సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - May 28, 2020 , 22:50:36

ప్రాధాన్య పంటలే మేలు

ప్రాధాన్య పంటలే మేలు

  • నియంత్రిత సాగుతో అధిక దిగుబడులు
  • ప్రభుత్వం సూచించిన పంటలే పండించాలి
  • వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, ఆనంద్‌, నరేందర్‌రెడ్డి

నియంత్రిత సాగు విధానంలో అధిక దిగుబడులతో లాభాలు వచ్చే పంటలను పండించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పల్లెల్లో గ్రామసభలు పెట్టి పంటల సాగుపై సీఎం కేసీఆర్‌ చెప్పిన బాటలో సాగుదామని సూచిస్తున్నారు. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండిస్తే మంచి లాభాలు పొందవచ్చని చెబుతున్నారు. రైతును రాజును చేయాలనే సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టిందని తెలియజేస్తున్నారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు రెడీగా ఉన్నాయని, సలహాలు, సూచనల కోసం వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి సభ్యులు అందుబాటులో ఉంటారని పేర్కొంటున్నారు.

వికారాబాద్‌ : నియంత్రిత విధానంలో సాగు చేసి రైతులు అధిక దిగుబడులతో లాభాలు పొందవచ్చని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. గురువారం మండల పరిధిలోని జైదుపల్లి గ్రామంలో వ్యవసాయాధికారులు రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా, కలెక్టర్‌ పౌసుమి బసు పాల్గొని అధిక లాభాలు వచ్చే పంటల వివరాలను రైతులకు వివరించారు. మక్కజొన్న పంటకు బదులుగా కందులు, మినుములు, పత్తి, కూరగాయలు మొదలైన డిమాండ్‌ ఉన్న పంటలను పండించాలన్నారు. దీంతో పాటు చిరుధాన్యాలు పండించే వారికి ఉచితంగా విత్తనాలు అందించడం జరుగుతుందన్నారు. రైతులను రాజు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నాదని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ నర్సింహరెడ్డి, వ్యవసాయ అధికారి ప్రసన్నలక్ష్మి, వ్యవసాయ విస్తీర్ణ అధికారి అనిల్‌కుమార్‌, సర్పంచ్‌ ఎల్లమ్మ, రైతులు పాల్గొన్నారు. 

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఆమనగల్లు : నూతన వ్యవసాయ సాగు విధానంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పేర్కొన్నారు.  పోలేపల్లి, కొత్తకుంటతండాలో మండల వ్యవసాయాధికారి అరుణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాధాన్యత ఉన్న పంటలనే రైతులు సాగు చేసి లాభాల పొందాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు బలరాం,శోభ, ఉపసర్పంచ్‌ అంజిరెడ్డి,  రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అర్జున్‌రావు, భగవాన్‌రెడ్డి జడ్పీటీసీ అనురాధ, వైస్‌చైర్మన్‌ అనంతరెడ్డి,  ఏఈఓలు సాయిరాం, శివతేజ పాల్గొన్నారు.

 తలకొండపల్లి : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. రాంపూర్‌, పడకల్‌ గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఎమ్మెల్యే, జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియంత్రిత పంటల సాగుతో రైతులు లాభాల బాట పడతారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రమేశ్‌, శ్యాంసుందర్‌రెడ్డి, దశరథ్‌నాయక్‌, ఏఈఓలు, శివుడు, విజయ్‌, శ్వేత పాల్గొన్నారు. 

 సూచించిన పంటలనే సాగు చేయాలి

బంట్వారం : వానకాలంలో ప్రతి రైతు అధికారులు సూచించిన పంటలనే పండించాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు.  మండలంలోని తొరుమామిడి గ్రామంలో రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎక్కువ మక్కజొన్న పంటను పండించి నష్టపోతున్నారని పేర్కొన్నారు. అంతేకాక మార్కెట్‌లో సరైన ధర లేకపోతే నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఈ ఎడాది మక్కజొన్న పంటను వేయరాదని, దాని స్థానంలో ఇతర పంటలను పండించాలన్నారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ స్ఫూర్తి, ఎంపీపీ ప్రభాకర్‌, ఎంపీటీసీ శ్రీకాంత్‌రెడ్డి, ఏడీఏ వినయ్‌కుమార్‌, ఏవో సంధ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌గౌడ్‌, ఎంపీడీవో అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు. 

- వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌

రైతుబంధు సాయం నిలిపి వేయడం లేదు

బొంరాస్‌పేట : పెట్టుబడి సాయాన్ని అందించే రైతుబంధు పథకాన్ని నిలిపి వేయడం లేదని, ప్రతి రైతుకు ఈ పథకం కింద లాగొడి సహాయం అందజేస్తామని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం  దుద్యాల గ్రామంలో ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి రైతులకు రాయితీపై ఎరువులను పంపిణీ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు టీఆర్‌ఎస్‌ నాయకుడు టీటీ రాములు ఆధ్వర్యంలో కూరగాయలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్‌ ఎంపీపీ నారాయణరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, మహిళా విభాగం అధ్యక్షురాలు కవిత, సర్పంచ్‌ మహ్మద్‌ ఖాజా, ఎంపీటీసీలు, నాయకులు, ఏడీఏ వినయ్‌కుమార్‌, ఏవో రాజేశ్‌, రైతులు పాల్గొన్నారు.

-కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

  రైతులు మక్కజొన్న సాగు చేయొద్దు

షాబాద్‌ : వానకాలంలో రైతులు మక్కజొన్న పంటను సాగు చేయవద్దని షాబాద్‌ మండల వ్యవసాయాధికారి వెంకటేశం అన్నారు. మండల పరిధిలోని సీతారాంపూర్‌, మల్లారెడ్డిగూడ, సంకెపల్లిగూడ, కుర్వగూడ, అప్పారెడ్డిగూడ, మక్తగూడ, రేగడిదోస్వాడ, పోతుగల్‌, పోలారం, మాచన్‌పల్లి గ్రామాల్లో నియంత్రిత వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాండురంగారెడ్డి, జంగయ్య, దర్శన్‌, సంధ్య, పూజిత, శ్రీనివాస్‌గౌడ్‌, రాములు, ఇస్మత్‌బేగం, మంగమ్మ, మహేందర్‌రెడ్డి, ఏఈఓలు రాజేశ్వరి, లిఖిత, సోనీశ్రీ, రాఘవేందర్‌, కిరణ్మయి, రైతులు పాల్గొన్నారు. logo