మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Jun 06, 2020 , 00:00:44

కూరగాయల సాగును పెంచండి

కూరగాయల సాగును పెంచండి

  • ప్రతి గ్రామ పంచాయతీలో  ట్రాక్టర్‌, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు 
  • పల్లెల్లో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని  నిరంతరం కొనసాగించాలి
  • సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌
  • వికారాబాద్‌ మండలం పెండ్లిమడుగు, నవాబుపేట్‌ మండలం దాతాపూర్‌లో  పల్లెప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో రైతులు కూరగాయల సాగుకు ఆసక్తి చూపుతున్నారని, కూరగాయల సాగును పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమా ర్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. శుక్రవారం పల్లెప్రగతి పనుల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వికారాబాద్‌ మండలం పెండ్లిమడుగు, నవాబుపేట్‌ మండలం దాతాపూర్‌ గ్రా మ పంచాయతీల్లో నర్సరీలు, వైకుంఠధామంతోపాటు తదితరాలను రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో ఆగ్రో ఫారెస్ట్‌ ఏర్పాటుకు ప్లాన్‌ చేస్తున్నామని, ఇందుకుగాను కొంతమంది రైతులను ఎంపిక చేస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో ఎంతో మార్పు వచ్చిందని, గ్రామాలాభివృద్ధికిగాను ప్రతి నెల రూ.308కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నదన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోకి ఒక ట్రాక్టర్‌తోపాటు వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, తడి-పొడి చెత్త సేకరణ ప్రక్రియ జరుగుతుందని, పారిశుద్ధ్యం కార్యక్రమం నిరంతరంగా కొనసాగితే పల్లెలు స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకుంటాయన్నారు.

పెండ్లిమడుగు, దాతాపూర్‌ సందర్శన...

పల్లెప్రగతి పనుల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా తొలు త వికారాబాద్‌ మండలంలోని పెండ్లిమడుగు గ్రామ పంచాయతీలో కూరగాయల నర్సరీ, ప్రభుత్వ హరితహారం నర్సరీ, వైకుంఠధామాన్ని సీఎస్‌ పరిశీలించారు. ప్రభుత్వ నర్సరీలో మొక్కలు సరిగ్గా పెరుగకపోవడం, నెట్‌ సరిగ్గా లేకపోవడం గుర్తించిన ఆయన కూరగాయల నర్సరీలో మొక్కల పెరుగుదలతోపాటు నెట్‌ బాగుంది, ప్రభుత్వ నర్సరీలో ఎందుకు సరిగ్గా లేదని సంబంధిత సర్పంచ్‌ను ప్రశ్నించారు, అయితే గాలివానతో నెట్‌ పాడైపోయిందని సర్పంచ్‌ సమాధానమివ్వ గా పక్కనే ఉన్న కూరగాయల నర్సరీలో గాలివాన ప్రభా వం లేదా అని ప్రశ్నించి ప్రభుత్వ నర్సరీలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అదే గ్రామం లో వైకుంఠధామాన్ని సందర్శించిన సీఎస్‌ చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు.

తదనంతరం అక్కడి నుంచి నవాబుపేట్‌ మండలంలోని దాతాపూర్‌ లో పర్యటించారు. దాతాపూర్‌ ప్రభుత్వ నర్సరీతోపాటు పక్కనే డీఆర్సీ కేంద్రం ఏర్పాటుకు గుర్తించిన స్థలాన్ని పరిశీలించి, డీఆర్సీ కేంద్రం నిర్మాణం ఇంకా పెండింగ్‌ లో ఎందుకు ఉందని అధికారులను అడిగారు. ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నందున పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా దాతాపూర్‌ రహదారికి ఇరువైపులా నాటిన సిల్వర్‌ వోక్‌ మొక్కలకు సంబంధించి సర్పంచ్‌ బల్వంత్‌రెడ్డిని ఆరా తీశారు. సిల్వర్‌ వోక్‌ మొక్కలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారని అడుగగా, హైదరాబాద్‌ నుంచి తీసుకువచ్చానని, ఒక్క మొక్క రూ.60 అని సర్పంచ్‌ తెలిపారు. అయితే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో సంబంధిత మొక్కలను ఎక్కువగా నాటించానని, మొక్క మొదలు నుంచి గుబురుగా పెరుగుతుంది కాబట్టి కొమ్మలు తీ యొద్దని సర్పంచ్‌కు సూచించారు. తనిఖీల్లో భాగంగా సీఎస్‌తోపాటు కలెక్టర్‌ పౌసుమీ బసు, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, డీఆర్‌డీవో కృష్ణన్‌ ఉన్నారు. 

నూతన కలెక్టరేట్‌ వద్ద హెలీప్యాడ్‌...

హెలికాప్టర్‌ ద్వారా కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతోపాటు జిల్లాలో సీఎస్‌ బృందం ఆకస్మికంగా పర్యటించింది. అయితే నూతన కలెక్టరేట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిల్లా కలెక్టర్‌ పౌసుమీ బసు, జిల్లా ఎస్పీ నారాయణతోపాటు ఇతర జిల్లా అధికారులు స్వాగతం పలికారు. రెండు గ్రామాలను సందర్శించిన అనంతరం తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్లారు.logo