శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Jun 16, 2020 , 23:00:29

పూర్తయిన నాలా రికార్డుల సవరణ

పూర్తయిన నాలా  రికార్డుల సవరణ

  • రూ.12.39 కోట్లు ఆదా
  • 12,394 ఎకరాల   వ్యవసాయేతర    భూముల గుర్తింపు 
  • రైతుబంధు జాబితా నుంచి తొలగింపు
  • కొన్నేండ్లుగా రికార్డుల్లో వ్యవసాయ  భూమిగానే చలామణి
  • రూ.18 కోట్ల మేర నష్టపోయిన ప్రభుత్వం 

నాలా(నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌) రికార్డుల సవరణతో ప్రభుత్వానికి రూ.12.39కోట్లు ఆదా అయ్యాయి. లే అవుట్లు, రహదారులు, కాల్వలకు సేకరించిన భూములను అధికారులు రికార్డుల్లో సవరించలేదు. దీంతో కొన్నేండ్లుగా వ్యవసాయ భూములుగానే చలామణి అవుతున్నాయి. అంతేకాకుండా రైతుబంధు పథకం కింద  ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం కూడా అందుతున్నది. దీనివల్ల రెండేండ్లుగా దాదాపు రూ.18 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. చివరకు రెవెన్యూశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,394 ఎకరాల వ్యవసాయేతర భూములను గుర్తించి రికార్డుల సవరణ ప్రక్రియను పూర్తిచేశారు.  దీంతో ప్రభుత్వ ఖజానా నష్టానికి చెక్‌ పడింది.

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో నాలా (నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌) రికార్డుల సవరణ ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.12కోట్లపైనే ఆదా అయ్యింది. వ్యవసాయేతర భూములుగా మారిన భూములు ఇంకా వ్యవసాయ భూములుగానే రెవెన్యూ రికార్డుల్లో కొనసాగుతున్నాయి. అయితే నాలా రికార్డుల్లో గుర్తించని భూముల వివరాలను జిల్లా రెవెన్యూ యంత్రాంగం రికార్డులను సవరించింది. లే అవుట్లు, రహదారుల కోసం ప్రభుత్వం సేకరించిన భూముల రికార్డులను అధికారులు సరి చేశారు. అయితే గతంలో వ్యవసాయ భూములుగా ఉన్న భూములను లే అవుట్లుగా మార్చేందుకు చాలావరకు వ్యవసాయేతర భూములుగా మార్చుకున్నారు. లే అవుట్లు ఏర్పాటు చేసి ప్లాట్లుగా కూడా విక్రయించారు. అయితే సంబంధిత భూములను మాత్రం మొన్నటివరకు వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. వసాయేతర భూములుగా మారిన అనంతరం కూడా రెవెన్యూ సిబ్బంది వెంటనే భూ రికార్డులు సరి చేయకపోవడంతో వ్యవసాయ భూములుగానే ఉండిపోయాయి. జిల్లాలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులు నాలా రికార్డుల్లో చేర్చలేదు. దీంతో రెండేండ్లుగా రైతుబంధు పథకంలో భాగంగా సంబంధిత భూములకు పెట్టుబడి సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నది. అయితే వ్యవసాయ భూములు తక్కువున్నప్పటికీ రైతుబంధు పెట్టుబడి సాయం ఎక్కువ మొత్తంలో ఖర్చు ఎందుకు అవుతుందనే దానిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆదేశించడంతో వ్యవసాయేతర భూముల వివరాలను నాలా రికార్డుల్లో పొందుపర్చారు.

ప్రభుత్వ ఖజానాకు రూ.12.394 కోట్లు ఆదా...

జిల్లాలో నాలా రికార్డులను సవరించడంతో వ్యవసాయేతర భూములుగా ఉన్న 12,394 ఎకరాల భూములను వ్యవసాయేతర భూములుగా గుర్తించి, రికార్డులను సరి చేశారు. దీంతో రైతుబంధు పథకం కింద పెట్టుబడి నిమిత్తం ప్రభుత్వం అందిస్తున్న ఏడాదికి రూ.10వేల ఆర్థిక సాయం చొప్పున 12,394ఎకరాలకు అందించే రూ.12.394కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా అయ్యాయి. సంబంధిత వ్యవసాయేతర భూములుగా మారిన భూముల రికార్డులను సవరించకపోవడంతో రెండేండ్లుగా దాదాపు రైతుబంధు కింద రూ.18కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరింది. లే అవుట్లుగా మారిన భూములు, రహదారుల నిర్మాణం నిమిత్తం సేకరించిన భూములు, చెరువులకై సేకరించిన భూముల వివరాలను సవరించారు. జిల్లావ్యాప్తంగా 4683మంది రైతులు తమ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు.  ఈ వానకాలం  నుంచి సంబంధిత భూములకు రైతుబంధు ఆర్థిక సాయం అందకుండా రైతుబంధు జాబితా నుంచి  తొలిగించారు. 

నాలా రికార్డులను సవరించాం...

వ్యవసాయేతర భూముల వివరాలను నాలా రికార్డుల పొందుపర్చి రికార్డులను సవరించామని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ తెలిపారు. లే అవుట్లుగా ఏర్పడిన భూములు, రహదారులకై సేకరించిన తదితర భూముల వివరాలను గుర్తించి నాలా రికార్డులను సరిచేశామన్నారు. సంబంధిత భూములకు సంబంధించిన ఖాతాలన్నింటికీ ఈ వానకాలం సీజన్‌ నుంచి రైతుబంధు ఆర్థిక సహాయం నిలిచిపోతుంది, ఈ ప్రక్రియతో ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి సుమారు రూ.12 కోట్లపైనే ఆదా కానుందన్నారు.  - అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌logo