మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - May 27, 2020 , 01:12:50

ఫలితాలిస్తున్న హరిత నర్సరీలు

ఫలితాలిస్తున్న హరిత నర్సరీలు

  • పండ్ల మొక్కలతో రైతులకు మేలు
  • సర్పన్‌పల్లిలో కాపుకొచ్చిన బొప్పాయి తోట 

వికారాబాద్‌ రూరల్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం గ్రామాల్లో సత్ఫలితాలనిస్తున్నది. గతేడాది మండలంలోని 5వ విడుత హరితహారం కార్యక్రమంలో సుమారు 3 లక్షల మొక్కలు నాటారు. అందులో మండలంలోని సర్పన్‌పల్లి, అత్వెల్లి, ఎర్రవల్లి, మదన్‌పల్లి తదితర గ్రామాల్లో పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. సర్పన్‌పల్లి గ్రామంలోని రైతు హనుమయ్య పంట పండింది. గ్రామ నర్సరీ నుంచి 200 బొప్పాయి మొక్కలు తీసుకున్నాడు. వాటిని తన పొలం గట్లపై నాటి జాగ్రత్తగా సంరక్షించాడు. దీంతో బొప్పాయి పండ్లు చేతికొచ్చాయి. ఈ ఆనందంలో రైతు మండల అధికారులను తన పొలానికి తీసుకువెళ్లి పండ్లను అందించాడు. ఒక రైతు పండ్ల తోట పెట్టాలంటే పొలాన్ని చదును చేసి మొక్కలను కొనుగోలు చేసి నాటడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రభుత్వం గ్రామీణ నర్సరీలు ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన మొక్కలు అందిస్తుండంతో రైతులకు లాభసాటిగా మారింది. మండలంలోని నాలుగు గ్రామాల్లో ఈ ఫలితాలు రాగా మిగ తా గ్రామాల రైతులు కూడా ఈ ఏడాది పండ్ల మొక్కలు తీసుకొని పొలం గట్లపై, పొలాల్లో సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారని అధికారులు వివరించారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయానికి సత్ఫలితాలు అందుతుండడంతో సీఎం ఏం చేసినా తమ కోసమే చేస్తున్నాడనే నమ్మకం రైతుల్లో ఏర్పడింది. ప్రస్తుతం మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో ఉన్న నర్సరీల్లోని మొక్కలను రైతులకు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 

వర్షాకాలంలో ఈ పండ్లకు మరింత గిరాకీ: రైతు హన్మయ్య

పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఇలా పండ్ల మొక్కలు పెంచే స్థోమత మా  దగ్గర లేదు.గతేడాది డెంగ్యూ వ్యాధి ఎక్కువగా రావడంతో బొప్పాయి పండుకు గిరాకీ లభించింది. ఈ ఏడాది మా   పంట చేతికి రావడం చాలా సంతోషంగా ఉంది. వర్షాకాలం ప్రారంభం సమయంలో బొప్పాయి పండ్లు వచ్చాయి. పొలం గట్లపై ఉన్న బొప్పాయి చెట్లను కాపాడుకుంటాను. 

పండ్ల మొక్కలకు అధిక ప్రాధాన్యం

మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో నర్సరీల్లో పెంచుతున్న మొక్కల్లో అధికంగా పండ్ల మొక్కలకే ప్రాధాన్యమిస్తున్నాము. జామ, నిమ్మ, బొప్పాయి, దాని మ్మ, అల్లనేరడి లాంటి మొక్కలను నర్సరీల్లో అందుబాటులో ఉంచాము. కావాల్సిన రైతులందరికీ పండ్ల మొక్కలు అందిస్తాము.

- ఎంపీడీవో సుభాషిణి

పండ్ల మొక్కలు పెంచడంతో రైతులకు ఎంతో మేలు.. 

రైతులకు పండ్ల మొక్కలు పంపిణీ చేయడం ద్వారా పొలం గట్లపై పెంచి మంచి ఫలితాలు రాబట్టవచ్చు. సర్పన్‌పల్లి రైతు హన్మయ్యనే దీనికి ఉదహరణ. పొలం గట్లపై 200 బొప్పాయి మొక్కలు పెంచగా కాపుకొచ్చాయి. ఈ మొక్క రెండేండ్లు బతుకుతుంది. రైతులకు కూడా లాభసాటిగా ఉంటుంది. ఒక ఎకరాలో 40 టన్నుల పంట తీయవచ్చు.

- హార్టికల్చర్‌ మండల అధికారి వైజయంతి


logo