ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - May 21, 2020 , 02:00:23

ప్రారంభానికి ‘డబుల్‌' రెడీ

ప్రారంభానికి ‘డబుల్‌' రెడీ

జిల్లాకు 4323 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు

అడవి వెంకటాపూర్‌లో పూర్తయిన 30 ఇండ్లు

 లాక్‌డౌన్‌ తర్వాత ప్రారంభం

నెలరోజుల్లో పూర్తికానున్న కోకట్‌లోని మరో 420 నిర్మాణాలు 

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పేదల సొంతింటి కల త్వరలోనే నెరవేరనుంది. జిల్లాలోని అడవి వెంకటాపూర్‌లో 30 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తికాగా, యాలాల మండలంలోని కోకట్‌లో నెలరోజుల్లో పూర్తి కానున్నాయి. లాక్‌డౌన్‌ పూర్తైన వెంటనే కులకచర్ల మండలం అడవి వెంకటాపూర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించనున్నారు. లాక్‌డౌన్‌తో నిర్మాణం ఆలస్యమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రభుత్వం జిల్లాకు 4323 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేయగా, ఇప్పటివరకు 1086 ఇండ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలోని కోకట్‌, పరిగి నియోజకవర్గంలోని ఇప్పాయిపల్లిలో మరో నెలరోజుల్లో పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 2714 ఇండ్ల నిర్మాణానికిగాను టెండర్లను ఆహ్వానించగా, మరో 856 ఇండ్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది.

తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాలకు వెయ్యికిపైగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరయ్యాయి. తాండూరు నియోజకవర్గానికి అత్యధికంగా 1761 ఇండ్లను మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతానికి 760, పట్టణ ప్రాంతానికి 1001 ఇండ్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 600 నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మరో 40 ఇండ్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వికారాబాద్‌ నియోజకవర్గంలో 1001 మంజూరు కాగా గ్రామీణ ప్రాంతానికి 600, పట్టణ ప్రాంతానికి 401 కేటాయించారు. ఇప్పటివరకు 156 ఇండ్ల నిర్మాణం ప్రారంభమైంది. మరో 20 ఇండ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. పరిగి నియోజకవర్గంలో 740 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 260 ఇండ్లకు టెండర్లను ఆహ్వానించగా, 40 ఇండ్లకు టెండర్లు పూర్తయ్యాయి. మరో 30 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. కొడంగల్‌ నియోజకవర్గానికి 593 మంజూరుకాగా ఇప్పటివరకు 300 ఇండ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తికాగా పనులు ప్రారంభమయ్యాయి. చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్‌ మండలానికి 228 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు కాగా 60 ఇండ్లకు టెండర్లను ఆహ్వానించారు. 

సొంత జాగా ఉంటే డబ్బులివ్వనున్న ప్రభుత్వం...

జిల్లాలో సొంత స్థలం ఉన్నవారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సొంత జాగా ఉన్నట్లయితే ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే అందించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. చాలా మండల కేంద్రాల్లో, గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి స్థలాలు లేకపోవడంతో ప్రభుత్వం స్థలం ఉంటే ఆర్థిక సహాయాన్ని అందించనుంది. అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయనుంది.

గత బడ్జెట్‌లోనూ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. మండల కేంద్రాల్లో జీ ప్లస్‌ 2 ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కూడా టెండర్లను ఆహ్వానించడంతోపాటు పలు మండల కేంద్రాల్లో పనులు ప్రారంభమయ్యాయి. మండల కేంద్రాల్లో నిర్మాణానికిగాను టెండర్లను కూడా ఆహ్వానించారు. ప్రభుత్వం అందించే యూనిట్‌ ధరకు కాంట్రాక్టర్లకు లాభం చేకూరే అవకాశం ఉన్నందున కాంట్రాక్టర్లు పోటీ పడే అవకాశాలున్నాయి. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికిగాను అయ్యే ఖర్చును ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్‌ ఖర్చు రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. యూనిట్‌ కాస్ట్‌తోపాటు మౌలిక వసతుల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలను, అర్బన్‌ ప్రాంతంలో రూ.75 వేలను డ్రైనేజీ, నీటి వసతి తదితర మౌలిక వసతులకుగాను ప్రభుత్వం అందజేయనుంది.logo