మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - May 28, 2020 , 22:44:17

టెండరింగ్‌తో సరి?

టెండరింగ్‌తో సరి?

  • తాండూరు రింగ్‌రోడ్డు పనులపై నిర్లక్ష్యం
  • 94 ఎకరాల భూ సేకరణ
  • నిర్మాణానికి రూ.78 కోట్ల నిధులు మంజూరు
  • టెండర్లు దక్కించుకున్న ఎస్‌ఎస్‌ఆర్‌ సంస్థ
  • రెండేైండ్లెనా ప్రారంభం కాని పనులు
  • కాంట్రాక్టర్లకు రెండుసార్లు నోటీసులు జారీ 

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది తాండూరు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిస్థితి. 13 కి.మీ.ల రోడ్డు కోసం 94 ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం సుమారు రూ.ఆరు కోట్ల నష్టపరిహారాన్ని రైతులకు అందజేసింది. రింగ్‌ రోడ్డు నిర్మాణ పనులకు రూ.78 కోట్ల నిధులు మంజూరు చేసింది.. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. ఆ రోడ్డుకు శాపంగా మారింది. టెండర్‌ దక్కించుకుని రెండేండ్లు దాటినా పనులు మాత్రం మొదలుపెట్ట లేదు. ఇతర రోడ్డు పనులను పూర్తి చేస్తున్నా..  ఓఆర్‌ఆర్‌ను పట్టించుకోవడంలేదు.  మరోవైపు కాలుష్యం తగ్గి, ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం అవుతుందనే ఆశ అడియాశగానే మిగిలిపోతుందని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.   

 వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది తాండూరు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిస్థితి. తాండూరు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి రెండేండ్లైనా, కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించలేదు. మార్చిలోనే రింగ్‌రోడ్డు పనులను మొదలుపెట్టాలని నిర్ణయించినప్పటికీ, లాక్‌డౌన్‌తో ప్రారంభించలేకపోయారు. లాక్‌డౌన్‌ సడలింపులిచ్చి పదిహేను రోజులు కావస్తున్నా పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. సంబంధిత కాంట్రాక్టర్‌పై జిల్లా రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ వారు పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. పనుల జాప్యంపై ఆర్‌అండ్‌బీ అధికారులు సద రు కాంట్రాక్టర్‌కు నోటీసులు కూడా జారీ చేశారు. అయినా ఆయన స్పందించకపోవడం గమనార్హం. తాండూరు రింగ్‌రోడ్డుతో పాటు ఇతర రహదారుల పనులను ఎస్‌ఎస్‌ఆర్‌ సంస్థతో కలిసి మరో కాంట్రాక్టర్‌ దక్కించుకున్నారు. వీరు మిగతా రోడ్డు నిర్మాణ పనులను కొనసాగిస్తూ రెండేండ్లుగా రింగ్‌రోడ్డు పనులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారుల ద్వారా తెలిసింది. 

త్వరలో రింగ్‌రోడ్డు పనులు షురూ...

తాండూరు ఔటర్‌ రింగ్‌రోడ్డు పనులను త్వరలో ప్రారంభించేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పనుల్లో జాప్యం జరిగిన దృష్ట్యా త్వరితగతిన పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

భూ సేకరణ ప్రక్రియ పూర్తి

ఇప్పటికే సంబంధిత అధికారులు భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. రింగ్‌రోడ్డు పనులు ప్రారంభానికి జంగిల్‌ తొలగించడంతో పాటు మిగతా అంతా సిద్ధం చేస్తున్నారు. 13 కి.మీ రింగ్‌రోడ్డుకు సంబంధించి 94ఎకరాల భూసేకరణ చేపట్టారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులు నష్టపోకుండా మార్కెట్‌ రేటుకు అధికంగానే జిల్లా యంత్రాంగం నష్టపరిహారం చెల్లిస్తున్నారు. ఇప్పటికే చెంగోల్‌, అంతారం గ్రామాల రైతులకు పరిహారం అందజేసింది. కోకట్‌, రసూల్‌పూర్‌ తండాకు చెందిన రైతులకు చెల్లించాల్సి ఉంది. రోడ్డు నిర్మాణానికి యాలాల మండలం కోకట్‌లో 46.23 ఎకరాలు, రసూల్‌పుర్‌ తండాలో 5.35 ఎకరాలు, తాండూరు మండలం చెంగోల్‌లో 23.17 ఎకరాలు, అంతారంలో 20.11 ఎకరాల  భూమిని అధికారులు సేకరించారు. కోకట్‌లోని 46.23 ఎకరాలకు సంబంధించి రూ.3.16 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంది. మిగతా రూ. 5.90కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని అధికారులు వెల్లడించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి సంబంధించి రూ.78 కోట్ల నిధులను ప్రభు త్వం ఇప్పటికే మంజూరు చేసింది. అయితే 13కిలో మీటర్ల ఔటర్‌ రింగ్‌రోడ్డు ను తాండూరు, యాలాల మండలాల మీదుగా నిర్మించనున్నారు. తాండూరు మండలం గౌతాపూర్‌ నుంచి అంతారం మీదుగా యాలాల మండలం బిలాల్‌ నాయక్‌ తండా, రసూల్‌పురా ఆంజనేయస్వామి ఆలయం మీదుగా, చించోలి-మహబూబ్‌నగర్‌ రాష్ట్ర రహదారి మీదుగా రాజీవ్‌ గృహకల్ప మీదుగా ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మించనున్నారు. 

తగ్గనున్న వాహన కాలుష్యం

తాండూరులో సిమెంట్‌ కంపెనీలు, నాపరాతి పరిశ్రమలు ఉండడంతో పెద్ద మొత్తంలో వాహనాలు తిరుగుతుండడంతో పట్టణంలో కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. రోజుకు 2 నుంచి 3వేల వరకు వాహనాల రాకపోకలతో పట్టణవాసులు కాలుష్య సమస్యతో సతమతమవుతున్నారు. రింగ్‌రోడ్డు అందుబాటులోకి వస్తే కాలుష్యం పూర్తిగా తగ్గనున్నది. దీంతోపాటు పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యకూ పరిష్కారం లభించనున్నది. భారీ వాహనాల రాకపోకల దృష్ట్యా రోడ్లు దెబ్బతిని అస్తవ్యస్తం గా మారుతున్నాయి. కొడంగల్‌ నుంచి వచ్చే వాహనాలు పెద్దేముల్‌ మీదుగా జహీరాబాద్‌ వెళ్లాల్సినా, చించోలి నుంచి పెద్దేముల్‌ మీదుగా జహీరాబాద్‌ వెళ్లాల్సినా, వికారాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ వెళ్లాల్సినా, తాండూర్‌ పట్టణంలోకి రాకుండానే ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా వెళ్లొచ్చు.

వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తాం

తాండూరు ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణ పనుల కోసం భూసేకరణ ప్రక్రియ  పూర్తయ్యింది. మరో వారం రోజుల్లో పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతాం. పనుల ప్రారంభంలో జాప్యం చేస్తుండడంతో ఇప్పటికే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీచేశాం. భూసేకరణలో నష్టపోయిన రైతులకు పరిహారాన్ని కూడా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నది. పెండింగ్‌లో ఉన్న నష ్టపరిహారాన్ని కూడా త్వరలో అందించనున్నాం. త్వరితగతిన పనులు ప్రారంభించి రింగ్‌ రోడ్డును అందుబాటులోకి తీసుకొస్తాం.

- లాల్‌సింగ్‌, ఆర్‌అండ్‌ బీ ఈఈ


logo