మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - May 27, 2020 , 01:08:32

జోరుగా వరి కొనుగోళ్లు

జోరుగా వరి కొనుగోళ్లు

11,953 టన్నుల ధాన్యం సేకరణ

కొడంగల్‌ నియోజకవర్గంలో 

50 కేంద్రాల ఏర్పాటు

రైతు ముంగిట 

ధాన్యం కొనుగోలు కేంద్రాలు

కొడంగల్‌ : వరి ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కరోనా వైరస్‌ కారణంగా మార్కెట్లో అమ్ముకునే అవకాశం లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. గతంలో మండలాల్లోని ఆయా ప్రాంతాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేది. నియోజకవర్గంలో ఈ ఏడాది పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 50వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1835లు, బీ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1800లు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు చేపట్టుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రైవేటు మార్కెట్‌లో అమ్మితే తూకం, ధరలో మోసాలకు పాల్పడేవారని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో భద్రతతో పాటు గిట్టుబాటు ధర, నేరుగా బ్యాంకు ఖాతాలోకి వారం రోజుల్లోనే నగదు జమ అవుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాగుకు 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తుండడంతో వరి పంట సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో పాటు కొత్తరకం వంగడాలతో నాటు వేయడంతో దిగుబడులు కూడా గణనీయంగా పెరిగి కేం ద్రాలకు ధాన్యం పోటెత్తుతున్నది. రైతులు తెచ్చిన ధాన్యంలో తేమ శాతం ఎంత ఉందో పరిశీలించి తూకం వేసి దాని ప్రకారమే ధరను చెల్లిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు గుంపులు గుంపులుగా రాకూదడన్న ఉద్దేశంతో అధికారులు ముందుగానే టోకెన్లు పంపిణీ చేశారు. వారికి ఇచ్చిన తేదీ ప్రకారం కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చి తూకం వేయించారు. తూకం వేసిన వెంటనే వాటి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాబడుతున్నది.  

నియోజకవర్గంలో 11,953 టన్నుల ధాన్యం సేకరణ...

 నియోజకవర్గంలోని కొడంగల్‌, బొం రాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల్లో మొత్తం గా ఏర్పాటు కాబడ్డ 50 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 11, 953 టన్నుల వరి ధాన్యాన్ని సేకరించారు. కొడంగల్‌ మండలంలో 2 వేల ఎకరాలు, బొంరాస్‌పేట మండలంలో 3600 ఎకరాలు, దౌల్తాబాద్‌ మండలంలో 2 వేల ఎకరాల్లో వరిని సాగు చేసినట్లు అధికారులు తెలిపారు. శనివారం వరకు కొడంగల్‌ మం డలంలోని హస్నాబాద్‌, ఉడిమేశ్వరం, అంగడిరైచూర్‌, చిన్ననందిగామ, చిట్లపల్లి గ్రామాల్లో 2,957 టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా బొంరాస్‌పేట మండలంలో నాగిరెడ్డిపల్లి, చిల్‌ముల్‌మైలారం, చౌదర్‌పల్ల్లి, గౌరారం, మెట్లకుంట, బొంరాస్‌పేట, దుద్యాల, ఏర్పుమళ, నాందార్‌పూర్‌, బు రాన్‌పూర్‌, తుంకిమెట్ల, ఈర్లపలి, లగచెర, మదన్‌పల్లి, నాస్కంపలి, రేగడిమైలారం, కొత్తూరు, దుప్‌చెర్ల, వడిచెర్ల గ్రామాల్లో పెద్ద మొత్తంలో 6,256 టన్నులు, దౌల్తాబాద్‌ మండలంలోని 26 కొనుగోలు కేంద్రాల్లో  2,740 టన్ను ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యాన్ని పరిశీలిస్తే గతేడాది కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉం ది. కొనుగోలు కేంద్రాలకు ఇంకా ధాన్యం వస్తూనే ఉంది. మార్కెట్‌కు, మధ్య దళారులకు అమ్మే అవకాశం లేకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి లాభం పొందుతున్నారు. సకాలంలో డబ్బులు కూడా ఖాతాల్లో జమవుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటి వద్ద అమ్మకం..

గతంలో కొన్ని ప్రాం తాల్లో మాత్రమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయ డం వల్ల పంటను అమ్ముకోవడానికి వ్య య ప్రయాసలతో కేం ద్రాలకు తరలివెళ్లి బారులుతీరాల్సి వచ్చేది. లాక్‌డౌన్‌ వల్ల ప్రభు త్వం రైతు చెంతకు కొనుగోలు కేంద్రాలు అన్నట్లుగా గ్రామాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ఇంటి వద్ద అమ్మకం చేసుకున్నట్లుగా ఉంది. 

దత్తునాయక్‌, పలుగురాళ్లతండా, కొడంగల్‌


logo