గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jun 13, 2020 , 01:12:29

పాడి రైతుకు అండగా..

పాడి రైతుకు అండగా..

l రెండు దశలలోకిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

l పాడి పరిశ్రమకు ప్రభుత్వం ప్రోత్సాహం

l ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రుణాలు

l రంగారెడ్డి జిల్లాలో 12,625 మంది అర్హులు

l వికారాబాద్‌లో 27,171 మంది గుర్తింపు 

l పాడి రైతులకు రూ.1.6లక్షల వరకు  రుణాలు

l మొదటి దశ  గడువు  ఈనెల 31  

రంగారెడ్డి/వికారాబాద్‌ నమస్తే తెలంగాణ : పాడి రైతులను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. పాడి రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో సర్కార్‌ ముందుకు వెళ్తున్నది. కిసాన్‌ క్రెడిట్‌కార్డు (కేసీసీ) పాడి రైతుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా రైతులకు వారి స్వల్పకాలిక ఉత్పత్తులను సాధించడం కోసం అవసరమయ్యే రుణాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. కిసాన్‌ క్రెడిట్‌కార్డు ద్వారా రైతులకు ఖర్చుకు తగ్గట్టుగా రుణాలు చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు. కిసాన్‌ క్రెడిట్‌కార్డు వల్ల సరళీకృతమైన రుణాల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవచ్చు. డబ్బుల కోసం రైతులు ఇబ్బందులు పడొద్దని నిర్ణయించారు. ఈ నెల 5న కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. విజయ డెయిరీ, మదర్‌ డెయిరీలలో సభ్యులుగా ఉన్న పాడి రైతులను గుర్తించారు. వీరికి డెయిరీ మిల్క్‌ యూనిట్స్‌ పెంచుకోవడానికి కిసాన్‌ క్రెడిట్‌కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిలో భాగంగా ప్రతి రైతును మరింతగా ప్రోత్సహించేందుకు ఈ రెండు డెయిరీలలో సభ్యులుగా ఉన్న 12,625మంది పాడి రైతులకు ఎలాంటి హామీ లేకుండా బ్యాంకుల నుంచి రైతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పాడి రైతుకు గరిష్టంగా రూ.1.6లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. అన్ని వాణిజ్య బ్యాంకులు ఈ రుణాలు ఇచ్చేందుకు ముందుకువచ్చాయి. అర్హత ఉన్న ప్రతి ఉన్న ప్రతి రైతుకు ఒక కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, పాస్‌ బుక్‌ ఇవ్వనున్నారు. అందులో రైతు పేరు, చిరునామా, భూమి వివరాలు, రుణ గరిష్ట పరిమితి, కాల వ్యవధి పొందుపర్చారు. అలాగే వ్యవసాయం, వ్యవసాయంతో సం బంధిత వ్యాపారం కలిగి ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. పశుసంవర్థక రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుదారులు గుర్తింపును తెలిపే పాన్‌కార్డు, ఆధార్‌కార్డు కాఫీ పత్రాలను సమీపంలోని బ్యాంకు శాఖకు సమర్పించాల్సి ఉంటుం ది. రుణ అధికారి రుణ మొత్తాన్ని మంజూరు చేసిన తర్వాత కిసాన్‌కార్డు దరఖాస్తుదారుడికి పోస్టల్‌ ద్వారా రైతులకు అందిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారులు వారి క్రెడిట్‌ పరిమితికి అనుగుణంగా కావాల్సిన గేదెలు కొనుగోలు చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వినియోగదారులు తీసుకున్న క్రెడిట్‌ మొత్తానికి మాత్రమే ప్రభుత్వం వడ్డీని వసూలు చేయనున్నారు.

వచ్చే నెల 31లోపు పూర్తి చేయాలి

- విజయ్‌కుమార్‌, రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (కేసీసీ) పాడి రైతుల జాబితాను సిద్ధం చేస్తున్నాం. విజయ డెయిరీ, మదర్‌ డెయిరీలలో సభ్యులుగా ఉన్న పాడి రైతులను గుర్తించాం. ఈ రెండు డెయిరీలలో సభ్యులుగా ఉన్న 12,625మంది పాడి రైతులు ఉన్నారు. పాడి రైతుకు గరిష్టంగా రూ.1.6లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పాడి పశువులు ఉన్న రైతులకు మళ్లీ అదనంగా గేదెలు కొనుగోలు చేయడానికి లేదంటే, ఉన్న వాటికి మేత కొనుగోలు చేసుకోవచ్చు. పాడి రైతులు ఆర్థికంగా మరింత ప్రోత్సహించేందుకు ఊతమిస్తుంది. కలెక్టర్‌ ఆదేశానుసారం జిల్లాలోని అర్హత ఉన్న పాడి రైతులను ప్రోత్సహించి రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రుణాలు

వికారాబాద్‌ జిల్లాలోని పాడి రైతులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం ది. ఇందులో భాగంగానే జిల్లాలో అర్హులైన పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌కార్డులు అందజేసేందుకు నిర్ణయించింది. అయి తే జిల్లాలో 27,171మంది పాడి రైతులను కిసాన్‌ క్రెడిట్‌కార్డులకు అర్హులుగా గుర్తించారు. కిసాన్‌ క్రెడిట్‌కార్డుల ద్వారా పాడి రైతులకు రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకుగాను నిర్ణయించారు. అర్హులైన పాడిరైతులకు రెండు దశల్లో కిసాన్‌ క్రెడిట్‌కార్డులను అందజేసి రుణాలు మంజూరు చేయనున్నారు. తొలుత ఈనెల 31లోగా 3999మంది పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌కార్డులను అందించేందుకు ఆయా శాఖల అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

జిల్లాలో 28,671 మంది అర్హులు...

జిల్లాలో 27,171మందికి కిసాన్‌ క్రెడిట్‌కార్డులు అందజేయనున్నారు. వీరిలో నార్మక్స్‌ సొసైటీకి సంబంధించిన వారు 2941 మంది కాగా, విజయ డెయిరీకి సంబంధించినవారు 1058మంది ఉన్నారు. మిగతా 23,172మంది ప్రైవేట్‌ కంపెనీలకు పాలను సరఫరా చేసే రైతులు. అయితే తొలుత 3999మంది పాడి రైతులకు ఈనెలాఖరు వరకు కిసాన్‌ క్రెడిట్‌కార్డులను అందజేయనున్నారు. తదనంతరం మిగుతావారికి రెండో విడతలో అందజేయనున్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.1.60లక్షల రుణం పొందవచ్చు. అయితే గతంలో రుణాలు పొంది తిరిగి రెగ్యులర్‌గా చెల్లించేవారికి రూ.3లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. అయితే జిల్లాలో మొత్తం 57పాడి పరిశ్రమలకు సంబంధించిన సొసైటీలున్నా యి. సంబంధిత రుణాలకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండానే రుణాలు మంజూరు చేయనున్నారు. పాడి రైతులు బర్రెలు, ఆవులు, పాడి సంబంధ పరికరాలను కొనుగోలు చేయవచ్చు. మిగతా పాడి రైతులకు జూలై 31వరకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందజేయనున్నారు. ఈనెల మొదటివారం నుంచే కిసాన్‌ క్రెడిట్‌కార్డుల జారీ ప్రారంభమైంది. సంబంధిత రుణాలను పాడి రైతులు నిర్ణీత సమయంలోగా బ్యాంకు అధికారులు నిర్దేశించిన ప్రకారం నెలవారీగా కొంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నెలాఖరువరకు మొదటి విడుత అర్హులకు పంపిణీ...

- వసంతకుమారి, వికారాబాద్‌ జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి 

ఈనెలాఖరు వరకు మొదటి విడుతలో భాగంగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను పాడి రైతులకు అందించనున్నాం. తదనంతరం రెండో విడుతలో మిగుతావారికి అందజేస్తాం. పాడి రైతులకు మంజూరు చేసే రుణాలకు సంబంధించి ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. నిర్ణీత సమయంలోగా రుణాలు తిరిగి చెల్లించేవారికి అధిక రుణాలు పొందే అవకాశం ఉంటుంది.


logo