బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - May 29, 2020 , 23:39:47

భయం వద్దు .. జాగ్రత్తలు పాటించండి

భయం వద్దు .. జాగ్రత్తలు పాటించండి

బొంరాస్‌పేట : కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినంత మా త్రాన భయపడరాదని, అధికారులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు ప్రజలకు సూచించారు. కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చిన మండలంలోని గౌరారం గ్రామంలో శుక్రవారం కలెక్టర్‌ పర్యటించారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరా న్ని సందర్శించారు. గ్రామంలో ఎన్ని ఇండ్లను క్వారంటైన్‌ చేశారని ప్రశ్నించగా 104 ఇండ్లు, 653 మందిని హోం క్వారంటైన్‌ చేశామని తహసీల్దార్‌ షాహెదాబేగం చెప్పారు. క్వారంటైన్‌ చేసిన ఇండ్లకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న చంద్రప్ప కుటుంబ సభ్యులతో మాట్లాడారు. హైరిస్క్‌ ఉన్న వారి బాగోగులు చూసుకునే వారు తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. గ్రామంలోని ప్రజలందరికీ త్రీ లేయర్‌ మాస్కులను పంపిణీ చేయాలని వైద్యాధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. క్వారంటైన్‌ చేసిన ఇండ్లకు స్టిక్కర్లు వేశారా, ఇంట్లోని వారికి పరీక్షలు నిర్వహించిన వివరాలను నమోదు చేస్తున్నారా లేదా పరిశీలించారు. ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని, ప్రతి రోజూ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, జ్వరంతో ఉన్న వారిని 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశించారు. గ్రామంలో ఎన్ని గుంతలు తవ్వారని, పారిశుద్ధ్య పనులు ప్రణాళిక ప్రకారం చేస్తున్నారా, శుక్రవారం డ్రైడేగా పాటిస్తున్నారా లే దా అని పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో హరినందనరావును అడిగారు. 

ప్రణాళిక ప్రకారం పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని వారు చెప్పారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి నిర్వహిస్తున్న కిరాణా దుకాణాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఇంటి పరిసరాలను సోడియం హైపోక్లోరైట్‌తో పిచికారీ చేశారా, దుకాణానికి ఎంత మంది వచ్చి వెళ్లారో వివరాలు సేకరించారా అని ప్రశ్నించగా, ద్రావణం పిచికారీ చేశామని అధికారులు చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ ఉపాధి హామీ పనులు కొనసాగించవచ్చని, రైతులు పొలం పనులకు వెళ్లవచ్చని కలెక్టర్‌ అనుమతించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే కరోనా పరీక్షలు చేస్తున్నామని, ప్రస్తుతం జిల్లాలో ఐదు పాజిటివ్‌ కేసులు ఉన్నాయని కలెక్టర్‌ చెప్పారు. వైద్య శిబిరంలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చాంద్‌పాషా, డీఎంహెచ్‌వో దశరథ్‌, వైద్యాధికారి రవీంద్ర యాదవ్‌, ఎంపీడీవో హరినందనరావు, సీఐ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. 


logo