గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jun 20, 2020 , 00:22:22

చెరువులకు మహర్దశ

చెరువులకు మహర్దశ

n జలహితంతో ఉపాధి కల్పన

n ఆయకట్టు స్థిరీకరణతో అన్ని పొలాలకు నీళ్లు

n పిచ్చిమొక్కల తొలగింపుతో పెరుగనున్న నీటి నిల్వ సామర్థ్యం 

n 25 నుంచి జిల్లాలో హరితహారం

n రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

n లాభదాయక సాగే ప్రభుత్వ లక్ష్యం

n కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

వికారాబాద్‌: గ్రామీణులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో జలహితం కార్యక్రమాన్ని చేపట్టిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్‌ కలెక్టరేట్‌లో వివిధ ఇంజినీరింగ్‌ శాఖల అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15 లోగా ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ తాగునీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో 53 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుల నిర్మాణాలను, ఆరు వేల నల్లా కనెక్షన్లను వెంటనే పూర్తిచేయాలన్నారు. తాండూరులోని రాజీవ్‌, ఎన్టీఆర్‌, ఇందిరమ్మ కాలనీల్లో నీటి సరఫరా జరుగడంలేదని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలుపగా, మంత్రి స్పందిస్తూ పబ్లిక్‌ హెల్త్‌, మిషన్‌ భగీరథ అధికారులు పరస్పర సహకారంతో వెంటనే నీళ్లు సరఫరా అయ్యేలా  చూడాలన్నారు. కాంట్రాక్టర్‌ లేని స్థానంలో కొత్త వారిని నియమించి పనులు చేపట్టాలన్నారు. 

రహదారులకు వెంటనే మరమ్మతులు

రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రహదారులు, బ్రిడ్జిల పనులు పూర్తి చేయాలని సూచించారు. వికారాబాద్‌, తాండూరు రహదారి అస్తవ్యస్తంగా ఉందని, వెంటనే మరమ్మతులు చేయాలని తెలిపారు. తాండూరులోని రోడ్డు వైండింగ్‌ పనులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలన్నారు. బ్రిడ్జిల వద్ద అప్రోచ్‌ రోడ్డు పనులను జూలై చివరి వరకు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పరిగి, నస్కల్‌, తాండూరు, కోట్‌పల్లి, దోర్నాల్‌, సిద్దులూరు రోడ్డు పనుల్లో ప్యాచ్‌ వర్కులను 20 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. నీటి పారుదల శాఖ ద్వారా తాండూరు శివసాగర్‌ పనులు పూర్తి కాకపోవడానికి గల కారణాలను మంత్రి సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. మినీ ట్యాంకు బండ్‌ పనులు పూర్తి చేయాలన్నారు. విద్యుత్‌ శాఖ ద్వారా చేపట్టిన ఇప్పపల్లి, కొడంగల్‌, కల్కోడలో సబ్‌స్టేషన్‌ పనులు పూర్తయినట్లు తెలిపారు. గిరిగిట్‌పల్లిలోని సబ్‌స్టేషన్‌ 15 రోజుల్లో పూర్తవుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లా వైద్య శాఖ ద్వారా కరోనా రోగులకు హోంక్వారంటైన్‌ సదుపాయం కల్పించి, ఇంటి వద్దనే వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 

చెరువులు, కాల్వల పునరుద్దరణ..

అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల చెరువుల పునరుద్ధరణతో పాటు ఉపాధి కల్పనే ధ్యేయంగా జలహితం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరువుల పునరుద్ధరణకు రూ.500 కోట్లు, కాల్వల పునరుద్ధరణకు మరో రూ.700 కోట్లు మొత్తంగా 1,200 కోట్లను జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేటాయించారన్నారు. ఈ నెల 25 నుంచి జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. 44 లక్షల పై చిలుకు మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, నియోజకవర్గ, మున్సిపాలిటీల వారీగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ ఎమ్మెల్యేలు ఆనంద్‌, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పౌసుమి బసు పాల్గొన్నారు. 

పరిగిలో..

పరిగి మండలం బర్కత్‌పల్లిలోని ఊరచెరువులో సిల్ట్‌, పిచ్చిమొక్కల తొలగింపు పనులను స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. గ్రామంలోని ఊరుచెరువు సమీపంలో, ప్రధాన రహదారి పక్కన మంత్రి, ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీని నీటి పారుదలశాఖతో అనుసంధానం చేయడం ద్వారా చెరువులకు మహర్దశ పడుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే విడుతల వారీగా చెరువుల పునరుద్ధరణ చేపట్టిందన్నారు. తద్వారా చెరువులలో నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని, ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని అన్నారు. ఈ పథకం ద్వారా చెరువులు, చెరువుకట్టలపై, ఫీడర్‌చానళ్లు, చెరువుల నుంచి పంట పొలాలకు నీరు అందించే కాల్వలోని పిచ్చిమొక్కల తొలగింపు చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. ఉపాధి హామీతో పొలాల వద్ద షెడ్లు, రోడ్ల నిర్మాణం చేసుకోవచ్చన్నారు. చెరువుల పునరుద్ధరణతో ఆయకట్టు స్థిరీకరణ జరిగి అన్ని పొలాలకు నీరు అందుతుందని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో కృష్ణన్‌, ఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ కె.అరవిందరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజేందర్‌, సర్పంచ్‌ రాంచంద్రయ్య, నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ సుందర్‌, డిప్యూటీ ఈఈ కృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురేందర్‌కుమార్‌, నార్మాక్స్‌ డైరెక్టర్‌ వెంకట్‌రాంరెడ్డి, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.అశోక్‌వర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు అన్వర్‌హుస్సేన్‌, హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు. 

కడ్తాల్‌లో..

వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని, దానికి ప్రణాళికలు రూపొందించిందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. జలహితం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని ముద్విన్‌ గ్రామంలో కర్ణామోని చెరువులో అభివృద్ధి పనులను ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌, జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, సర్పంచ్‌ యాదయ్యతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని చెరువులు, కుంటల్లోని కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. వానకాలంలో చెరువులు, కుంటలు నిండితే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అన్నదాతలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. రైతులకు పెట్టుబడితోపాటు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కడ్తాల్‌, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాలకు సాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

తాగునీటి సమస్యకు శాశ్విత పరిష్కారం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథతో తాగునీటి సమస్యకు శాశ్వితంగా పరిష్కారం లభించిందని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని చరికొండ పంచాయతీలో గల బోయిన్‌గుట్ట తండాలో మిషన్‌ భగీరథ పథకంలో నిర్మించిన వాటర్‌ట్యాంక్‌తోపాటు ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని సర్పంచ్‌ భారతమ్మతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్యాక్స్‌ చైర్మన్‌ వెంకటేశ్‌గుప్తా, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, ఇరిగేషన్‌ ఏఈ గంగారాజు, సర్పంచ్‌లు హరిచంద్‌నాయక్‌, కృష్ణయ్యయాదవ్‌, సాయిలు, తులసీరాంనాయక్‌, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ వీరయ్య, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్‌, గోపాల్‌, రాములుగౌడ్‌, మంజుల, నిర్మలదేవి, ఉప సర్పంచ్‌లు వినోద్‌, నరేశ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.


logo