గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jun 21, 2020 , 03:39:20

హరితహారానికి సిద్ధం

హరితహారానికి సిద్ధం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరో విడుత హరితహారం కార్యక్రమానికి రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25న ఈ  కార్యక్రమాన్ని పరిగిలో మంత్రి సబితారెడ్డి ప్రారంభించనున్నారు. ఒకేరోజు ఇక్కడ పదివేల మొక్కలు నాటేందుకు చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరిశీలించారు. వికారాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది  77.96 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, రంగారెడ్డి జిల్లాలో 57.90 లక్షల మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అటవీశాఖతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో  మొక్కలను సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్‌ సూచనల  మేరకు రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. గుంతలు తీసే ప్రక్రియ నుంచి మొక్కలకు నీళ్లు పోయడం, సంరక్షించడం తదితరాల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జియోట్యాగింగ్‌తో వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఐదువందల గజాల స్థలం ఖాళీగా ఉన్నా పెద్దసంఖ్యలో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేశారు. వికారాబాద్‌ జిల్లాలో 1250 ఎకరాల్లోని అడవుల్లో ఇప్పటికే పునరుజ్జీవ కార్యక్రమం పూర్తయింది. రంగారెడ్డి జిల్లాలోని మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. 

 • ఈ నెల 25న హరితహారం కార్యక్రమం షురూ
 • పరిగిలో్ర పారంభించనున్న మంత్రి సబితారెడ్డి
 • వికారాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది లక్ష్యం 77.96 లక్షల మొక్కలు
 •  గ్రామ పంచాయతీల్లో 26.03 లక్షలు,..
 • నాలుగు మున్సిపాలిటీల్లో 2.15 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి
 • శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పకడ్బందీ ప్రణాళికలు
 • రంగారెడ్డి జిల్లా లక్ష్యం 57.90లక్షల మొక్కలు
 • 500 గజాల ఖాళీ స్థలం ఉన్నా  మొక్కలను పెంచేందుకు ఏర్పాట్లు
 • 9.60లక్షల మొక్కలను 3 కార్పొరేషన్లు,12 మున్సిపాల్టీలలో నాటాలని  నిర్ణయం 
 • ప్రతి గ్రామ నర్సరీలో   సిద్ధమైన మొక్కలు
 • ఈ ఏడాది రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంపై ప్రాధాన్యత


వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి సంబంధించి జిల్లా యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లా అటవీశాఖతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటేందుకుగాను నర్సరీల్లో మొక్కలను కూడా సిద్ధం చేశారు. జూన్‌ మొదటి వారం నుంచి మొక్కలను నాటేందుకుగాను గుంతలు తీసే ప్రక్రియ కూడా ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యంలో చేపట్టారు. అయితే ఇప్పటివరకు 5.30 లక్షల గుంతలు తీసే ప్రక్రియ పూర్తికాగా, జిల్లాలోని 566 నర్సరీల్లో 41.38 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ ఏడాది అవెన్యూ ప్లాంటేషన్‌(రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం)కు అధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా ఆయా శాఖలకు నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. మొక్కలను నాటిన అనంతరం విస్మరించకుండా ప్రతి మొక్కనూ బతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. ప్రతి గ్రామపంచాయతీలో నీటి నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సెప్టెంబర్‌ నుంచి మొక్కలకు నీరందించనున్నారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటేందుకు గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్‌ చేస్తున్నారు. ఈ ఏడాది ప్రధానంగా పండ్ల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలను నాటేందుకు ప్రాధాన్యమివ్వనున్నారు.  గతేడాది నాటిన మొక్కల్లో 37 లక్షల మొక్కలు బతుకడంతో ఈ ఏడాది మొక్కలను నాటడంతోపాటు వాటి సంరక్షణకు చర్యలు చేపట్టారు. పర్యావరణాన్ని పెంచడంతోపాటు రాష్ర్టాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చేందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది టార్గెట్‌ 77.96 లక్షల మొక్కలు...

తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 77.96 లక్షల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. అయితే అటవీశాఖ, డీఆర్‌డీఏతోపాటు ఇతర అన్ని శాఖల ఆధ్వర్యంలో 49 లక్షల మేర మొక్కలు, 565 గ్రామపంచాయతీల్లో 26.03 లక్షల మొక్కలు, మున్సిపాలిటీల పరిధిలో 2.15 లక్షల మొక్కలను నాటనున్నారు. ఈ ఏడాది అటవీ శాఖ ఆధ్వర్యంలో 12 లక్షల మొక్కలు, విద్యాశాఖ 1.16 లక్షలు, డీపీవో మరియు డీఆర్డీవో 19.82 లక్షలు, నీటిపారుదల శాఖ 90 వేలు, ఎక్సైజ్‌ శాఖ 3.23 లక్షలు, వ్యవసాయ శాఖ 8 లక్షలు, డీఎంహెచ్‌వో 20 వేలు, పోలీస్‌ శాఖ 50 వేలు, పరిశ్రమల శాఖ 30 వేలు, ఉద్యాన శాఖ లక్ష, జిల్లా సంక్షేమ శాఖ 15 వేలు, గిరిజన సంక్షేమ శాఖ 30 వేలు, రోడ్లు, భవనాల శాఖ 60 వేలు, గనుల శాఖ లక్ష, మార్కెటింగ్‌ శాఖ 7 వేలు, పౌరసరఫరాల శాఖ 6 వేలు, పశుసంవర్ధక శాఖ 10 వేలు, పంచాయతీరాజ్‌ రోడ్లు శాఖ ఆధ్వర్యంలో 54 వేల మొక్కలను నాటనున్నారు. అదేవిధంగా 4 మున్సిపాలిటీల ఆధ్వర్యంలో 2.15 లక్షల మొక్కలను నాటనున్నారు. వికారాబాద్‌ మున్సిపాలిటీలో 80 వేలు, తాండూర్‌లో 78,500, పరిగి మున్సిపాలిటీలో 30 వేలు, కొడంగల్‌ మున్సిపాలిటీలో 26 వేల మొక్కలను నాటేందుకు ప్లాన్‌ చేశారు. అయితే ఈ ఏడాది ప్రధానంగా పండ్లు, పూల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు, టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫలం, దానిమ్మ, బొప్పాయి, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేయగా.. జిల్లావ్యాప్తంగా 566 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. అయితే గతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలకు మొక్కలను పంపిణీ చేసేవారు. ఈ ఏడాది నుంచి ఆయా గ్రామపంచాయతీల్లోనే నర్సరీలను ఏర్పాటు చేసిన దృష్ట్యా ఆయా గ్రామాల్లోని నర్సరీల్లోని ఆయా గ్రామపంచాయతీల్లోనే నాటనున్నారు. ఏదేని నర్సరీలో తక్కువ మొక్కలున్నట్లయితే పక్క గ్రామపంచాయతీలోని నర్సరీ ద్వారా మొక్కలను సేకరించేలా చర్యలు చేపట్టారు. అయితే పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీల్లో ఏయే మొక్కలను నాటాలనే దానిపై చేసిన తీర్మానం ప్రకారం సంబంధిత మొక్కలను గ్రామాల్లోని నర్సరీల్లో పెంచారు. ప్రతి గ్రామాన్ని హరితవనంగా మార్చేందుకుగాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

అడవులను పెంచడంపై దృష్టి...

ఈ ఏడాది అడవులను పెంచడంపై జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అడవులను పెంచడంతోపాటు ఉన్న అడవుల్లో పునరుజ్జీవ కార్యక్రమం ఇప్పటికే పూర్తికాగా, జిల్లావ్యాప్తంగా 250 ఎకరాల్లోని అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేలా అటవీ శాఖ అధికారులు అంతా సిద్ధం చేశారు. జిల్లాలోని ధారూర్‌, తాండూర్‌, అన్నాసాగర్‌, తట్టేపల్లి, కల్కోడ, వికారాబాద్‌ అటవీ ప్రాంతాల్లో మొక్కలను నాటనున్నారు. మైల్వార్‌లో 25 ఎకరాలు, అంతారంలో 25, దుగ్గాపూర్‌లో 50, గుడుపల్లిలో 50, బొంరాస్‌పేట్‌లో 25, కొత్తపల్లిలో 25, మిట్టకోడూర్‌లో 25, అనంతగిరిలో 25, జిన్‌గుర్తిలో 25, ధారూర్‌లో 25, అడికిచెర్లలో 25, నాగసముందర్‌లో 15, రంగంపల్లిలో 15 ఎకరాల్లోని అటవీ ప్రాంతంలో మొక్కలను నాటనున్నారు. టేకు మొక్కలతోపాటు చైనా బాదాం, కానుగ, నెమలి నార, నారవేప, మర్రి, చింత, జువ్వి, ఇప్ప, ఎర్రచందనం, శ్రీగంధం, వేప, మద్ది, సీతాఫల్‌, ఉసిరి తదితర మొక్కలను నాటనున్నారు. జిల్లాలోని 1250 ఎకరాల్లో అడవుల్లో పునరుజ్జీవ కార్యక్రమం పూర్తయింది. ఎండిపోయిన చెట్లను తొలగించడం, పూర్తిగా వంగిపోయిన చెట్లను తొలగించడం తదితర పనులు జిల్లాలోని అడవులకు పునరుజ్జీవం చేశారు. అంతేకాకుండా అటవీ ప్రాంతాల్లో 130 కిలోమీటర్ల మేర తీసిన కందకాలపై గచ్చకాయ మొక్కలను నాటనున్నారు.

అందుబాటులో 41.38 లక్షల మొక్కలు

- డీఆర్‌డీవో కృష్ణన్‌

జిల్లాలో ఈ ఏడాది నిర్దేశించిన 77.96 లక్షల మొక్కలకుగాను ఇప్పటివరకు 41.38 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. గుంతలు తీసే ప్రక్రియ కొనసాగుతున్నది. నాటిన ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్‌ చేస్తాము. ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు కూడా చర్యలు చేపట్టాం. ప్రతి గ్రామపంచాయతీలో నీటి నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, వానకాలం అనంతరం మొక్కలకు నీరందించేందుకు చర్యలు చేపట్టాం. 


logo