బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jun 21, 2020 , 22:32:49

అనుక్షణం అప్రమత్తం

అనుక్షణం అప్రమత్తం

  • ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా వైద్యారోగ్య సిబ్బంది 24/7 సేవలు
  • రంగారెడ్డి జిల్లాలో ఆరు శాంపిల్స్‌ సేకరణ కేంద్రాలు
  • 218 కంటైన్మెంట్‌ జోన్లు.. 1678 మంది నుంచి శాంపిల్స్‌ సేకరణ 
  • మొబైల్‌ వాహనంలోనూ వైద్య పరీక్షలు.. 687కు చేరిన కరోనా పాజిటివ్‌
  • కోలుకున్నవారు 259 మంది.. యాక్టివ్‌ కేసులు 409.. ఇప్పటివరకు 21 మంది మృతి

ఇదివరకు జిల్లాలో ఎక్కడ కరోనా కేసు వచ్చినా.. గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందించేవారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నా బాధితుల్లో వైరస్‌ తీవ్రత తక్కువగా ఉండటంతో ఎక్కడివారికక్కడే చికిత్సలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రోగులు హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనలతో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణకు వైద్యారోగ్య సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా కరోనా కేసు నమోదైన వెంటనే స్పందించి సదరు కుటుంబ సభ్యులు, సమీప ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాకుండా కరోనా లక్షణాలు ఉన్నవారి నుంచి శాంపిల్స్‌ సేకరించడం, చికిత్స పొందుతున్న రోగుల వివరాల సేకరణ, మందుల పంపిణీలో నిరంతరం శ్రమిస్తున్నారు. జిల్లాలో ఆరు శాంపిల్స్‌ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికి 1678 మంది నుంచి నమూనాలు సేకరించారు. జిల్లాలో మొత్తం కేసులు 687 నమోదయ్యాయి. అందులో 409 యాక్టివ్‌ కేసులుండగా.. 259మంది కోలుకున్నారు. 21 మంది మృతిచెందారు. 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాస్తోంది. వైరస్‌ పేరు చెబితేనే వణికిపోతున్నారు.జిల్లా అర్బన్‌, సెమీ అర్బన్‌, గ్రామీణంగా ఉన్నది. జిల్లాలో అర్బన్‌, సెమీ అర్బన్‌లో ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు గ్రామీణంలో నమోదు కావడం లేదు. అత్యధికంగా నగర శివారు ప్రాంతాల్లో  వైరస్‌ విజృభిస్తోంది.  నగరంతో లింక్‌ ఉన్న ప్రాంతాల్లోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్యారోగ్యశాఖ చెబుతోంది. నగరంలో కూరగాయాలు అమ్మడానికి వెళ్లిన వ్యక్తికి.. ఉద్యోగం చేసే వ్యక్తులకు కరోనా వైరస్‌ సోకుతుంది. అదే వరుసల్లో వైద్యారోగ్య శాఖ,అనుబంధ శాఖల సిబ్బంది నిరంతరం కరోనా వైరస్‌తో సవాసం చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఫ్రంట్‌ లైన్లలో ఉన్న వైద్య  సిబ్బంది వైరస్‌ బారిన పడి చికిత్సలు పొందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 60 మంది డాక్టర్లు, 237 ఏఎన్‌ఎంలు, 1278 మంది ఆశా వర్కర్లు, 5 మంది డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, 7 మంది జిల్లా అధికారులు, రిపోర్టింగ్‌ స్టాప్‌10 మందితో పాటు బుల్లెటన్‌ విడుదల చేసే సిబ్బంది నిరంతరం కరోనా నివారణ పోస్టర్లు, బ్యానర్లు, స్టికర్లు, ప్లెక్సీలు తయారు చేసి విసృత్తంగా ప్రచారం నిర్వహించే (ఐఈసీ) పని చేస్తున్నారు. ఇప్పటికే పది మందికి పైగా వైద్యసిబ్బంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

‘మొన్నటి వరకు జిల్లాలో ఎక్కడ కరోనా కేసు వచ్చినా.. చలో గాం దవాఖాన అన్నట్లుగా పరిస్థితి ఉండేది.. తాజాగా ఈ విధానానికి స్వస్తి పలుకుతూ ఎక్కడిక్కడే చికిత్సలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలోనే వారి నివాసాల్లో హోం ఐసోలేషన్‌ ఏర్పాటు చేసుకుని వైద్యుల సలహాలు, సూచనలతో చికిత్సలు పొందుతున్నారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది నిరంతరం ‘రౌండ్‌ ది క్లాక్‌' గా పనిచేస్తున్నారు. 

  రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 24/7 వైద్యులు, సిబ్బంది,ఆశా వర్కర్లు నిరంతరం కోవిడ్‌-19 రోగుల వివరాల సేకరణలో తలమునకలై తిరుగుతున్నారు. ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైతే వెంటనే అప్రమత్తమై  కుటుంబ సభ్యులను, సమీప ప్రజలను అప్రమత్తం చేసి కోవిడ్‌-19 నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు,మందులు అందిస్తున్నారు.

కేసులు పెరుగుతున్న..

  జిల్లాలో  పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న వైరస్‌ తీవ్రత రోజురోజుకు తగ్గుతుంది. వైరస్‌ తీవ్రత లేకపోవడంతో  ప్రభుత్వం హోం ఐసోలేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రాత్రి పగలు తేడా లేకుండా కరోనా పాజిటివ్‌ కేసుల బాధితులతో,వ్యాధి లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని క్వారంటైన్‌ చేసి, నమూనాలను సేకరించి పరీక్ష కేంద్రానికి పంపిస్తున్నారు. ప్రైవేట్‌ ల్యాబోరేటరీలకు అనుమతులు ఇవ్వడంతో పాటుగా జిల్లాలో నాలుగు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా కోవిడ్‌-19 శాంపుల్స్‌ సేకరణ కొనసాగుతోంది. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు బాగా పనిచేస్తున్నాయి. 

మరో 17 మందికి పాజిటివ్‌..

   ఆదివారం మరో 17 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లే ప్రాంతంలో 12 కేసులు నమోదు కాగా.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో మరో 5 మందికి వ్యాప్తి చెందినట్లు పరీక్షల్లో తేలింది. శనివారం రాత్రి వరకు కరోనా బాధితుల సంఖ్య 670 ఉండగా..తాజా కేసుతో ఈ సంఖ్య 687కి చేరింది. వీటిలో 258 మంది కోలుకున్నారు.409 యాక్టివ్‌ కేసులు ఉండగా..వీరిలో 65 తమ ఇళ్లలో,71 మంది ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 21 మంది చనిపోయారు. జిల్లాలో 218 కంటైన్మమెంట్‌ జోన్లు ఉన్నాయి. మిగిలిన యాక్టివ్‌ కేసులకు ఆయా ప్రభుత్వ,ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్యం అందిస్తున్నారు. అలాగే జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1678 మంది నుంచి శాంపుల్స్‌ సేకరించారు.జిల్లాలోని జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 395 నాన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 292 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 252 కాగా, నాన్‌ జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 157 మాత్రమే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 128 మంది డిశ్చార్జి అయ్యారు. నాన్‌ జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 130 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 16 మంది చనిపోగా,గ్రామీణంలో 5 మరణాలు సంభవించాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో శనివారం రాత్రి వరకు 142 కంటైన్మమెంట్‌ జోన్లు ఉండగా.. ఆదివారం మరో 6 కంటైన్మమెంట్‌ జోన్లు పెరిగాయి. నాన్‌ జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా శనివారం రాత్రి వరకు 68 ఉండగా.. ఆదివారం మరో 2 కంటైన్మమెంట్‌ జోన్లుగా ప్రకటించారు. బాలాపూర్‌లో, దుబ్బచర్ల , నార్సింగి, యాచారం, అబ్దూల్లాపూర్‌మెట్‌  ఒకరికి చొప్పున,  నాన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 5 కేసులు నమోదు కాగా..సరూర్‌నగర్‌ 4,శేరిలింగంపల్లి 5,మైలార్‌దేవరంపల్లి 3 చొప్పున 17 మందికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. వారం రోజుల్లో జిల్లాలో 1678 మంది నుంచి కరోనాకు సంబంధించి నమూనాలు సేకరించిన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 

ఆరు కేంద్రాల్లో శాంపుల్స్‌ సేకరణ 

    జిల్లాలోని కొండాపూర్‌, వనస్థలిపురం, మహేశ్వరం  , సరూర్‌నగర్‌, బాలాపూర్‌  ప్రాంతాల్లో శాంపుల్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 1678 మంది నుంచి శాంపుల్స్‌ సేకరించారు. వీటిలో 28 మంది ల్యాబ్‌ టెక్నీషీయన్లు పనిచేస్తున్నారు.48 సూపర్‌వైజర్లు ఉన్నారు. కలెక్టరేట్‌లో టోల్‌ ఫ్రీ కేంద్రంలో నిరంతరం 8 మంది సిబ్బంది పనిచేస్తున్నారు 

పలు చోట్ల స్క్రీనింగ్‌లు..

   జిల్లాలోని  రైల్వే, రోడ్డు, ఆకాశ మార్గాల ద్వారా జిల్లాకు వస్తున్న వారిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. శంకర్‌పల్లి  రైల్వే స్టేషన్లలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్‌ చేస్తున్నారు. షాద్‌నగర్‌ బూర్గుల వద్ద ఉన్న చెక్‌పోస్టు వద్ద ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇతర దేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్‌ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో టెస్ట్‌ ద్వారా వచ్చే ఫలితాల బట్టి వారిని హోంక్వారంటైన్‌ చేసి, నమూనాలను సేకరించి పరీక్ష కేంద్రానికి తరలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని ప్రైవేట్‌ గా ఏర్పాటు చేసిన ప్రధానమైన హోటళ్లు, హోం ఐసోలేషన్‌లలో పెట్టి చికిత్సలు అందిస్తున్నారు. 

నిరంతరం పర్యవేక్షణ

-డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మీ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి   జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు ప్రకారం నిరంతరం వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానలతో పాటు హోం ఐసోలేషన్‌ ఉంచి చికిత్సలు అందిస్తున్నాం.  ఫ్రంట్‌లైన్‌లో ఉండి పనిచేస్తున్న సిబ్బందికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.ఎన్‌-95 మాస్కులు, పీపీ కిట్లు,శానిటైజర్లు కావాల్సిన అని అందుబాటులో ఉన్నాయి. రాజీవ్‌ బాల ఆరోగ్య స్వచ్ఛ కార్యక్రమంలో పనిచేసే డాక్టర్లు,104 సిబ్బంది, డాటా ఆపరేటర్లు అందరి సేవలు వినియోగించుకుంటున్నాం. ‘రౌండ్‌ది క్లాక్‌'గా నిరంతరం 24 గంటలు పనిచేస్తున్నాం. 


logo