శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - May 21, 2020 , 23:50:02

ఎర్ర నేలల్లో కంది..నల్ల రేగడిలో పత్తి

ఎర్ర నేలల్లో కంది..నల్ల రేగడిలో పత్తి

2.52 లక్షల ఎకరాలు లక్ష్యం

జిల్లాలో మక్కజొన్న పంట పూర్తిగా నిషేధం

మక్కల స్థానంలో పత్తి సాగు చేసేలారైతులకు అవగాహన 

నల్లరేగడి నేలల్లో పత్తి.. ఎర్రనేలల్లో కంది సాగు 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ వానకాలం సీజన్‌లో భారీగా పత్తి పంటను సాగు చేసేందుకు జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశా రు. పత్తి సాగుతోనే రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉన్నందున సాగును పెంచేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ మేరకు రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రం లో పండించే పత్తికి దేశీయంగా మంచి డిమాండ్‌ ఉండ డం, ఎంత విస్తీర్ణంలో సాగు చేసినా స్థానికంగా ఆయా జిల్లాల్లోనే జిన్నింగ్‌ మిల్లుల ద్వారా సీసీఐ కొనుగోలు చేస్తుండడంతో పాటు ప్రభుత్వం మద్దతు ధర అందిస్తుండడంతో జిల్లాలో 30 శాతం మేర సాగును పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో మెజార్టీ శాతం నల్లరేగడి నేలలే ఉండడం కూడా అనుకూలాంశంగా ఉంది. పరిగి, వికారాబాద్‌, తాండూ రు డివిజన్లలో సాగు పెరుగనుంది. తాండూరు డివిజన్‌లో అధికంగా సా గయ్యే కంది పంటతోపాటు పత్తి సాగు కూడా రెండేండ్లుగా పెరుగుతున్నది. ఇక్కడ శనగ, కుసుమ, జొన్న పంటల స్థానం లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. ఈ వానకాలం సీజన్‌లో 58, 189 ఎకరాల్లో పత్తిసాగు పెరుగనుంది. గతేడాది 1,93, 811 ఎకరాలున్న సాగును ఈ సీజన్‌లో 2.52 లక్షల ఎకరాలకు పెం చుతూ వ్యవసాయాధికారులు కార్యాచరణ రూపొందించారు. 

మక్కకు మంగళం...

జిల్లాలో పంటల సాగులో మూడో స్థానంలో మక్కజొన్నను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించింది. గతేడాది పండించిన మక్కలు ఇంకా గోదాంలోనే నిల్వ ఉండడంతో ఈ సారి సాగును పూర్తిగా తగ్గించాలని నిర్ణయించింది. స్థానిక పౌల్ట్రీ పరిశ్రమలు రాష్ట్రంలో పండించే మక్కలను కాకుండా బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి మక్కలను దిగుమతి చేసుకోవడం కూ డా సాగును నిషేధించడానికి ఓ కారణం. ప్రభుత్వం క్వింటా లు మక్కలను రూ.1760లకు అందిస్తుండగా, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలు రూ.1000 నుంచి రూ.1100లకే అందిస్తున్నా యి. మొక్కజొన్న పంటల స్థానంలో పత్తి లేదా పప్పు ధాన్యాల సాగును పెంచనున్నారు. దీంతో మక్కజొన్నకు ప్రత్యామ్నాయం గా ఇతర పంటలను సాగు చేసేలా అధికారులు నూతన సాగు విధానాన్ని సిద్ధం చేశారు. 

మక్కలు యాసంగి సీజన్‌లో ఎకరాకు 25క్వింటాళ్లు, వానకాలం సీజన్‌లో 15 క్వింటాళ్లు వస్తుండటంతో కేవలం యాసంగిలోనే సాగు చేయాలని ప్రభుత్వం సూ చిస్తున్నది. ఎవరైనా సాగు చేసినట్లయితే వారికి మద్దతు ధరతోపాటు రైతుబంధు కూడా వర్తించదని ప్రభుత్వం ఇప్పటికే స్ప ష్టం చేసింది. ప్రైవేట్‌ డీలర్లు కూడా మక్కజొన్న విత్తనాలను విక్రయించకుండా నిఘా పెట్టాలని వ్యవసాయాధికారులను ఆదేశించింది. 

పప్పు ధాన్యాలకు ప్రాధాన్యం...

పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృ ష్ట్యా వానకాలం సీజన్‌లో కంది పంట సాగును పెంచాలని నిర్ణయించారు. ఆ మేరకు పత్తి పంట సాగును 30 శాతం తగ్గించేందుకు నిర్ణయించారు. తాండూరు కందిపప్పు దేశంలోనే పేరొందడంతో కందుల సాగును మరింత పెంచనున్నారు. గతేడాది వానకాలం సీజన్‌లో 1,30,941 ఎకరాల్లో కంది పంట సాగు కాగా, వానకాలం సీజన్‌లో వికారాబాద్‌, పరిగి డివిజన్లలో మరో 30 శాతం పెంచి, 1,73,900 ఎకరాల్లో సాగు చేయాల ని సూచిస్తున్నారు. జిల్లాలోని ఎర్రనేలల్లో పూర్తిగా కందిపంటను సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించనున్నారు. యాలాల, పరిగి, దోమ, కులకచర్ల మండలాల్లోని ఎర్రనేలల్లో రైతులు పత్తి పంటను సాగు చేస్తుండగా, కంది పంటను వేసేలా వారికి అవగాహన కల్పించనున్నారు. నల్లరేగడి నేలలున్న పూ డూరు, వికారాబాద్‌ మండలాల్లో కూడా పత్తి పంటతోపాటు అంతర పంటగా కందులను సాగును చేయాలని సూచిస్తున్నారు.

పత్తి సాగుతో రైతుకు నష్టమేమీ లేదు...

పత్తిపంట సాగుతో రైతులకు ఎలాంటి నష్టముండదు. ఎంత విస్తీర్ణంలో సాగు చేసినా ప్రభుత్వం సీసీఐ ఆధ్వర్యంలో పంటను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ప్రధానంగా దేశీయంగా రాష్ట్రంలో పండించే పంటకు మంచి డిమాండ్‌ ఉండడం కూడా పత్తి సాగు చేసే రైతులకు అనుకూల అంశం. నియంత్రిత సాగు విధానంతో  మేలు జరుగుతుంది.

- సుధాకర్‌, శాస్త్రవేత్త,  వ్యవసాయ పరిశోధన సంస్థ, తాండూరు


logo