శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Jun 11, 2020 , 00:11:51

‘పల్లె ప్రగతి’తో నిరుద్యోగ యువతకు అవకాశం

‘పల్లె ప్రగతి’తో నిరుద్యోగ యువతకు అవకాశం

  • మండలంలో 61 మంది పారిశుద్ధ్య కార్మికులు

వికారాబాద్‌ రూరల్‌ : తెలంగాణ ప్రభుత్వం పల్లెల్లో పచ్చని అందాలు ఉండేలా, పారిశుద్ధ్య రహిత గ్రామాలుగా నిరంతరంగా కొనసాగేలా ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా చేసింది. గ్రామంలో 500 జనాభాకు ఒక పారిశుద్ధ్య కార్మికుడిని నియమించడంతో గ్రామంలో ఇద్దరి నుంచి ముగ్గురికి ఉపాధి అవకాశం లభించింది. తాము చేస్తున్న పనికి ప్రభుత్వం ప్రతి నెలా రూ. 8,500లు చెల్లిస్తున్నది. గ్రామంలోనే ఉంటూ గ్రామస్తులకు కావాల్సిన అవసరాలు తీరుస్తూ గ్రామాభివృద్ధికి తమవంతు సాయం కూడా చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని మండలంలోని 21 గ్రామ పంచాయతీల 61 మంది పారిశుద్ధ్య కార్మికులు అంటున్నారు. ఒకప్పుడు గ్రామ పంచాయతీలో పని చేసే కార్మికులకు డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు. పని చేసిన తర్వాత రెండు, మూడు నెలలకు ఒక్కసారి ఇచ్చేవారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా మాకు ఎంతో లాభం చేకూరుతున్నది. ప్రతి నెలా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడంతో ఖర్చులతో పాటు కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిపేందుకు అవకాశం కలిగింది. 

గ్రామంలో చేయాల్సి పనులు...

గ్రామాల్లో వారం రోజుల్లో చేపడుతున్న కార్యక్రమాలను కార్యదర్శుల పర్యవేక్షణలో కొనసాగుతున్నది. సోమ, మంగళ, బుధ వారాల్లో మురుగు కాలువలను శుభ్రం చేయడం, గురువారం గ్రామాల్లోని పిచ్చి మొక్కలను తొలిగించడం, రోడ్లను శుభ్రం చేయడం, శుక్రవారం గ్రామాల్లో నాటిన మొక్కలకు నీళ్లుపోయడం, నీటి ట్యాంకులను శుభ్రం చేయడం, శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను శుభ్రం చేయడం లాంటి కార్యక్రమాలను చేపడుతారు. ఇలా వారం రోజుల పాటు చేసే పనులను ముందుగానే నిర్ణయించడంతో గ్రామాల్లో కార్మికులకు పని కల్పిస్తూ ఉపాధి కూడా ఉందని కార్మికులు వివరిస్తున్నారు. 

కరోనా సమయంలో అదనంగా రూ. 5 వేలు..

గ్రామాల్లో కార్మికులు చేస్తున్న పనిని గుర్తించిన ప్రభుత్వం కరోనా సమయంలో రూ.5 వేలు అదనంగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్మికులు చేస్తున్న పనిని గుర్తించి ఇలా ప్రోత్సహించడం ద్వారా గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు.

నాకు ఎవరూ లేరు...  గ్రామమే నా కుటుంబం

పని లేక ఎక్కడెక్కడో తిరిగి గ్రామంలోనే కూలీ చేసుకొని జీవనం సాగిస్తున్నాను. నాకు కుటుంబం, పిల్లలు లేరు. గ్రామమే నా కుటుంబంగా భావించి గ్రామానికి సేవ చేస్తున్నాను. నా పనిని గుర్తించిన అధికారులు గ్రామ పంచాయతీ కార్మికుడిగా తీసుకున్నారు. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తాను. ప్రతి నెలా జీతంతో పాటు కరోనాలో ప్రభుత్వం ఇచ్చిన అదనపు సాయం మర్చిపోలేను. పని లేక తిప్పలు పడుతున్న నాకు గ్రామంలోనే పని లభించడం సంతోషంగా ఉంది.

- గోపాల్‌, నారాయణపూర్‌

 


logo