గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - May 19, 2020 , 01:23:38

రూ.230 కోట్ల ఆస్తి పన్ను వసూలు

రూ.230 కోట్ల ఆస్తి పన్ను వసూలు

ఈ నెల 31లోపు చెల్లించిన వారికి ఐదుశాతం రిబేట్‌     

ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ ఇషాక్‌ అబ్కాన్‌

ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ : కరోనా సమయంలోనూ మున్సిపాలిటీల్లో ఆస్తిపన్నుల వసూళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  జిల్లాలోని 12 మున్సిపాలిటీలో మూడు కార్పొరేషన్లల్లో ప్రతిఏటా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఆస్తిపన్ను వసూళ్లు చేపడుతారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా రెండు మూడు నెలల నుంచి ఆస్తిపన్ను వసూళ్లు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా డిమాండ్‌కు అనుగుణంగా వసూళ్లు జరుగుతున్నాయి. ఒక్క ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోనే 350కోట్ల ఆస్తిపన్ను వసూళ్లు కావల్సి ఉండగా, ఇప్పటివరకు 230కోట్లు వసూళ్లయ్యాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో అనేక వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఇతరత్రా వాటినుంచి పెద్దఎత్తున ఆస్తిపన్ను వసూళ్లవుతుంది. ఈనెలాఖరులోపు నిర్దేశించిన టార్గెట్‌ను చేరుకుంటామని మున్సిపల్‌ కమిషనర్‌ ఇషాక్‌ అబ్కాన్‌ తెలిపారు. కరోనా ఉన్నప్పటికీ పన్ను చెల్లించడానికి పెద్దఎత్తున ముందుకొస్తున్నారు. ఆశించిన రీతిలో పన్నులు వసూళ్లవుతుండటం వల్ల అంతేస్థాయిలో అభివృద్ధి కూడా జరుగనుందని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. 

  నెలాఖరులోపు చెల్లిస్తే ఐదుశాతం మినహాయింపు

మున్సిపాలిటీలో ఆస్తిపన్ను చెల్లించేవారు ఈనెలాఖరులోపు తాము ఆస్తిపన్ను చెల్లిస్తే ఐదుశాతం రిబేట్‌ ఇవ్వనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఇషాక్‌ అబ్కాన్‌ తెలిపారు. ఆస్తిపన్ను చెల్లించేవారు ముందుకు వచ్చి ఈనెలాఖరులోపు చెల్లించేవారందరికీ ఇది వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ఆస్తిపన్ను చెల్లించేవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.logo