శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Jun 15, 2020 , 23:49:32

మున్సిపాలిటీల రూపురేఖలు మారుస్తాం..

మున్సిపాలిటీల రూపురేఖలు మారుస్తాం..

  • తాండూరులో నాపరాయి ఇండస్ట్రీయల్‌ పార్కు...
  • ప్రతిపాదనలను పంపాలని అధికారులకు ఆదేశం
  • అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయండి
  • హరితహారం కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున చేపట్టాలి
  • ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించండి
  • అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు
  • వికారాబాద్‌, తాండూరు, పరిగి మున్సిపాలిటీల అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష
  • పాల్గొన్న మంత్రి సబితారెడ్డి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీల రూపురేఖలను మార్చే విధంగా అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రగతిభవన్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణం తదితర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. తాండూరులో నాపరాయి ఇండస్ట్రీయల్‌ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపాలని అధికారులను ఆదేశించారు. తాండూరు మున్సిపాలిటీకి మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని మంజూరు చేస్తునట్లు మంత్రి వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా మూడు మున్సిపాలిటీల్లో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని సూచించారు.  జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌(భూక్రమబద్ధీకరణ పథకం)పై అవగాహన కల్పించి, నిర్ణీత సమయంలోగా అందరిని భాగస్వాములను చేయాలని సూచించారు. 

     తాండూరు బైపాస్‌ రోడ్డు పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని, రైతు బజార్‌ను ఇంటిగ్రేటెడ్‌ రైతు బజారుగా మార్చేందుకు ప్రణాళికను రూపొందించాలని అధికారులను సూచించారు.  మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని, మున్సిపల్‌ బడ్జెట్‌లో మూడో వంతు నిధులు విలీన గ్రామాలకు కేటాయించి, పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకురావాలని మున్సిపల్‌ చైర్మన్లు, అధికారులకు సూచించారు. తాండూరు మున్సిపాలిటీలోని గంజిని మర్వాడీలు దానం చేసిన 9 ఎకరాల స్థలంలోకి మార్చాలని అధికారులను తెలిపారు. కొన్నేళ్లుగా ఉన్న పాత తాండూరు-కొత్త తాండూరు మధ్యలోని అండర్‌ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలన్నారు. తాండూరు, వికారాబాద్‌ మున్సిపాలిటీలకు మినీ స్టేడియంల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కోరగా మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు.  వికారాబాద్‌ మున్సిపాలిటీలోని అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని, పట్టణంలోని జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం పక్కన ఉన్న ఉద్యానవన శాఖ స్థలంలో పర్యాటకులను ఆకర్షిచే విధంగా ఏర్పాట్లు చేయాలని, డిగ్రీ కాలేజీ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోరగా కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. 

       అంతేకాకుండా వికారాబాద్‌ మున్సిపాలిటీలోని అవసమున్న ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు, ఎన్‌టీఆర్‌, బీజేఆర్‌ చౌరస్తాల సుందరీకరణ పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.  మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరు చేసిన రూ.15 కోట్లు, మున్సిపల్‌ భవన నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులను విడుదల చేయాలని పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు విన్నవించారు.  ఈనెల 19న మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి పేర్కొన్నారు.  

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, వికారాబాద్‌, తాండూరు, పరిగి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, కొప్పుల మహేశ్‌ రెడ్డి, వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజుల, తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌, మూడు మున్సిపాలిటీల వైస్‌ చైర్మెన్లు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. logo