మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Jun 18, 2020 , 00:15:14

పూర్తయిన జిల్లా టీఆర్‌ఎస్‌ భవన్‌ నిర్మాణం

పూర్తయిన జిల్లా టీఆర్‌ఎస్‌ భవన్‌ నిర్మాణం

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. పనులు వారం రోజుల క్రితమే పూర్తికాగా.. ఈ భవనాన్ని త్వరలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాలతో ప్రారంభించిన నిర్మాణ పనులు ఏడాదిలోగా పూర్తి చేశారు.

ఈ భవనంలో పార్టీ కార్యాలయం, సమావేశ మందిరం, వాచమన్‌ గది, వంట గదులు, మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లను నిర్మించడంతో పాటు చుట్టూ ప్రహరీని నిర్మించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. రోజుకు 50 మంది కూలీలతో నిర్మాణ పనులు జరిగాయి. వికారాబాద్‌ పట్టణంలోని సర్వే నెంబర్‌ 290లోని ఒక ఎకరా స్థలాన్ని టీఆర్‌ఎస్‌ కార్యాలయం భవనానికి ప్రభుత్వం కేటాయించగా, గతేడాది జూన్‌ 24న పనులకు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పట్నం సునీతామహేందర్‌రెడ్డి భూమిపూజ చేశారు.  జులై రెండో వారంలో పార్టీ అధిష్టానం నిర్మాణానికిగాను రూ.60 లక్షల చెక్కు అందజేసింది. 

తీరనున్న ఇబ్బందులు..

ప్రస్తుతం పార్టీ సమావేశాలు వికారాబాద్‌ పట్టణంలోని ఆయా ఫంక్షన్‌హాళ్లలో నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొన్నది. జిల్లా టీఆర్‌ఎస్‌ భవన్‌ అందుబాటులోకి వస్తే పార్టీ సమావేశాలు నిర్వహించేందుకు ఇబ్బందులు తీరనున్నాయి. భవనంలోని సమావేశ మందిరంలో ఒకేసారి వెయ్యి మందికిపైగా కూర్చునేలా విశాలంగా నిర్మించారు. జిల్లా పార్టీ సమావేశాలతోపాటు నియోజకవర్గ, మండల, పట్టణ సమావేశాలను కూడా ఇక్కడే నిర్వహించుకోవచ్చు.  అయితే భవనం పనుల్లో కొంత జాప్యం జరిగింది. వికారాబాద్‌ పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఉద్యానశాఖకు సంబంధించిన స్థలం నల్లరేగడి నేల కావడంతో కొద్దిగా నీరు వచ్చినా బురదమయంగా మారుతుంది. దీంతో భవనం నిర్మాణం ప్రారంభంలో నెలరోజులపాటు పనులకు ఆంటంకం కలిగింది. 

 ప్రారంభించనున్న కేటీఆర్‌..

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ భవన్‌ను ప్రారంభించనున్నారు. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మొదట పనుల్లో జాప్యం జరిగినా నిర్ణీత గడువులోగా భవన నిర్మాణ పనులు పూర్తి చేశాం. ఇకపై పార్టీ సమావేశాలకు సమావేశ మందిరం అందుబాటులోకి రానున్నది. 

-  పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ


logo