శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Jun 21, 2020 , 03:44:29

నకిలీలపై కొరడా...

నకిలీలపై కొరడా...

  • 26.24 క్వింటాళ్ల నకిలీ పత్తివిత్తనాలు, 4వేల ప్యాకెట్లు స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ

వికారాబాద్‌ : నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను యాలాల, దౌల్తాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టుచేసి వారి నుంచి రూ.27లక్షల విలువైన, 26.24క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు, లేబుల్‌ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నా డు. శనివారం వికారాబాద్‌లో ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నారాయణ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ నేతృత్వంలో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటుచేసి నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే ముఠాను పట్టుకున్నామన్నారు. యాలాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వేమారెడ్డి వద్ద 250కిలోల నకిలీ పత్తి విత్తనాలతోపాటు 2వేల లేబుల్‌ కవర్లను గుర్తించారని, అతడిని విచారిస్తే సత్యారెడ్డి సరఫరా చేస్తున్నాడని చెప్పగా అతని వద్ద కూడా 300కిలోల పత్తి విత్తనాలు 2వేల లేబుల్‌ కవర్లను స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ వెల్లడించారు. సత్యారెడ్డి నారాయణపేట్‌ జిల్లాలోని నాగిరెడ్డిపల్లి వద్ద నుంచి తీసుకువస్తున్నాడని చెప్పగా అక్కడ కూడా 1677 నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనలో వేమారెడ్డి, సత్యారెడ్డిలను అరెస్టు చేయగా రవి పరారీలో ఉన్నాడన్నారు. దౌల్తాబాద్‌ మండలంలో జయవర్ధన్‌రెడ్డి వద్ద 20కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారని, అతడిని విచారించగా మద్దునేని వేణు సరఫరా చేశాడని చెప్పగా అతని నుంచి 62 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వేణుని విచారించగా వెంగయ్య తమకు సరఫరా చేశాడని తెలిపారు. వెంగయ్య పరారీలో ఉం డగా అతడి గోడౌన్‌ వద్ద 311కిలోల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని జయవర్ధన్‌రెడ్డి, వేణును అరెస్టు చేసినట్లు తెలిపారు. యాలాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2227కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 4వేల లేబుల్‌ కవర్లు, దౌల్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 393కిలోల నకిలీ పత్తి విత్తనాలు మొత్తంగా 26.24 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు, 4వేల లేబుల్‌ కవర్లు, ఒక ప్యాకింగ్‌ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామని ఎస్పీ తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల విలువ రూ. 27లక్షలు ఉంటుందన్నారు.

తాజావార్తలు


logo