మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Jun 17, 2020 , 23:53:53

వికారాబాద్‌ జిల్లాలో 52కు చేరిన సంఖ్య

 వికారాబాద్‌ జిల్లాలో 52కు చేరిన సంఖ్య

  •  ఏడుకు చేరిన యాక్టివ్‌ కేసులు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి, బొంరాసుపేట్‌ మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తితోపాటు దోమ మండలం దొంగ ఎన్కెపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో పాజిటివ్‌ నిర్ధ్దారణ అయిన వారికి జ్యువెల్లరీ దుకాణం, వస్త్ర దుకాణం ఉండడంతో వారి కుటుంబ సభ్యులతోపాటు జ్యువెల్లరీ, వస్త్ర దుకాణంలో పనిచేసే వారు కలిపి ఇప్పటి వరకూ 31 మందిని ప్రైమరీ కాంటాక్ట్స్‌గా జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు గుర్తించడంతోపాటు వారిలో లక్షణాలున్న వారి నుంచి శాంపిల్స్‌ కూడా సేకరించారు. అంతేకాకుండా సెకండ్‌ కాంటాక్ట్స్‌కు సంబంధించి నేడు గుర్తించనున్నారు.

మరోవైపు బొంరాసుపేట్‌ మండలం తుంకిమెట్లలో పాజిటివ్‌ నిర్ధ్దారణ అయిన వ్యక్తి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌గా గుర్తించిన 14 మందిని హోంక్వారంటైన్‌ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 52 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు మృతిచెందగా, మరో 44 మంది కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.  ప్రస్తుతం ఏడుగురు మాత్రమే గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 31,864 మందిని గృహ నిర్బంధంలో ఉంచగా, 28,752 మంది 28 రోజుల హోంక్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతీ ఇంటింటికి వెళ్లి జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలున్నాయా? లేదా? అనే వివరాలను సేకరిస్తున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలున్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు సమాచారమిస్తున్నారు. logo