల సభ్యులు అర్హులన్నారు.  

కొత్తూరు

కల్లాలను ఏర్పాటు చేసుకునే రైతులు మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి గోపాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలను ఆరబెట్టుకునేందుకు ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి సబ్సిడీ ఇస్తున్నదన్నారు. పంట నూర్పిడి కల్లాల ను నిర్మించుకునే రైతులు సంబంధిత క్లస్టర్‌ స్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారికి ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

నందిగామ

రైతులు పండించిన పంటలను ఆరబెట్టుకునేందుకు, నూర్పిడికి వీలుగా కల్లాలు ఏర్పాటుచేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్వేత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.