గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - May 31, 2020 , 00:32:27

75 చదరపు గజాల్లో నిర్మాణాలకు సులువుగా అనుమతులు

75 చదరపు గజాల్లో నిర్మాణాలకు సులువుగా అనుమతులు

  • రేపటి నుంచి టీఎస్‌బీపాస్‌ 
  • జీ, జీప్లస్‌ టు భవనాలకు ఆస్తి పన్ను మినహాయింపు
  • కలెక్టర్‌ ఆధ్వర్యంలో పర్యవేక్షించనున్న కమిటీ
  • పైలట్‌ ప్రాజెక్టుగా వికారాబాద్‌ మున్సిపాలిటీ ఎంపిక
  • ఇప్పటివరకు  55 దరఖాస్తులు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ :  భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్‌ బీపాస్‌ జూన్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. భవన నిర్మాణ అనుమతుల్లో ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఉండేందుకుగాను రేపటి నుంచి అన్ని మున్సిపాలిటీల్లో టీఎస్‌ బీపాస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలోని వికారాబాద్‌ మున్సిపాలిటీని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ట్రయల్‌ రన్‌ కొనసాగిస్తున్నారు.

ఇప్పటివరకు వికారాబాద్‌ మున్సిపాలిటీలో టీఎస్‌-బీపాస్‌ ద్వారా ఆన్‌లైన్లో భవన నిర్మాణ అనుమతుల కోసం 55 దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇకపై భవన నిర్మాణ అనుమతుల కోసం మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే అనుమతినిచ్చే నూతన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సొంతింటి కలను నిజం చేసుకునే వారికి మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు పొందడమంటే చాలా కష్టమైన వ్యవహారం.మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రణాళిక విభాగంలో అంతా అవినీతిమయం కావడంతో లంచమిస్తేనే అనుమతులిచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో భవన నిర్మాణ అనుమతుల్లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు సంబంధం లేకుండా, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఇండ్ల నిర్మాణ అనుమతులిచ్చేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ బీపాస్‌ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. 

 తక్షణమే అనుమతులు..

భవన నిర్మాణ అనుమతి ఇకపై మరింత సులువు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న టీఎస్‌ బీపాస్‌తో దరఖాస్తు చేసుకున్న తక్షణమే అనుమతులు మంజూరు కానున్నాయి. ఇకపై భవన నిర్మాణ అనుమతులకై రోజుల తరబడి మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చి దరఖాస్తు చేసుకుంటే చాలు.. క్షణాల్లో స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్‌ సర్టిఫికెట్‌) పత్రం జారీ అవుతుంది. సంబంధిత స్వీయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా భవన నిర్మాణాన్ని చేపట్టవచ్చు.  ఇకపై భవన నిర్మాణ అనుమతుల్లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల భాగస్వామ్యం లేకుండా నేరుగా భవన నిర్మాణదారులే టీఎస్‌ బీపాస్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందవచ్చు. 75 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మించే భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి నామమాత్రంగా ఒక్క రూపాయిని చెల్లిస్తే సరిపోతుంది.వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కానుంది.

75 చదరపు గజాల నుంచి 239 చదరపు గజాల వరకుగల స్థలంలో భవన నిర్మాణాలు చేపట్టేవారు బిల్డింగ్‌ ప్లాన్‌ను టీఎస్‌ బీపాస్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులు మంజూరవుతాయి. అయితే తదనంతరం జిల్లా కలెక్టర్‌ నియమించే స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం(ఇరిగేషన్‌, ఆర్‌ అండ్‌ బీ అధికారులు) క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారు. అయితే వాస్తవాలను తప్పుగా పేర్కొని నిర్మాణాన్ని చేసినట్లయితే ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే సదరు నిర్మాణదారులకు జరిమానా విధించడంతోపాటు సంబంధిత భవన నిర్మాణాన్ని కూలగొట్టడం లేదా స్వాధీనపర్చుకుంటారు. 500 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలోని ప్లాట్లలో నిర్మించే భవన నిర్మాణాలకు సింగిల్‌ విండో విధానం ద్వారా 21 రోజుల్లో అనుమతులు పొందుతారు. అయితే 240 చదరపు గజాల కంటే ఎక్కువ, 500 చదరపు గజాల వరకు ఉండే భవనాలకు స్వీయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా స్వాధీన ధ్రువీకరణ పత్రాన్ని తక్షణమే అందజేస్తారు. అదేవిధంగా 500 చదరపు గజాలపైగల భవనాలకు స్వీయ ధ్రువీకరణ దరఖాస్తు ఆధారంగా 15 రోజుల్లో స్వాధీన ధ్రువపత్రం జారీ చేస్తారు. సంబంధిత స్వాధీన ధ్రువీకరణ పత్రాలను జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటయ్యే టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పర్యవేస్తుంది. అయితే గతంలో మాదిరిగా అగ్నిమాపక, నీటి పారుదల తదితర శాఖలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా టీఎస్‌ బీపాస్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు ఒకేచోట అన్ని అనుమతులు జారీ అవుతాయి.

అన్ని ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా ఉండి దరఖాస్తు చేసుకున్నా 21 రోజుల్లో అనుమతి రానట్లయితే 22వ రోజున అనుమతిచ్చినట్లుగా సమాచారం సదరు భవన నిర్మాణదారుడికి పంపిస్తారు. వాస్తవాలను తప్పుగా ఆన్‌లైన్‌లో పొందుపర్చినట్లయితే  నిర్మాణాలను కూల్చివేయడంతోపాటు భవన యజమాని నుంచి కూల్చివేత ఖర్చులు వసూలు చేస్తారు. మూడేండ్ల జైలు శిక్ష ఉంటుంది.  సంబంధిత నిర్మాణాలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి సమాచారమిచ్చేవారిని ప్రోత్సహించడంతోపాటు ఏడు రోజుల్లోగా చర్యలు తీసుకుంటారు. నూతన విధానం ప్రకారం కేవలం పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా కేటాయించే ప్రాంతాన్ని పార్కింగ్‌కు కాకుండా వేరొకవిధంగా వాడుకున్నట్లయితే నిబంధనల ఉల్లంఘన కింద యజమానికి స్థలం విలువతోపాటు భవన క్యాపిటల్‌ విలువలో 25 శాతం జరిమానా విధిస్తారు.

అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలో పార్కింగ్‌ ఉల్లంఘనలను గుర్తించడంతోపాటు పర్యవేక్షించి నియంత్రించేందుకుజిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తారు. కొత్త విధానం ప్రకారం ప్రతి లేఅవుట్‌లో పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది. లేఅవుట్‌ పూర్తైన తర్వాత ఖాళీ స్థలాలను రోడ్లకు కేటాయించిన భూమికిని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటయ్యే లేఅవుట్‌ ఆమోద కమిటీ తాత్కాలిక లేఅవుట్లను పరిశీలించి సరిగ్గా ఉన్నట్లయితే సంబంధిత కమిటీ శాశ్వత అనుమతిని ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు. అదేవిధంగా ఆస్తిపన్నుకు సంబంధించి 75 చదరపు గజాల కంటే తక్కువ స్థలంలో నిర్మించే జి, జీప్లస్‌1 నివాస భవనాలకు ఆస్తి పన్ను మినహాయిస్తారు. రిజిస్ట్రేషన్‌పై మ్యుటేషన్‌ తక్షణమే చేస్తారు. భవన యజమాని తప్పుడు వివరాలిచ్చినట్లయితే ఆస్తిపన్ను 25 రెట్లు జరిమానా (వన్‌టైం పెనాల్టీ) విధిస్తారు. logo