శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - May 19, 2020 , 01:18:06

పప్పు ధాన్యాల సాగు పెంచండి

పప్పు ధాన్యాల సాగు పెంచండి

మొక్కజొన్న వద్దు.. వరి సన్నరకం వేయాలి

విత్తనాలను ప్రైవేట్‌ డీలర్స్‌ విక్రయించకుండా చర్యలు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో పప్పు ధాన్యాల పంటల సాగును పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. వ్యవసాయ విధానంపై జిల్లా కలెక్టర్లు, వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితి సభ్యులతో సోమవారం ప్రగతిభవన్‌ నుంచి వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో వీలైనంత అధిక మొత్తంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా కందులు, పెసర్లు, మినుముల సాగును పెంచాలని చెప్పారు. గతేడాది వానకాలం సీజన్‌లో కంది పంటను 1,30,941 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ సంవత్సరం 1,73,900 ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు. పెసర సాగు గతేడాది 17,548 ఎకరాల్లో వేయగా, ఈ ఏడాది 20,800 ఎకరాలకు పెంచాలని.. మినుము సాగు గతేడాది 8001 ఎకరాలుండగా, ఈ ఏడాది వానకాలం సీజన్‌లో 9500 ఎకరాలకు పెంచాలని సీఎం ఆదేశించారు. 

  పత్తి సాగును భారీగా పెంచాలని సూచించారు. గతేడాది 1,93,811 ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. ఈ సంవత్సరం 2.52 లక్షల ఎకరాలకు పెంచే విధంగా రైతులను ప్రోత్సహించాలని జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది వానకాలం సీజన్‌లో మొక్కజొన్న సాగును పూర్తిగా తగ్గించాలని, దానికి బదులు పప్పుధాన్యాలను సాగు చేయాలని సూచించారు. యాసంగి సీజన్‌లో మాత్రమే మొక్కజొన్న సాగు చేయాలన్నారు. వానకాలం సీజన్‌లో మొక్కజొన్న దిగుబడి ఎకరాకు 15 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని, యాసంగిలో 25 క్వింటాళ్ల వరకు వస్తుందని చెప్పారు. వానకాలం మొక్కజొన్నకు మద్దతు ధర ఉండదని సీఎం తెలిపారు. మొక్కజొన్న విత్తనాలను ప్రైవేట్‌ డీలర్లు విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులకు సూచించారు. వరిలో సన్న రకాల సాగు పెంచాలన్నారు. గతేడాది జిల్లాలో 60 శాతం సన్నరకం సాగు చేయగా, ఈ వానకాలంలో 70 శాతానికి పెంచాలన్నారు. జిల్లాలో గతేడాది 30 వేల ఎకరాల్లో సాగైన వరి పంటను ఈ వానకాలం సీజన్‌లో 35 వేల ఎకరాలకు పెంచనున్నారు. జిల్లాలోని 99 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణానికి స్థలాలను గుర్తించి ఆరు మాసాల్లోగా పూర్తి చేయాలని జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు. logo