గురువారం 02 జూలై 2020
Vikarabad - Jun 05, 2020 , 00:28:39

జోరుగా పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు

జోరుగా పల్లెలు, పట్టణాల్లో  పారిశుద్ధ్య పనులు

  • కొనసాగుతున్న మూడో విడుత కార్యక్రమాలు
  • కరోనా, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు
  • స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు
  •  ప్రతి నెలా పంచాయతీల అభివృద్ధికి నిధులు
  •  నేడు జిల్లాకు రానున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
  •  పల్లెప్రగతి పనులను తనిఖీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
  • పనుల్లో నిర్లక్ష్యం, నాణ్యత లేకుంటే సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు

గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛత దిశగా పయనిస్తున్నాయి. పారిశుద్ధ్య కార్యక్రమాలతో వాటి రూపురేఖలు మారుతున్నాయి. రోడ్లను చదును చేస్తున్నారు.. మురుగు కాల్వల్లో బ్లీచింగ్‌ చల్లుతున్నారు.. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటిల్లో మొరం పోస్తున్నారు. కాలనీల్లో ఫాగింగ్‌ చేస్తూ దోమలపై దండయాత్ర చేస్తున్నారు. ముండ్ల పొదలు తొలగిస్తున్నారు. మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. వాటి రక్షణకు ట్రీగార్డులు ఏర్పాటుచేస్తున్నారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వేర్వేరుగా చేసిన చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు. ప్రతి రోజూ గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించే పారిశుద్ధ్య పనుల్లో  పాల్గొంటూ తమ ప్రాంతాలను శుభ్రం చేసుకుంటున్నారు. సీజనల్‌ వ్యాధులపై యుద్ధం చేస్తూ అవి ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. మూడో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.  - వికారాబాద్‌, నమస్తే తెలంగాణ

జిల్లాలోని గ్రామపంచాయతీలు, పట్టణాలు ప్రగతి దిశగా పయనిస్తున్నాయి. స్వచ్ఛ గ్రామపంచాయతీలు, స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకుగాను సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి, రెండో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులతో పల్లెల్లో, పట్టణాల్లో ఎంతో మార్పు వచ్చింది. అయితే మూడో విడుతలో భాగంగా కరోనా వ్యాధి, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పట్టణాల్లో, పల్లెల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. ఈ నెల 2న ప్రారంభమైన మూడో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నారు. జిల్లా ఎమ్మెల్యేలతోపాటు మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు రోజుకొక గ్రామపంచాయతీ, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ గ్రామ పంచాయతీల్లో. పట్టణాల్లో చేసే పనులను సాయంత్రంలోగా నివేదికతోపాటు ఫొటోలను జిల్లా ఉన్నతాధికారులకు పంపుతున్నారు. జిల్లా కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారి ఇతర జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. పారిశుద్ధ్య పనులు పూర్తికాకపోవడం, నిర్లక్ష్యం వహించినట్లయితే సదరు గ్రామపంచాయతీ కార్యదర్శితోపాటు సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, సంబంధిత వార్డు సభ్యులను బాధ్యులను చేయనున్నారు.

 ప్రతిరోజూ గ్రామపంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్‌ యార్డులకు తరలించడం, మురుగు కాల్వలను శుభ్రం చేసి బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లడం, గ్రామాల్లో నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని మొరంతో మరమ్మతులు చేయడం, పైప్‌లైన్‌ లీకేజీ మరమ్మతులు చేయడం, గ్రామాల్లో ఫాగింగ్‌ యంత్రం ద్వారా స్ప్రే చేసి రోగకారక జీవులు చేరకుండా చూడడం వంటి పనులు చేస్తున్నారు. గురువారం గ్రామాల్లో ముళ్ల పొదలను, పిచ్చిమొక్కలను తొలగించడం, మొక్కల చుట్టూ హద్దులు, మొక్కల కొమ్మలను సరిచేయడం, అంతర్గత రహదారులను శుభ్రం చేశారు. పట్టణాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేయడం వంటి పనులు చేపట్టారు. 

పల్లెప్రగతిలో భాగంగా చేసిన పనులు...

జిల్లాలోని 566 గ్రామపంచాయతీల్లో మొదటి, రెండో విడుత పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన పనులతో పల్లెల్లో చాలా మార్పు వచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన పల్లెలుగా రూపుదిద్దుకున్నాయి. రెండు విడుతల్లో పురాతన ఇండ్లను కూల్చడం, భవన శిథిలాలను తొలగించడం, నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చివేయడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలను, అంగన్‌వాడీ కేంద్రాలను శుభ్రం చేయడం, గ్రామాల్లో సర్కార్‌ తుమ్మ, జిల్లెడు వంటి పిచ్చిమొక్కలను తొలగించారు. రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేయడం, మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు.

 ప్రతిఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు బహిరంగ మలవిసర్జనకెళ్లే వారికి జరిమానాలను కూడా విధిస్తూ గ్రామాల రూపురేఖలను మార్చే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేసింది. ఇంటింటికీ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, వర్షపు నీటితోపాటు వృథా నీటిని ఒడిసిపట్టేందుకుగాను ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, హరితహారంపై కూడా అవగాహన కల్పించారు. జిల్లాలో గుర్తించిన 4353 శిథిలాలను జిల్లా యంత్రాంగం కూల్చివేసింది. 6167 ముళ్లపొదలను తొలగించడంతోపాటు నిరుపయోగంగా ఉన్న 1004 బావులు, 937 బోరుబావులను పూడ్చివేశారు. 2749 లోతట్టు ప్రాంతాలను పూడ్చడం, పెండింగ్‌లో ఉన్న 12,752 మరుగుదొడ్లను నిర్మించారు. జిల్లావ్యాప్తంగా 870 అంగన్‌వాడీ కేంద్రా లు, 657 ప్రాథమిక పాఠశాలలు, 154 ప్రాథమికోన్నత పాఠశాలలు, 154 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను శుభ్రపర్చడంతోపాటు 123 ప్రభుత్వ దవాఖానలు, 288 కమ్యూనిటీ భవనా లు, 407 ఇతర భవనాలు, 222 మార్కెట్‌ స్థలాలను శుభ్రపర్చారు. తడి-పొడి చెత్తపై అవగాహన కల్పించడంతోపాటు తడిచెత్తను గ్రామ సేవకులకు వేసేందుకుగాను జిల్లావ్యాప్తంగా 1,38,038 కుటుంబాలకు చెత్త బుట్టలను కూడా పంపిణీ చేశారు. పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉండేందుకుగాను 565 గ్రామపంచాయతీల్లో శ్రమదానాన్ని కూడా నిర్వహించారు. 

30 రోజుల ప్రణాళికలో భాగంగా 2,52,155 కృష్ణ తులసి మొక్కలను గ్రామపంచాయతీల్లో పంపిణీ చేశారు. గ్రామాల్లో వీధిలైట్ల కోసం ఎంత కరెంట్‌ వాడుతున్నారనేది గుర్తించడంతోపాటు వీధి ప్రత్యేకంగా మీటర్లు పెట్టడం, థర్డ్‌లైన్‌ను ఏర్పాటు చేయ డం, ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. 22,149 ఎల్‌ఈడీ బల్బులను బిగించారు. జిల్లావ్యాప్తంగా 6984 వేలాడుతున్న వైర్లను గుర్తించి సరిచేశారు. 5005 దెబ్బతిన్న స్తంభాలను గుర్తించి వాటి స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు. 3641 నేలకొరిగిన స్తంభాలను గుర్తించి సంబంధిత స్తంభాలను సరిచేయడంతోపాటు ఇనుప స్తంభాలున్న 2352 స్థానాల్లో సిమెంట్‌ స్తంభాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల్లో కూడా పట్టణ ప్రగతి కార్యక్రమంతో స్వచ్ఛ పట్టణాలుగా రూపుదిద్దుకున్నాయి.

నేడు జిల్లాకు రానున్న సీఎస్‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. మూడో విడుత పల్లెప్రగతి పనుల తనిఖీల్లో భాగంగా వికారాబాద్‌ జిల్లాతోపాటు కామారెడ్డి, సం గారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లాలోని ఏదో ఒక మండలంలో పల్లెప్రగతి పనులను సీఎస్‌ తనిఖీ చేయనున్నారు. పను ల్లో నాణ్యత లోపించినా, పనులు చేయకపోయినట్లయితే సం బంధిత అధికారులు, సర్పంచ్‌లపై చర్యలు తీసుకోనున్నారు.


logo