ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jun 15, 2020 , 00:06:37

పరిశుభ్రతతో అనారోగ్యాలు దూరం

పరిశుభ్రతతో అనారోగ్యాలు దూరం

  • నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి
  •  ప్రజలందరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలి
  • దోమల నివారణకు తులసి, నిమ్మగడ్డ మొక్కలు నాటాలి
  •  ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌

వికారాబాద్‌ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం వికారాబాద్‌లో ఎమ్మెల్యే ఇంటి పరిసరాల్లో సతీమణి సబితాతో కలిసి పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. అందులో భాగంగా ఇంటి పరిసరాల్లో దోమలు రాకుండా ఉండేందుకు కృష్ణ తులసి, నిమ్మగడ్డ మొక్కలను నాటారు. ఇంట్లో చెట్ల పొదల్లోని చెత్తను తొలిగించారు. చెత్తాచెదారం తీసివేసి దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పాటు కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. దోమల నివారణతో మలేరియా, డెంగ్యూ వంటి అంటు వ్యాధులు, సీజనల్‌ వ్యా ధులు కూడా రాకుండా నివారించవచ్చని చెప్పారు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవడం ద్వారా రాష్ర్టా న్ని, దేశాన్ని రోగ రహితంగా ఉంచుకోవచ్చన్నారు. ఇప్పటికే ప్రభుత్వం  పచ్చదనం, పరిశుభ్రత, పల్లె ప్రగతి, పట్టణ  ప్రగ తి, స్వచ్ఛ భారత్‌ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఆయా కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందన్నారు. 

తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి

వికారాబాద్‌ టౌన్‌ : పట్టణంలోని ప్రతి వార్డుల్లోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల అన్నారు. ఆదివారం వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని మద్గుల్‌ చిట్టంపల్లిలో యాంటీ లార్వా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ పట్టణవాసులందరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వర్షాకాలం కావడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతారని, ప్రజలందరూ తప్పని సరిగా మాస్కులు వేసు కొని బయటకు రావాలన్నారు. ఆహారం తినే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. మురుగు కాలువలు పరిశుభ్రంగా ఉంచేలా వార్డు కౌన్సిలర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. రోడ్లపై ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా మట్టి పోయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, మద్గుల్‌ చిట్టంపల్లి కౌన్సిలర్‌ గోపాల్‌, గుడుపల్లి వార్డు కౌన్సిలర్‌ సంతోశ్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

‘సమస్యలను గుర్తించి పరిష్కరిస్తా’

వికారాబాద్‌ రూరల్‌ : గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కారాని కృషి చేస్తానని సర్పంచ్‌ మల్లమ్మ అన్నారు. ఆదివారం మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో యాంటీ లార్వా కార్యక్రమం నిర్వహించారు. వర్షాలు ప్రారంభమైనందున గ్రామంలోని ప్రధాన వీధులు చిత్తడిగా మారి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని గుర్తించి కంకరపై మట్టి వేయించామన్నారు. గ్రామంలోని నెలకొన్న మురుగు సమస్యను కూడా పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. 


logo