మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Jun 10, 2020 , 23:54:10

జిల్లావ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

జిల్లావ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

  • నిషేధ, నకిలీ విత్తనాలపై ప్రత్యేక దృష్టి
  • ఇప్పటివరకు వికారాబాద్‌ జిల్లాలో 200కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
  • పత్తి, మొక్కజొన్న విత్తనాలపైనే పక్కా నిఘా
  • జిల్లాస్థాయి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాల ఏర్పాటు..

పుడమి తల్లిని నమ్ముకుని పంట సాగు చేసుకునే రైతన్నలను నమ్మించి మోసం చేసే అవకాశవాదుల పనిపట్టేందుకు  ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. వానకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో అన్నదాతలు విత్తనాలు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా భావించే మోసగాళ్లు నకిలీ విత్తనాలను చూపి మంచి విత్తనాలుగా ప్రచారం చేస్తూ అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు.  వీరి పని పట్టేందుకు నకిలీ, నిషేధిత విత్తనాల అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో వికారాబాద్‌ జిల్లాలో అధికార యంత్రాంగం ‘నకిలీ’లపై నిఘా పెంచింది. ఇందుకోసం వ్యవసాయశాఖ అధికారులతో కలిసి పోలీసులు, ఉన్నతాధికారులు జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ బృందాలుగా ఏర్పడ్డారు. ఈ బృందాలు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో  దౌల్తాబాద్‌ మండలంలో 200 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకోగా, మరెక్కడా నకిలీలు విక్రయించకుండా  అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: నకిలీ విత్తనాల విక్రయాలపై జిల్లా అధికార యంత్రాంగం పక్కాగా నిఘా పెట్టింది. ఇందుకుగాను ప్రత్యేకంగా పోలీసులు, వ్యవసాయ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఇప్పటికే దౌల్తాబాద్‌, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌, దోమ, పూడూర్‌ మండలాల్లో పోలీసులు తనిఖీలు చేయగా, దౌల్తాబాద్‌ మండలంలో 200 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, దోమ మండలంలోని ఓ దుకాణంలో దాడులు నిర్వహించగా కొంతమేర పత్తి విత్తనాలు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. సంబంధిత దుకాణదారుడికి లైసెన్స్‌ లేకపోవడంతోపాటు విత్తనాలు నకిలీ విత్తనాలా లేదా తేల్చేందుకు స్వాధీనం చేసుకున్న విత్తనాల శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపినట్లు అధికారులు తెలిపారు.

ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వ్యవసాయాధికారులతో కలిసి ప్రతి దుకాణాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇదిలాఉండగా, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను నియమించారు. ఇందులో డీఎస్పీ, ఏడీఏ, ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐలతో కూడిన జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఎస్పీ నియమించారు. ఈ బృందాలు ప్రతిరోజూ ఒక్కో మండలంలో ఆకస్మిక దాడులు చేస్తున్నారు. అయితే, జిల్లాలో తాండూర్‌ రెవెన్యూ డివిజన్‌లో అధికంగా కందులను సాగు చేస్తారు. కాబట్టి పత్తి, మొక్కజొన్న పంటలను ఎక్కువగా సాగు చేసే వికారాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోనే అధికారులు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు.

పత్తి విత్తనాలపైనే పక్కా నిఘా...

ఈ వానకాలం సీజన్‌లో జిల్లాలో పత్తి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న దృష్ట్యా నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడిన నేపథ్యంలో తనిఖీలు మరింత పెంచడంపై టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దృష్టి సారించాయి. జిల్లాలో ఏ ఒక్క రైతు కూడా నకిలీ విత్తనాల బారిన పడకుండా కలెక్టర్‌ పౌసుమీ బసు, ఎస్పీ ఎం.నారాయణ పకడ్బందీ చర్యలు చేపట్టారు. అంతేకాకుండా కొందరు వ్యాపారులు గ్రామాల్లోనే ఎరువులు, విత్తనాలను విక్రయిస్తుంటారు. కాబట్టి గ్రామస్థాయిలోనూ తనిఖీలు చేస్తున్నారు. కేవలం లైసెన్స్‌ కలిగిన వారు తప్ప మిగతా ఎవరైనా విత్తనాలను విక్రయించినట్లయితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా తనిఖీ చేసి ప్రతి దుకాణంలో పత్తి విత్తనాల ప్యాకెట్లకు సంబంధించి సరైన డాక్యుమెంట్లు కూడా ఉంటేనే అధికారులు సర్టిఫై చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో మొక్కజొన్న పంటను ఒక్క ఎకరం కూడా సాగు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించిన దృష్ట్యా మొక్కజొన్న విత్తనాలపై కూడా నిఘా పెట్టారు. 

నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా పెట్టాం...

జిల్లా అంతటా నకిలీ పత్తి విత్తనాలపై టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో నిఘా పెట్టాం. పోలీస్‌ స్టేషన్ల వారీగా ప్రత్యేక బృందాలతోపాటు జిల్లాస్థాయిలోనూ టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని నియమించాం. నకిలీ పత్తి విత్తనాలను విక్రయించినా, నిషేధించిన మొక్కజొన్న విత్తనాలను విక్రయించినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. గ్రామాల్లోనూ రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నాం. 

- జిల్లా ఎస్పీ ఎం.నారాయణ

2,13,192 ఎకరాల్లో పత్తి సాగు...

జిల్లాలో ఈ ఏడాది పత్తిసాగుకు అధిక ప్రాధాన్యమిచ్చేందుకు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ వానకాలం సీజన్‌లో భారీగా పత్తి పంటను సాగు చేసేందుకు జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పత్తి పంట సాగుతోనే రైతులు అధిక మొత్తంలో లాభాలు అర్జించవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలో పత్తిసాగును పెంచేలా చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే వానకాలం సీజన్‌లో పత్తిసాగును పెంచేందుకు రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు. అంతేకాకుండా 20శాతం మేర పత్తిసాగు పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో మెజార్టీ శాతం నల్లరేగడి నేలలే ఉండడంతో రైతులు కూడా పత్తిసాగు పెంచడంవైపే మొగ్గు చూపారు. అయితే జిల్లాలోని పరిగి, వికారాబాద్‌ డివిజన్‌లతో పాటు తాండూర్‌ డివిజన్‌లో కూడా పత్తి పంట సాగు పెరుగనున్నది. అయితే, తాండూర్‌ డివిజన్‌లో మెజార్టీ విస్తీర్ణంలో సాగయ్యే కంది పంటతోపాటు పత్తి విస్తీర్ణం కూడా రెండేండ్లుగా పెరుగుతున్నది. తాండూర్‌ డివిజన్‌లో శనగ, కుసుమ, జొన్న పంటల స్థానంలో రైతులు పత్తి పంటను సాగు చేస్తూ వస్తున్నారు. జిల్లాలో ఈ వానకాలం సీజన్‌లో 20 వేల ఎకరాల్లో పత్తిసాగు పెరుగనున్నదని అధికారులు చెబుతున్నారు. గతేడాది 1,93,811 ఎకరాలున్న పత్తి సాగును ఈ వానకాలం సీజన్‌లో 2.13 లక్షల ఎకరాలకు పెంచేందుకు జిల్లా వ్యవసాయాధికారులు కార్యాచరణ రూపొందించారు.logo