సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - May 31, 2020 , 23:54:15

కరోనా, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తం

కరోనా, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తం

  • పల్లెలు, పట్టణాల్లో నేటి నుంచి 8 వరకు కార్యక్రమం
  • పనులపై ఆకస్మిక తనిఖీలు చేయనున్న అధికారులు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనాతోపాటు రానున్న వర్షాకాలం దృష్ట్యా సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. మొన్నటి వరకు పట్టణాల్లోనే నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులు గ్రామ పంచాయతీలకు వ్యాపించడంతోపాటు సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇందులో భాగంగా జూన్‌ 1 నుంచి 8 వరకు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీల్లో ఎనిమిది రోజుల్లో చేసే పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించి ఏరోజు ఏ పనులు చేపట్టాలనే దానిపై ప్రణాళికను రూపొందించారు. అంతేకాకుండా ఇప్పటికే పారిశుద్ధ్య కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని, తప్పక పాల్గొనాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులతోపాటు సర్పంచ్‌, ఉప సర్పంచులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అయితే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండడంతోపాటు వర్షాలు ప్రారంభమయినట్లయితే వర్షపు నీరు రావడం, నిల్వ ఉండడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, మురుగునీరు నిల్వ ఉండడం, పారిశుద్ధ్యం లోపించడం, తదితర కారణాలతో మలేరియా, టైపాయిడ్‌, డయేరియా, స్వైన్‌ఫ్లూ, కలరా తదితర వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నాయి. ఆహారం పరిశుభ్రత లోపిస్తే అతిసార, కామెర్లు, టైపాయిడ్‌ వ్యాధులు, మంచినీరు, పరిశుభ్రత లోపిస్తే టైపాయిడ్‌, కలరా వ్యాధులు, దోమ కాటుతో మలేరియా, డెంగ్యూ, ఈగలతో టైపాయిడ్‌తోపాటు ఇతర అంటు వ్యాధులతోపాటు స్వైన్‌ ఫ్లూ వంటి భయంకరమైన వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. గతంలో జిల్లా లో భయంకరమైన స్వైన్‌ ఫ్లూ, డెంగ్యూ కేసులు కూడా నమోదైన దృష్ట్యా ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి నష్టం జరుగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బంధీ చర్యలు చేపట్టింది. 

జూన్‌ 1 నుంచి 8 వరకు ప్రత్యేక డ్రైవ్‌..

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్‌ 1 నుంచి 8 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ చేపట్టనున్నారు. నేడు ఎనిమిది రోజులపాటు నిర్వహించే పారిశుద్ధ్య కార్యక్రమం గుర్తించి టంటం చేయనున్నారు. అంతేకాకుండా ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులుతోపాటు సర్పంచులు తదితరులు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి లోతట్టు ప్రాంతాలు, పల్లపు ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో ప్రాంతాల వారీగా గుర్తించి, 8 రోజుల్లో పూడ్చి వేసేలా ప్రణాళికను రూపొందించనున్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య పనులకు కావాల్సిన ఫాగింగ్‌ యంత్రాలు, స్ప్రేయర్లు, బ్లీచింగ్‌ పౌడర్‌, హైపోక్లోరైడ్‌ సొల్యుషన్‌, గాంబోషియా ఫిష్‌, ఆయిల్‌ బాల్స్‌, యంటి లార్వా లిక్విడ్‌ వంటివి ముందుస్తుగా సమకూర్చుకోనున్నారు.

ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ప్రణాళికను ఒకరోజు ముందుగానే రూపొందించుకోవడంతోపాటు ప్రతీరోజు ఉదయం 7గంటలలోపు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో పక్కాగా పనులు నిర్వహించేందుకుగాను లోతట్టు ప్రాంతాల్లో పనులు చేపట్టకముందు పూర్తైన తర్వాత ఫొటోలు తీయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీరోజు గ్రామ పంచాయతీల్లో చేసే పనులను సాయంత్రంలోగా నివేదికతోపాటు ఫొటోలను జిల్లా పంచాయతీ అధికారికి పంపనున్నారు. అదేవిధంగా ప్రత్యే క డ్రైవ్‌లో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. పారిశుద్ధ్య పనులు పూర్తి కానట్లయితే గ్రామ పంచాయతీ కార్యదర్శితోపాటు సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, సంబంధిత వార్డు సభ్యులను బాధ్యులను చేయనున్నారు.

8రోజుల్లో చేపట్టే పనులివే..

ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ప్రతీరోజు గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపిం గ్‌ యార్డులకు తరలించనున్నారు. మురుగు కాల్వలను శుభ్రం చేసి బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లనున్నారు. గ్రామాల్లో నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని మొరంతో మరమ్మత్తులు చేయ డం, పైప్‌లైన్‌ లికేజి మరమ్మత్తులు చేయడం, గ్రామాల్లో ఫాగింగ్‌ యంత్రం ద్వారా స్ప్రే చేసి రోగకారక జీవులు చేరకుండా చూడడం వంటి పనులు చేపట్టనున్నారు. జూన్‌ 2న రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పల్లపు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

జూన్‌ 3న మురుగు కాల్వలను శుభ్రం చేయడం, జూన్‌ 4న గ్రామాల్లో ముళ్ల పొదలను, పిచ్చి మొక్కలను తొలగించడం, మొక్కల చూట్టు హద్దులు, మొక్కల కొమ్మలను సరిచేయడం, అంతర్గత రహదారులను శుభ్రం చేయనున్నారు. జూన్‌ 5న డ్రై డేలో భాగంగా పాత వస్తువులను, నిల్వ ఉన్న నీటిని తొలగించడం, మొక్కలకు నీరు పోయనున్నారు. జూన్‌ 6న మంచినీటి సరఫరా ట్యాంకులను శుభ్రం చేయడం, క్లోరినేషన్‌ చేయనున్నారు. జూన్‌ 7న గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి శ్రమదానం చేయడం, ప్లాస్టిక్‌ పదార్థాలను తొలగించనున్నారు. జూన్‌8న నిల్వ ఉన్న నీటి ప్రదేశాలను, కుంటలను నిరూపయోగంగా ఉన్న బోర్‌వెల్స్‌ను మొరంతో పూడ్చి వేయనున్నారు. 

కరోనా, సీజనల్‌ వ్యాధులపై ముందస్తు చర్యలు

జూన్‌ 1 నుంచి చేపట్టే పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్‌లో అధికారు లు, ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలని, అన్ని గ్రామాల ప్రజ లు కూడా భాగస్వాములు కావాలని జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా సూచించారు. కరోనా, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుం డా గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టామన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఉప సర్పంచు లు, సంబంధిత వార్డు సభ్యులపై చర్యలు తీసుకోబడునన్నారు. రాష్ట్ర ఆవతరణ దినోత్సవం రోజున పెద్ద ఎత్తున ఇంకుడుగుంతలను చేపట్టేందుకు నిర్ణయించామన్నారు. 

- రిజ్వానా, డీపీవో వికారాబాద్‌ 


logo