ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Jun 08, 2020 , 00:02:00

అనుమతిలేని, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయం

అనుమతిలేని, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు  ప్రభుత్వం నిర్ణయం

  • వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ప్రక్రియ
  • జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2949 దరఖాస్తులు
  • అత్యధికంగా పరిగి మున్సిపాలిటీలో 1410 
  • సెప్టెంబర్‌ 30 వరకు గడువు పెంపు

 అనుమతులు లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ముందుగా మున్సిపాలిటీల్లో, తర్వాత విలీన గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకానికి భారీ స్పందన వస్తున్నది. ఈ ప్రక్రియకు మే 31తో గడువు ముగియగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండు నెలల పాటు సెలవులు ఉండడంతో  సెప్టెంబర్‌ 30 వరకు గడువు  పొడిగించింది. 2018 మార్చి 30 నాటికి అనుమతిలేని, అక్రమ లేఅవుట్లతో పాటు ప్లాట్లు రిజిస్ట్రర్‌ సేల్‌డీడ్‌ అయిన స్థలాలను మాత్రమే క్రమబద్ధీకరించనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,949 దరఖాస్తులు రాగా, అత్యధికంగా పరిగి మున్సిపాలిటీలో 1410 దరఖాస్తులు వచ్చాయి.  నిర్ణీత గడువు తేదీ వరకు దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

- వికారాబాద్‌, నమస్తే తెలంగాణ  
 జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ (లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం)కు భారీ స్పందన వస్తున్నది. అనుమతిలేని, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. తొలుత కొత్త మున్సిపాలిటీల్లో, తదనంతరం విలీ న గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశమిచ్చిన ప్రభుత్వం తదనంతరం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అనధికారిక లేఅవుట్లను రెగ్యులరైజ్‌ చేసుకునేందుకు ఛాన్స్‌ కల్పించింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన గడువు మే 31కి ముగిసింది. కరోనాతో రెండు నెలలపాటు లాక్‌డౌన్‌ అమలులో ఉన్న దృష్ట్యా మరో మూడు నెలల పాటు సెప్టెంబర్‌ 30 వరకు గడువు పొడిగించింది. మున్సిపాలిటీల్లో అక్రమ, అనుమతిలేని లేఅవుట్లకు సంబంధించి ప్రభు త్వం కటాఫ్‌ తేదీని నిర్ణయించింది. 2018 మార్చి 30 నాటికి ఉన్న అనుమతిలేని, అక్రమ లేఅవుట్లతోపాటు ప్లాట్లు రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ అయిన స్థలాలను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించారు. జిల్లాలోని పరిగి మున్సిపాలిటీలోనే అత్యధికంగా అనధికారిక లేఅవుట్లు ఉన్నట్లు మున్సిపల్‌ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో కామారెడ్డి తర్వాత పరిగి మున్సిపాలిటీలోనే అధిక మొత్తంలో అక్రమ, అనుమతి లేని లేఅవుట్లు ఉన్నాయి. 

ఇప్పటి వరకు 2949 దరఖాస్తులు..

రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించడంతో అనధికారిక లేఅవుట్ల నిర్వాహకులతో పాటు సంబంధిత ప్లాట్లు కొనుగోలు చేసిన వారి నుంచి భారీ స్పందన వస్తున్నది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో 2949 దరఖాస్తులు వచ్చినట్లు మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా పరిగి మున్సిపాలిటీలో 1410, వికారాబాద్‌లో 1375, తాండూరులో 73, కొడంగల్‌లో 91 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్‌, తాండూరు మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోనూ ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. వికారాబాద్‌ మున్సిపాలిటీలోని బూరుగుపల్లి, గుడుపల్లి, ధన్నారం, గిరిగెట్‌పల్లి, కొంపల్లి, మద్గుల్‌చిట్టెంపల్లి గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు 51 దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నది. అనుమతిలేని లేఅవుట్ల మొత్తం క్రమబద్ధీకరణ వ్యయంలో 10 శాతం చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే ప్లాట్ల యజమానులు, సొసైటీ సభ్యులు, కాలనీ డెవలపర్స్‌ క్రమబద్ధీకరణకు సాక్ష్యంగా సేల్‌ డీడ్‌ లేదా టైటిల్‌ డీడ్‌ తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. కేవలం ఒప్పందం చేసుకున్న స్థలాలను క్రమబద్ధీకరించే వీలులేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత భూమి ధరను బట్టి రెగ్యులరైజేషన్‌ ఛార్జీలను నిర్ణయించింది. 3 వేల చదరపు గజాల భూమికి సంబంధించి 20 శాతం, 3001- 5000 గజాల వరకు 30 శాతం, 5001-10,000 వరకు 40 శాతం, 10,001- 20,000 వరకు 50 శాతం, 20,001-30,000 వరకు 60 శాతం, 30,001 గజాల నుంచి 50,000 గజాల వరకు 80 శాతం మొత్తం వ్యయంలో చెల్లించాల్సి ఉంటుంది. అదే 50 వేలకుపైగా చదరపు గజాల స్థలాన్ని క్రమబద్ధీకరణ చేసేందుకుగాను మొత్తం వ్యయం చెల్లించాల్సి ఉంటుంది. 

జిల్లాలో 214 అక్రమ లేఅవుట్లు..

జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో 214 అనుమతిలేని లేఅవుట్లు ఉన్నట్లు మున్సిపల్‌ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పరిగి, వికారాబాద్‌ మున్సిపాలిటీల్లో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. పరిగి మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటైనప్పటికీ గతంలో పంచాయతీగా ఉన్న సమయంలోనే చాలా వరకు అనుమతుల్లేని, అక్రమ వెంచర్లు వెలిశాయి. పరిగి మున్సిపాలిటీలో అత్యధికంగా 117 అక్రమ లేఅవుట్లు, వికారాబాద్‌లో 81, తాండూరులో 11, కొడంగల్‌లో 5 లేఅవుట్లకు అనుమతి లేకుండానే ప్లాట్లు చేసి విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత 214 అక్రమ, అనుమతిలేని లేఅవుట్లలో 12,675 ప్లాట్లను అనధికారిక ప్లాట్లుగా గుర్తించారు. ఈ లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారంతా ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. పరిగి మున్సిపాలిటీలో 117 అనుమతిలేని లేఅవుట్లుండగా వీటిలో 8214 అనధికారిక ప్లాట్లు, వికారాబాద్‌లో 81కి 3081, తాండూరులో 11కు 900 అనధికారిక ప్లాట్లు, కొడంగల్‌లో ఐదుకు 480 అనధికారిక ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. 

నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి

ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచింది. మరోసారి అవకాశమిచ్చిన దృష్ట్యా నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ నిర్ణీత గడువులోగా లేఅవుట్లు లేదా ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటారు. పరిగి మున్సిపాలిటీలో అత్యధికంగా అనుమతిలేని లేఅవుట్లు ఉన్నాయి. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

- చంద్రయ్య,  జిల్లా అదనపు కలెక్టర్‌, వికారాబాద్‌


logo