గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jun 20, 2020 , 00:31:45

ఆర్టీసీలో కార్గో సేవలు షురూ

ఆర్టీసీలో కార్గో సేవలు షురూ

  • - బస్టాండ్లలో పార్సిల్‌, కొరియర్‌ సెంటర్లు ప్రారంభం

తాండూరు టౌన్‌/కొడంగల్‌/పరిగిటౌన్‌: రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ కొరియర్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టీసీ ద్వారా వినియోగదారులకు మేలైన పార్సిల్‌ సేవలు అందించనున్నట్లు ఆయా డిపోల మేనేజర్లు తెలిపారు. శుక్రవారం తాండూరు ఆర్టీసీ డిపో పరిధిలోని తాండూరు, కొడంగల్‌ బస్టాండ్లలో కొరియర్‌, పార్సిల్‌ సర్వీసు సెంటర్లు ప్రారంభించారు. తాండూరులో డిపో మేనేజర్‌ రాజశేఖర్‌, కొడంగల్‌ బస్టాండ్‌లో కంట్రోలర్‌ ఆర్‌.చక్రధరచారి, పరిగి ఆర్టీసీ బస్టాండ్‌లో డిపో మేనేజర్‌ బద్రినారాయణ కార్గో సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్నాళ్లు ప్రయాణికులకు సేవలు అందించిన ఆర్టీసీలో పార్సిల్‌, కొరియర్‌ సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపారు. ఆర్టీసీకి అనుబంధంగా ఏఎన్‌ఎల్‌ సర్వీసు కొనసాగేదని, ప్రస్తుతం అందుబాటులో లేకపొవడంతో కొరియర్‌ సర్వీసులకు ఇబ్బందులు ఏర్పడిందని తెలిపారు. అసౌకర్యాన్ని గుర్తించిన ఆర్టీసీ యాజమాన్యం కొరియర్‌ సర్వీసును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కొరియర్‌ పంపించే వారు బస్టాండ్‌లో ఉన్న సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కార్గో సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. ఇక నుంచి పార్శిల్స్‌, సరుకు రవాణాను ఆర్టీసీ కార్గో సర్వీసుల్లో తరలిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.


logo