శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Jun 11, 2020 , 23:17:44

వికారాబాద్‌ జిల్లాలో ‘కొవిడ్‌' చికిత్స

  వికారాబాద్‌ జిల్లాలో ‘కొవిడ్‌' చికిత్స

  • వికారాబాద్‌లో మూడు దవాఖానల్లో  కరోనా పేషెంట్లకు వైద్య సదుపాయాలు
  • వికారాబాద్‌ ఏరియా హాస్పిటల్‌, తాండూరు మాతా శిశు దవాఖాన, మహావీర్‌లలో ఏర్పాట్లు
  • ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే చికిత్స ప్రారంభం
  • కరోనా పాజిటివ్‌ వచ్చినా  ఇండ్లల్లోనే చికిత్స 
  • ఇండ్లలో సౌకర్యం లేకపోతేనే దవాఖానకు తరలింపు
  • కొనసాగుతున్న వైద్యబృందాల  ఇంటింటి సర్వే

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాల్లోనే కొవిడ్‌ చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు చికిత్స కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాలో మూడు దవాఖానల్లో కొవిడ్‌ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. కొవిడ్‌ చికిత్స అందించే దవాఖానలకు లొపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ప్రత్యేక ద్వారాలున్న దవాఖానలనే ఎంపిక చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్‌లోని నూతనంగా నిర్మించిన ఏరియా దవాఖానతోపాటు మహావీర్‌ ప్రైవేట్‌ దవాఖానను, తాం డూరు పట్టణం సమీపంలోని మధర్‌ అండ్‌ చైల్డ్‌ దవాఖానను కొవిడ్‌ చికిత్స కేంద్రాలుగా ప్రతిపాదించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే వికారాబాద్‌ పట్టణంలోని నూతన ఏరియా దవాఖానలో 100పడకలు, మహావీర్‌ దవాఖానలో 600 పడకలు, తాండూరు పట్టణంలోని మధర్‌ అండ్‌ చైల్డ్‌ దవాఖానలో 150 పడకలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాలో కొవిడ్‌ చికిత్స కేంద్రాలు ప్రారంభంకానున్నాయి. అయితే జిల్లాలో కొవిడ్‌ చికిత్స కేంద్రాలు అందుబాటులోకి వచ్చిన అనంతరం పాజిటివ్‌ నిర్దారణ అయిన వారందరికీ జిల్లాలోనే చికిత్స అందించనున్నారు.

అయితే తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల్లో ఎవరికైనా పాజిటివ్‌ నిర్దారణ అయితే తాండూరు ఎంసీహెచ్‌ (మతా శిశు దవాఖాన)లో, వికారాబాద్‌, పరిగి నియోజకవర్గాల్లో పాజిటివ్‌ నిర్దారణ వారికి వికారాబాద్‌లోని నూతన ఏరి యా దవాఖానతోపాటు మహావీర్‌ దవాఖానలో కొవిడ్‌ వైద్య సేవలందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. కొవిడ్‌ లక్షణాల తీవ్రత ఎక్కువ ఉన్నట్లు వైద్యులు గుర్తిస్తే సంబంధిత కొవిడ్‌ వ్యాధిగ్రస్తులను గాంధీ దవాఖానకు తరలించనున్నారు. అదేవిధంగా పాజిటివ్‌ నిర్దారణ అయినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడం, జ్వరం, జలుబు లక్షణాలున్న వారిని హోంకేర్‌ చేసి ఇంట్లోనే చికిత్స అందించేందుకు జిల్లా వైద్యరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాజిటివ్‌ నిర్దారణ అయి జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది వంటి లక్షణాలుంటేనే జిల్లాలోని చికిత్స కేంద్రానికి తరలించనున్నారు.

జిల్లాలో 2 యాక్టివ్‌ కేసులు...

జిల్లాలో ఇప్పటివరకు 46 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు మృతిచెందగా, మరో 43మంది కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా ఇద్దరు మాత్రమే గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. బుధవారం పాజిటివ్‌ నిర్దారణ దోమ మండలం దొంగెన్కెపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితోపాటు యాలాల మండలానికి చెందిన వ్యక్తికి గాంధీ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు దొంగెన్కెపల్లి గ్రామం లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ కలిపి 90 మందిని హోంక్వరంటైన్‌ చేశారు. 

అయితే జిల్లా లో ఇప్పటివరకు 31,231మందిని గృహ నిర్బంధంలో ఉంచగా, 26,084మంది 28రోజుల పాటు హోంక్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా కరో నా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండడంతోపాటు వర్షాలు ప్రారంభమవడంతో వర్షపునీరు రావడం, నిల్వ ఉండడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, మురుగునీరు నిల్వ ఉండడం, పారిశుద్ధ్యం లోపించడం తదితర కారణాలతో కరోనాతోపాటు సీజనల్‌ వ్యాధులైన మలేరియా, టైపాయిడ్‌, డయేరియా, స్వైన్‌ఫ్లూ, కలరా తదితర వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలున్నా యా లేదా అనే వివరాలు  సేకరిస్తున్నారు. మొన్నటివరకు మున్సిపాలిటీలకే పరిమితమైన కొవిడ్‌... ప్రస్తుతం గ్రామీణ ప్రాంతానికి వ్యాపించిన దృ ష్ట్యా గ్రామాల్లోనూ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.

ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాం...

జిల్లాలో కొవిడ్‌ చికిత్స అందించేందుకుగాను మూడు దవాఖానలను ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి దశరధ్‌ తెలిపారు. ప్రభుత్వం నుం చి అనుమతి వచ్చిన వెంటనే సంబంధిత చికిత్స కేంద్రాల్లో వైద్యులు, నర్సులు ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. అంతేకాకుండా పాజిటివ్‌ నిర్దారణ అయిన వారికి ఎలాంటి లక్షణాలు లేనట్లయితే వారిని హోంకేర్‌ చేసి ఇంట్లోనే చికిత్స అందించనున్నామన్నారు. 

- దశరధ్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి logo