సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jun 10, 2020 , 00:08:32

వికారాబాద్‌ జిల్లాలో 204 కేంద్రాల్లో 42,533 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

వికారాబాద్‌ జిల్లాలో 204 కేంద్రాల్లో 42,533 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

  • సోమవారంతో ముగిసిన కొనుగోళ్లు
  • రూ.78.04 కోట్ల విలువైన ధాన్యం సేకరణ
  • ఇప్పటివరకు రూ.39.82 కోట్ల  చెల్లింపులు పూర్తి

ధాన్యం కొనుగోళ్లలో ఈ యేడాది వికారాబాద్‌ జిల్లా  అనూహ్య ప్రగతి సాధించింది. సోమవారంతో జిల్లాలో కొనుగోళ్లు ముగిశాయి. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం, దళారులు లేకపోవడం, రైతులకు మద్దతు ధర ఇవ్వడం తదితర కారణాలతో 42,533 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. జిల్లావ్యాప్తంగా 17 మండలాల్లో 19 వేల మంది రైతులు 12,505 హెక్టార్లలో వరి సాగు చేశారు. 204 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 78.04 కోట్ల విలువైన ధాన్యం సేకరించారు. ఇందులో ఇప్పటివరకు 39.82 కోట్లు రైతులకు చెల్లించారు. మిగతావారికి వారం రోజుల్లో బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బులు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ యేడాది 70 వేల మెట్రిక్‌ టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా... యాసంగి సీజన్‌లో 42 వేలకుపైగా మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ చొరవతో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల్లోనే ఏర్పాటు చేయడంపై రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ:  జిల్లాలో రికార్డుస్థాయిలో ధాన్యాన్ని సేకరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా యాసంగి సీజన్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసింది. పంట పండించిన గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించారు. అంతేకాకుండా దళారీ వ్యవస్థ లేకపోవడం, గ్రామస్థాయిల్లోనే ధాన్యం సేకరించడంతో రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే సోమవారంతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసింది. కరోనా దృష్ట్యా ఒకేరోజు రైతులందరూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురాకుండా ముందుగానే టోకెన్లు జారీచేసి రోజుకు 800 క్వింటాళ్లు (50 మంది రైతుల నుంచి) ధాన్యాన్ని సేకరించారు. వికారాబాద్‌ జిల్లాలోని 17 మండలాల్లో 19 వేల మంది రైతులు 12,505 హెక్టార్లలో వరిసాగు చేశారు. అయితే, 70 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, యాసంగి సీజన్‌లో 42 వేలకుపైగా మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అధికారులు సేకరించారు.

రికార్డు స్థాయిలో వడ్ల కొనుగోళ్లు...

నాలుగేండ్లలో వానకాలం, యాసంగి సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించారు. జిల్లాలో యాసంగి సీజన్‌కుగాను 204 కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం వడ్లను రైతుల నుంచి సేకరించింది. ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. గత యాసంగి సీజన్‌లో 11,866 మంది రైతుల నుంచి 42,533 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఐకేపీ ఆధ్వర్యంలో 80 కొనుగోలు కేంద్రాల ద్వారా 5201 మంది రైతుల నుంచి 16,625 మెట్రిక్‌ టన్నులు, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 55 కొనుగోలు కేంద్రాల ద్వారా 2839 మంది రైతుల నుంచి 10,034 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 69 కొనుగోలు కేంద్రాల ద్వారా 3826 మంది రైతుల నుంచి 15,873 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే, సీఎంఆర్‌ రైస్‌కు సంబంధించి ఇప్పటివరకు 40,571 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు జిల్లా పౌరసరఫరాల అధికారులు సరఫరా చేశారు. అదేవిధంగా జిల్లాలోని గోదాంలు నిండడంతో జిల్లాలో సేకరించిన ధాన్యాన్ని సిద్దిపేటకు తరలించారు.

నేరుగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు...

ధాన్యాన్ని విక్రయించిన ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర అందేలా ప్రభుత్వం చేసేలా చర్యలు చేపట్టింది. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులను వారం, పది రోజుల్లో జమ చేస్తుంది. జిల్లాలో రూ.78.04 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించగా, ఇప్పటివరకు రూ.39.82 కోట్లు ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయగా, నేడో రేపో మరో రూ.6.16 కోట్లు చెల్లించనున్నది. పెండింగ్‌లో ఉన్న మరో రూ.32.06 కోట్ల చెల్లింపులను వారం రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

ధాన్యం సేకరణ పూర్తి...

జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ముగిసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యాసంగి సీజన్‌లో రూ.78 కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో సేకరించాం. కరోనాతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాం. పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను వారం రోజుల్లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నాం. 

- వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌


logo