గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Jun 13, 2020 , 01:08:56

1.25 లక్షల మొక్కలు నాటాల్సిందే..

1.25 లక్షల మొక్కలు నాటాల్సిందే..

l వందశాతం ఇంకుడు గుంతలు  తవ్వించాలి

l వికారాబాద్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య

పెద్దేముల్‌: హరితహారంలో భాగంగా ఈ వానకాలంలో మండలంలో 1.25 లక్షల మొక్కలు తప్పకుండా నాటాలని వికారాబాద్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని బండపల్లి, ఖానాపూర్‌ గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు, నర్సరీలు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇంటింటికీ తప్పకుండా ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగాలని, ఆ దిశగా ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు, సర్పంచ్‌లు కృషి చేయాలని సూచించారు. ఎవరైనా గ్రామాల్లో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టకపోయినా, చెత్తాచెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ వేస్తే జరిమానాలు విధించాలని తెలిపారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరం జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఖానాపూర్‌, బండపల్లి గ్రామాల్లోని వన నర్సరీలను పరిశీలించారు. బండపల్లి వన నర్సరీ నిర్వహణ బాగుందని, హరితహారంలో భాగంగా ఈసారి గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నాటించే మొక్కలకు సంబంధించి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద గుంతలను అన్ని గ్రామాల్లో తవ్వించాలని చెప్పారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రత్నమ్మ, ఎంపీవో షేక్‌ సుష్మా, ఏపీవో నర్సింహులు, ఈసీ కృష్ణ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.


logo