శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Jun 14, 2020 , 23:28:27

నియంత్రిత పంటల సాగే మేలు

నియంత్రిత పంటల సాగే మేలు

  • పంట మార్పిడితోనే అధిక దిగుబడులు
  • సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్న 
  • రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం

వికారాబాద్‌ రూరల్‌ : ప్రభుత్వం రైతును రాజు చేయాలనే గొప్ప సంకల్పంతో ఎన్నో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా రైతన్న కూడా అడుగులు వేస్తున్నాడు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నూతన వ్యవసాయ విధానంతో తీసుకువచ్చిన నియంత్రిత పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. అదేవిధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మండలంలో పులుమద్ది, ఎర్రవల్లి, మదన్‌పల్లి, అత్వెల్లి, నారాయణ్‌పూర్‌ తదితర గ్రామాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో అత్యధికంగా ఎర్ర రేగడి నేలలు ఉండడంతో గతంలో చెరుకు, అల్లం, పసుపు పంట వేసేవారు. పత్తి, మక్కజొన్న పంట వచ్చిన తర్వాత వాటిని మర్చిపోయారు. ఈసారి  ప్రభుత్వం తీసుకున్న నియంత్రిత నిర్ణయానికి అనుగుణంగా రైతన్న మళ్లీ పాత పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మండలంలో 200 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. మార్పు దిశగా పోతే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతున్నది. ఇలా అధికారులు కూడా రైతన్నకు మరింత ప్రోత్సాహం అందిస్తే పంట మార్పు సాధ్యమే అనిపిస్తున్నది. ప్రభుత్వం ప్ర తి రైతుకు రైతుబంధు ద్వారా రూ.10వేలు అందిస్తున్నది. కేంద్రం కూడా ఎకరానికి రూ.2 వేలు అందిస్తున్నది. గ్రామాల్లో రైతులు దుక్కులను దున్ని విత్తనాలు విత్తుతున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచామని అధికారులు చెబుతున్నారు. 

 పంట మార్పిడితో అధిక దిగుబడులు

మండలంలోని రైతులు నియంత్రిత పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. భూ సార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని, ఎంత పంటలో ఏయే మోతాదులో ఎరువులు వేయాలని అవగాహన కల్పిస్తున్నారు. చిరుధాన్యాలతో లాభాలు వస్తాయని వివరిస్తున్నారు. మండలంలో రకరకాల పంటలను సాగు చేస్తున్నారు. వానకాలం సమీపిస్తుండడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు. 


logo