బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Jun 21, 2020 , 03:40:52

సీజనల్‌ వ్యాధులను నివారించండి..

సీజనల్‌ వ్యాధులను నివారించండి..

సమీక్ష సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారిని నియంత్రించాలంటే సీజనల్‌ వ్యాధులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో హరితహారం, సీజనల్‌ వ్యాధుల నివారణ, రైతు వేదికలు, కల్లాల నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, జిల్లా అడిషనల్‌ కలెక్టర్లు హరీశ్‌, ప్రతీక్‌ జైన్‌, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వానకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశంఉందని, శానిటైజేషన్‌పై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అన్నారు. ప్రధానంగా నీటి నిల్వలను తొలగించడం, చెత్త కుప్పలు ఎత్తేయడం, దోమలు ఉత్పత్తి కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం తదితర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డెంగీ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఈ వ్యాధితో రక్తంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గి కరోనా రావడానికి మరింత అవకాశం ఉంటుందని మంత్రి హెచ్చరించారు. గతేడాది అధికంగా డెంగీ కేసులు నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

జిల్లాలో 58 లక్షల మొక్కలు నాటే లక్ష్యం

ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆరో విడుత హరితహారంలో జిల్లాలో 57.90 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. ఈ లక్ష్యానికి మించి మొక్కలు నాటడం ద్వారా జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో ఉంచాలని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో అటవీ శాఖ ద్వారా 34 లక్షల మొక్కలు పెంచారని, అదేవిధంగా జిల్లాలోని 560 పంచాయతీల్లో నర్సరీల ద్వారా 52 లక్షల మొక్కలు పెంచామని వెల్లడించారు. రెండు లేదా మూడు ఫీట్లు ఉన్న మొక్కలనే నాటనున్నట్లు తెలిపారు. జిల్లాలో అటవీశాఖ ద్వారా 8లక్షల మొక్కలు, పంచాయతీ రాజ్‌, డీఆర్‌డీవో ద్వారా 34 లక్షలు, మున్సిపాలిటీల్లో 9 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించామన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. ఇందుకుగాను కాలనీలో లేఅవుట్‌ ఓపెన్‌ స్పెస్‌లలో మొక్కలు విరివిగా నాటాలన్నారు. ప్రతి ఇంటికీ కనీసం 5 మొక్కలు అందజేసి, వాటిని సంరక్షించేలా చూడాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద తీరేలా పండ్లు, ఫలాలు ఇచ్చే చెట్లను పెంచేందుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎక్కడైనా 500 గజాల ఖాళీ స్థలం ఉంటే కనీసం 10 వేల మియావాకీ మొక్కలు పెంచేందుకు వీలుంటుందన్నారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఈ మియావాకీ వనాల పెంపునకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఆరో విడుత హరితహారాన్ని యజ్ఞంలా చేపట్టాలని, ఇందులో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని తెలిపారు. హరితహారంలో ఉత్తమ ప్రగతి కనబర్చిన అధికారులకు ప్రత్యేక పురస్కారాలు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. 

రూ.7.50 కోట్లతో కల్లాల నిర్మాణం 

జిల్లాలో దాదాపు రూ.7.50 కోట్ల వ్యయంతో కల్లాల నిర్మాణం (డ్రైయింగ్‌ ప్లాట్‌ ఫార్మ్‌) చేపడుతున్నామని మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. స్థలాల అందుబాటును బట్టి ఒక్కో కల్లం నిర్మాణానికి రూ.56వేలు, రూ.85వేలతో చేపడుతున్నామన్నారు.  కల్లాల నిర్మాణానికి ఈనెల 30వ తేదీ లోగా రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు, ఎండీవోలకు ప్రతిపాదనలను సమర్పించాలని కోరారు. ఈ కల్లాల నిర్మాణాలను నెలన్నర సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో రైతు క్లస్టర్లకు ఒకటి చొప్పున రైతు వేదిక నిర్మిస్తామని, ఒక్కో దానికి రూ.22 లక్షలు కేటాయించనున్నామని మంత్రి మరోసారి వెల్లడించారు.


logo