మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jun 09, 2020 , 06:55:59

తెరుచుకున్న దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు

తెరుచుకున్న దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు

78 రోజుల తర్వాత దర్శనమిచ్చిన దేవతామూర్తులు

థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌ చేసిన ఆలయ సిబ్బంది

భౌతిక దూరం పాటించి దర్శించుకున్న భక్తులు

కడ్తాల్‌ మైసిగండి మైసమ్మను దర్శించుకున్న రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ హరీశ్‌, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

 రంగారెడ్డి/వికారాబాద్‌ బృందం: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూసేసిన ఆలయాలు, ప్రార్థనా మందిరాలు దాదాపు 78 రోజుల తర్వాత  ప్రభుత్వం భక్తుల దర్శనార్థం సడలింపులివ్వడంతో సోమవారం నుంచి తెరుచుకున్నాయి. దీంతో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో ఏకాంత సేవలు మాత్రమే నిర్వహించారు. ఆలయాల్లో సోడియం హైపోక్లోరైట్‌ రసాయనంతో శుభ్రం చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు, ఆలయ సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు, శానిటైజేషన్‌ చేసిన అనంతరం భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు ఆలయంలో గర్భాలయ, అంతరాలయ దర్శనాలు నిలిపేశారు. శఠగోపురాలు, తీర్థప్రసాదాల వితరణ బంద్‌ చేశారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా లడ్డూలు విక్రయించారు. ఆలయాల ఆవరణలో దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇవ్వలేదు.  కడ్తాల్‌ మండల కేంద్రంలోని మైసిగండి మైసమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ హరీశ్‌, ఆర్డీవో రవీందర్‌రెడ్డి దర్శించుకున్నారు. 

దేవతలను దర్శించుకున్న భక్తులు

వికారాబాద్‌లోని అనంతపద్మనాభ స్వామి దర్శనానికి భక్తులు స్వల్పంగానే వచ్చారు.  తాండూరులోని భావిగి భద్రేశ్వర, శివుడు, కాళికా దేవాలయాలు, సీతారాంపేట్‌, స్టేషన్‌ హనుమాన్‌ మందిరాలు భక్తులతో సందడిగా మారాయి. భక్తులు భౌతిక దూరం పాటించి ఇష్ట దైవాలను దర్శించుకున్నారు. ఆలయాల ముఖద్వారం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు.  తాండూరు పట్టణంలోని కొడంగల్‌ రోడ్డు మార్గంలో ఉన్న మార్కండేయ మందిరంలో ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్‌ మండలంలోని కాశీ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఉత్తర రామలింగేశ్వరస్వామి దర్శనమిచ్చారు. శివుడికి ఇష్టమైన రోజు సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. షాద్‌నగర్‌లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, అర్చకులు, భక్తులు గోమాతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మున్సిపాలిటీలోని శివమారుతి గీతా అయ్యప్ప మంది రం, సాయిబాబా దేవాలయం, సత్యనారాయణస్వామి దేవాలయం, చౌడమ్మగుట్ట వీరాంజనేయస్వామి దేవాలయంలో శానిటైజేషన్‌ చేయించి, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. చేవెళ్ల మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతినిచ్చారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా  తరలివచ్చారు. కొనగట్టు శివాలయం, బ్రహ్మగిరిక్షేత్రం, ఆయ్యప్ప స్వామి దేవాలయాల్లో స్వామి వారి దర్శనాన్ని కల్పించారు. కొడంగల్‌లోని వేంకటేశ్వర స్వామి దేవాలయం తలుపులు మాత్రం తెరుచుకోలేదు. ఈ విషయమై ఆలయ అర్చకులను వివరణ కోరగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు అందలేదని సమాధానమిచ్చారు.  

తెరుచుకున్న దర్గా 

కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌నర్వలో ఉన్న హజరత్‌ జహంగీర్‌ పీర్‌ దర్గాను వక్ఫ్‌బోర్డు అధికారులు తెరిచారు. ప్రతి వ్యక్తికి మాస్కు ధరించాలని, వచ్చేముందు శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలని సూచించారు. 10 ఏండ్ల లోపు పిల్లలు, 65 ఏండ్లుపైబడిన వృద్ధులకు దర్శనం చేసుకునేందుకు నిరాకరించినట్లు తెలిపారు.


logo