గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jun 10, 2020 , 00:18:34

అల్లంసాగుకు మొగ్గుచూపుతున్న రైతులు

అల్లంసాగుకు మొగ్గుచూపుతున్న రైతులు

  • వికారాబాద్‌ మండలంలో పెద్దఎత్తున సాగుచేస్తున్న అన్నదాతలు  

వికారాబాద్‌ రూరల్‌: ప్రభుత్వం రైతును రాజు చేయాలనే గొప్ప సంకల్పంతో ఎన్నో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా రైతన్న కూడా అడుగులు వేస్తున్నాడు. గ్రామాల్లో ప్రతి సంవత్సరం వేసే పంటకంటే పప్పుదినుసులు, కూరగాయలు, నూనె పంటలు వేయాలని ఆదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయి. వికారాబాద్‌ మండలం పులుమద్ది, ఎర్రవల్లి, మదన్‌పల్లి, అత్వెల్లి, నారాయణ్‌పూర్‌ గ్రామాల్లో అల్లం పంట సాగు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో అత్యధికంగా ఎర్ర రేగడి నేలలు ఉండడంతో గతంలో చెరుకు, అల్లం, పసుపు పంట బాగానే వేసేవారు. అనంతరం పత్తి, మొక్కజొన్నలు వేస్తూ వాటిని నిర్లక్ష్యం చేశారు. ఈ సంవత్సరం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రైతన్నలు మళ్లీ పాత పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. పులుమద్ది  సర్పంచ్‌ మాధవరెడ్డి తన పొలంలో ఎకరంలో అల్లం సాగు చేయడంతో గ్రామానికి చెందిన పలువురు రైతులు అల్లం సాగుకు ముందుకు వచ్చారు. వికారాబాద్‌ మండలంలో మొత్తం 200 ఎకరాల్లో అల్లం సాగు చేస్తారు.  

జహీరాబాద్‌ నుంచి విత్తనం సేకరణ...

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలో అధికంగా అల్లం పంట సాగు చేస్తుండడంతో జిల్లారైతులు అక్కడి నుంచి  విత్తనాలు తెచ్చుకుంటున్నారు. ఒక ఎకరానికి 6 క్వింటాళ్ల విత్తనం అవసరమవుతాయి. అల్లం సాగుకు రైతన్నకు రూ. 70 వేల ఖర్చు వస్తుంది. అందుకు తగినట్లుగానే దిగుబడి కూడా వస్తున్నదని రైతన్నలు ఆశిస్తున్నారు. ఎకరాకు సుమారు 60 నుంచి 70 క్వింటాళ్ల పంట వస్తుందని రైతులు తెలిపారు. ఆరు నెలల్లో పంట చేతికి వస్తుందడంతో సంవత్సరంలో రెండు పంటలు సాగు చేసుకునే వీలు ఉంటుందని రైతు వివరించారు.

గతంలో సాగు చేసేవాళ్లం... 

మా పొలంలో గతంలో అల్లం పంట బాగానే సాగు చేసేవాళ్లం. నాలుగైదు సంవత్సరాలుగా పంట సాగు చేయలేదు. ప్రభుత్వం ఈ సారి పంట మార్పిడి చేయాలని చెప్పడంతో అల్లం పండించేందుకు సన్నాహాలు చేస్తున్నాము. నాతోపాటు గ్రామంలో మరికొంత మంది అల్లం పంట వేశారు. పంటలు బిందు సేద్యం ద్వారా సాగు చేయడంతో నీరు వృథా కాదు.  

- మాధవరెడ్డి, పులుమద్ది సర్పంచ్‌ logo