సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Jun 19, 2020 , 00:49:42

ఇంటర్‌ ఫలితాల్లో 63 శాతం ఉత్తీర్ణత

ఇంటర్‌ ఫలితాల్లో 63 శాతం ఉత్తీర్ణత

* రాష్ట్రస్థాయిలో జిల్లాకు 18వ స్థానం

* బాలికలు 70, బాలురు 54 శాతం ఉత్తీర్ణత

* ప్రథమ సంవత్సరంలో 50 శాతం ఉత్తీర్ణత

* మెరిసిన ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ,  మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ విద్యార్థులు

* రీ కౌంటింగ్‌కు ఈ నెల 24 వరకు గడువు

* త్వరలో సప్లిమెంటరీ పరీక్షల తేది ప్రకటన

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలకు సంబంధించి జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంటర్‌ ఫలితాల్లో అధిక మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో 63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి జిల్లా రాష్ట్రస్థాయిలో 18వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా జిల్లాలో ఉత్తీర్ణత శాతంలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. గతేడాది కూడా ఇంటర్‌ ఫలితాల్లో 56 శాతం మేర విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోనూ ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం గతేడాదితో పోలిస్తే  7 శాతం పెరగడం గమనార్హం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రత్యేక శ్రద్ధ వహించి అనుకున్న ఫలితాలు రాబట్టారు.మరోవైపు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు ఈ నెల 24 వరకు ఇంటర్‌ బోర్డు అవకాశమిచ్చింది. అదేవిధంగా అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి కరోనా వైరస్‌ ప్రభావం దృష్ట్యా త్వరలోనే సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.  

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా 18వ స్థానం...

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో మేడ్చల్‌ జిల్లా నిలువగా, జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 6954 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరుకాగా 63 శాతం ఉత్తీర్ణతతో 4365 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 3062 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 54 శాతంతో 1655 మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. 3892మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 70 శాతంతో 2710 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షా ఫలితాల్లోనూ రాష్ట్రస్థాయిలో జిల్లా 22వ స్థానంలో నిలువగా 50 శాతం మేర విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో మొత్తం 9209 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 4601 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 63 శాతంతో బాలికలు ఉత్తీర్ణతతో ముందంజలో ఉండగా 41 శాతం ఉత్తీర్ణతతో బాలురు పూర్తి వెనుకంజలో నిలిచారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 4852 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా 2815 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు. 4357 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 1786 మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి జిల్లాలో 639 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 64 శాతం ఉత్తీర్ణతతో 414 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 216 బాలురు పరీక్షలకు హాజరుకాగా 48శాతం ఉత్తీర్ణతతో 105 మంది బాలురు, 423 బాలికలు పరీక్షలకు హాజరుకాగా 73 శాతం ఉత్తీర్ణతతో 309 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఇంటర్‌ ఒకేషనల్‌ ప్రథమ సంవత్సర ఫలితాలకు సంబంధించి మొత్తం 1072 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 59 శాతం ఉత్తీర్ణతతో 633 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 367 బాలురు పరీక్షలకు హాజరుకాగా 43 శాతం ఉత్తీర్ణతతో 158 మంది బాలురు, 705 బాలికలు పరీక్షలకు హాజరుకాగా 67 శాతం ఉత్తీర్ణతతో 475 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు.

మెరిసిన ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ విద్యార్థులు...

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, మోడల్‌ స్కూళ్లకు సంబంధించిన పలువురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. జిల్లాలోని నవాబుపేట్‌ మోడల్‌ స్కూళ్లో ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన యు.భువనేశ్వరి(ఎంపీసీ-932),  బేగరి హంస(బీపీసీ-905), ప్రథమ సంవత్సరంలో ఫత్తేపురం లక్ష్మి(సీఈసీ-441) మార్కులు సాధించారు. పరిగి మండలం జాఫర్‌పల్లిలోని ప్రభుత్వ మోడల్‌ స్కూళ్లో పి.మౌనిక(ఎంపీసీ-968 మార్కులు), నిఖిల్‌ కుమార్‌(456 మార్కులు-ఎంపీసీ, ప్రథమ సంవత్సరం) మార్కులు సాధించారు. వికారాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో కె.మాధవి(886 మార్కులు-ఎంపీసీ), శ్వేత(802 మార్కులు-ఎంపీసీ), సనా బేగం(894 మార్కులు-బైపీసీ) మార్కులు సాధించారు. కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీతోపాటు కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో 8 మంది విద్యార్థులు 900లకుపైగా మార్కులు సాధించారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఎస్‌.శిరీష-913 మార్కులు(హెచ్‌ఈసీ), విక్రం-913 మార్కులు(బైపీసీ), జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో మహేశ్‌-964 మార్కులు(బైపీసీ), సత్యనారాయణ-948 మార్కులు(బైపీసీ), మహేందర్‌-960 మార్కులు(ఎంపీసీ), శ్రీను-905 మార్కులు(ఎంపీసీ) సాధించారు. అదేవిధంగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో భవాని-908 మార్కులు (ఎంపీసీ),  అనూష-906 మార్కులు(బైపీసీ) సాధించారు. పెద్దేముల్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో బి.నవనీత-907 మార్కులు(సీఈసీ)లతో ఉత్తీర్ణులయ్యారు. 


logo