గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - May 25, 2020 , 22:55:04

జిల్లాలోఆహార శుద్ధి సెజ్‌

జిల్లాలోఆహార శుద్ధి సెజ్‌

  • 200 ఎకరాల్లో సెజ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు
  • వికారాబాద్‌ జిల్లాలోని పలు  స్థలాల గుర్తింపు
  • జిన్‌గుర్తి లేదా అర్కతలలో ఫైనల్‌ అయ్యే అవకాశం
  • టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో పరిశ్రమల ఏర్పాటు
  • ఆహార శుద్ధి కేంద్రాలతోపాటు,  నిర్మాణం 
  • రైతులకు చేకూరనున్న లబ్ధి

పండించిన పంటకు సరైన మార్కెట్‌ ఉంటేనే రైతుకు లాభం.. రాష్ట్ర ప్రభుత్వం నేడు అదే దిశగా అడుగులేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమలతో కూడిన ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  మూడు ఆహార శుద్ధి కేంద్రాలు   కేసీఆర్‌ ఆదేశాలతో  పప్పు, నూనె మిల్లులు, చెరుకు, చింతపండు, మక్కజొన్న తదితర పంటల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో కూడిన   చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు క్షపతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.  ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేయనుండగా..  తాండూరు, మర్పల్లి, నవాబుపేట్‌ మండలాల్లోని ఐదు చోట్ల స్థలాలను పరిశీలించారు. నివేదికను ష్ట్రపభుత్వానికి అందజేశారు.  టీఎస్‌ఐఐసీ పరిశీలించి స్థలాన్ని ఎంపిక చేయనున్నది.

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: పండించిన పంటకు సరైన మార్కెట్‌ ఉంటేనే రైతుకు లాభం... రాష్ట్ర ప్రభుత్వం నేడు అదే దిశగా అడుగులేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలో ఆహార శుద్ధి పరిశ్రమలతో కూడిన ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతంలో కేవలం మూడు ఆహార శుద్ధి కేంద్రాలు అనుకున్నప్పటికీ సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో త్వరలో బియ్యం, పప్పు, నూనె మిల్లులు, చెరుకు, చింతపండు, మక్కజొన్న తదితర పంటల ఆహార శుద్ధి కేంద్రాలతో కూడిన సెజ్‌ను ఏర్పాటు చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో 200 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేయనున్నారు. దీనికి సమీపంలోనే గోదాములను సైతం నిర్మించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో రాకంచర్ల ఇండస్ట్రియల్‌ పార్కులో పూర్తిగా స్టీల్‌కు సంబంధించి పరిశ్రమలుండగా, శివారెడ్డిపేట్‌లో సుద్దగనులతోపాటు ఇతర పరిశ్రమలున్నాయి. సెజ్‌ ఏర్పాటు కోసం ఇప్పటికే పలు మండలాల్లో అనువైన స్థలాలను గుర్తించిన అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.

4 మండలాల్లో అనువైన స్థలాలు

సెజ్‌ను ఏర్పాటు చేసేందుకుగాను జిల్లాలోని 4 మండలాల్లో అనువైన స్థలాలను గుర్తించారు. సరిపోను ప్రభుత్వ భూములు లేకపోవడంతో అసైన్డ్‌, అటవీ భూములు కలిపి 200 ఎకరాలను ప్రతిపాదించారు. మర్పల్లి మండలంలోని ఘనాపూర్‌ గ్రామంలోని సర్వే నంబర్‌ 57లోని 330 ఎకరాలు(గైరాన్‌ భూమి), వికారాబాద్‌ మండలంలోని గిరిగెట్‌పల్లి గ్రామం సర్వే నంబర్‌ 228లోని 383 ఎకరాలు (పొరంబోకు-సర్కారీ), నవాబుపేట్‌ మండలంలోని అర్కతల గ్రామం సర్వేనంబర్‌ 31లోని 246 ఎకరాల పొరంబోకు భూమి, ఎక్‌మామిడి గ్రామం సర్వే నంబర్‌ 606, 628, 112 లోని  999 ఎకరాలు (అటవీ భూమి), తాండూరు మండలం జిన్‌గుర్తిలోని సర్వే నంబర్‌ 206లోని 305 ఎకరాల పొరంబోకు భూమిని జిల్లా ఉన్నతాధికారులు గుర్తించారు. వీటిలో నవాబుపేట్‌ మండలం ఎక్‌మామిడిలో పూర్తిగా అటవీ భూమి, మర్పల్లి మండలంలోని ఘనాపూర్‌ దూరం కాబట్టి తాండూరు మండలం జిన్‌గుర్తి లేదా నవాబుపేట్‌ మండలం అర్కతలలో ఆహార శుద్ధి సెజ్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిసింది.

ఇక్కడి భూములు కూడా పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉండడంతో ఈ రెండు మండలాల్లో ఏదో ఒక చోట ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సంబంధిత ఐదు స్థలాల రిపోర్ట్‌ను కలెక్టర్‌ ప్రభుత్వానికి అందజేశారు. స్థలాలను పరిశీలించిన అనంతరం టీఎస్‌ఐఐసీకి స్థలాల ఎంపిక బాధ్యతను అప్పగించనున్నారు. ప్రభుత్వం ఆదేశాలతో సంబంధిత స్థలాలను టీఎస్‌ఐఐసీ బృందం పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకుగాను ప్రభుత్వం సబ్సిడీ కూడా అందించనున్నది. ఎస్సీలకు 35 శాతం, బీసీ, ఓసీలకు 15 శాతం, ఎస్సీ మహిళలకు 45 శాతం, బీసీ మహిళలకు 25 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందించనున్నది. మరోవైపు పరిశ్రమల ఏర్పాటుకు రూ.75 లక్షల వరకు నిధులను అందజేయనున్నది.

సెజ్‌లో ఆహార శుద్ధి కేంద్రాలతోపాటు మిల్లులు

జిల్లాలో అధికంగా సాగయ్యే పంటలకు సంబంధించిన ఆహార శుద్ధి కేంద్రాలను స్థానికంగానే ఏర్పాటు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో అత్యధికంగా సాగు చేసే కందులతోపాటు వేరుశనగ, చిరుధాన్యాలు, కూరగాయలు, చెరుకు, చింతపండు, మక్కజొన్న పంటలకు సంబంధించిన ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కంది రైతులు దళారులకు క్వింటాలుకు రూ.5 వేల చొప్పున విక్రయిస్తుండగా, దళారులు కందులను పప్పుగా మార్చి రూ.8 వేలకుపైగా విక్రయిస్తూ రూ.3 వేలకుపైగా లాభాన్ని ఆర్జిస్తున్నారు. శుద్ధి కేంద్రాలు ఏర్పాటైతే రైతులు తాము పండించిన కందులను పప్పుగా మార్చుకుని నేరుగా విక్రయించి క్వింటాలుకు రూ.8 వేలకుపైగా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. మోమిన్‌పేట్‌, నవాబుపేట్‌, పూడూరు, దోమ మండలాల్లోని 12,590 హెక్టార్లలో 30,556 మెట్రిక్‌ టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. టమాట రైతులు ధరలు లేకపోవడంతో పెట్టుబడి రాక అనేకసార్లు పంటను పారబోస్తున్నారు.

ఆహార శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తే టమాట సాస్‌, జ్యూస్‌, సూప్‌ లాంటివి తయారవుతాయి. ఇందుకోసం టమాట కొత్తరకం వంగడాలను సాగు చేసేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించనున్నారు. దీంతో రైతులు ఎలాంటి పరిస్థితుల్లోనూ పంటను పారబోసే పరిస్థితి ఉండదు.  అలాగే జిల్లావ్యాప్తంగా 50 వేల హెక్టార్లలో మక్కజొన్న సాగవుతుండగా, లక్ష మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి వస్తున్నది. శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసినట్లయితే పాప్‌కార్న్‌, స్వీట్‌కార్న్‌ లాంటివి తయారు చేసి మార్కెట్‌కు తరలించవచ్చు. జిల్లాలోని 12 మండలాల్లో 16,056 మెట్రిక్‌ టన్నుల వేరుశనగను ఉత్పత్తి చేస్తుండగా, సరైన మార్కెటింగ్‌ వ్యవస్థ లేక రైతులు నష్టపోతున్నారు. శుద్ధి కేంద్రాల ఏర్పాటుతో ఈ సమస్య పరిష్కారం కానుంది. దీంతోపాటు రాయలసీమ ప్రాంతంలో పండించే చిన్న పరిమాణంతో కూడిన వేరుశనగను పండించేలా రైతులను ప్రోత్సహిస్తే లాభాలను ఆర్జించే అవకాశాలున్నాయి.

లబ్ధిపొందనున్న రైతులు

కొడంగల్‌, బొంరాస్‌పేట్‌, కులకచర్ల మండలాల్లో 3253 హెక్టార్లలో 6,023 మెట్రిక్‌ టన్నుల చిరుధాన్యాలను ఉత్పత్తి చేస్తున్న రైతులు కూడా లబ్ధిపొందనున్నారు. బంట్వారం మండలంలో చెరుకు పంటను సాగు చేస్తున్న రైతులు ప్రస్తుతం దళారులు ఎంత చెప్తే అంత ధరకే విక్రయిస్తూ నష్టపోతున్నారు. ఆహార శుద్ధి కేంద్రం ఏర్పాటుతో స్థానికంగానే బెల్లాన్ని తయారు చేసి విక్రయించడం ద్వారా లాభాలు పొందవచ్చు. దోమ, కులకచర్ల మండలాల్లో గంపల్లో పెట్టి రైతులు చింతపండును విక్రయిస్తున్నారు. శుద్ధి కేంద్రం ద్వారా చింతపండును ప్యాకింగ్‌ చేసి విక్రయించినట్లయితే మరింత లాభం రానుంది. పరిగి నియోజకవర్గంలోని కులకచర్ల, దోమ మండలాల రైతులు కొందరు పచ్చిమామిడిని సన్నని ముక్కలుగా చేసి నిజామాబాద్‌ వెళ్లి విక్రయిస్తున్నారు. రవాణా చార్జీలతో అంతగా లాభాలు రావడం లేదు. ఆహార శుద్ధి కేంద్రం స్థానికంగానే ఏర్పాటు చేసినట్లయితే పచ్చి మామిడి ముక్కలతో ఆమ్‌చూర్‌ ఇక్కడే తయారు చేసి విక్రయించినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది.


logo