మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - May 15, 2020 , 00:40:36

కరోనా ఖతం..

కరోనా ఖతం..

  • కొవిడ్‌ -19 ఫ్రీ జిల్లాగా వికారాబాద్‌
  • మొత్తం 38 కేసుల్లో ఒకరు మృతి
  • 37మంది కోలుకుని డిశ్చార్జ్‌ 
  • గతనెల 19న చివరి పాజిటివ్‌ కేసు 
  • పకడ్బందీ లాక్‌డౌన్‌తో వైరస్‌  కట్టడి
  • కంటైన్‌మెంట్‌ జోన్లపై ప్రత్యేక నిఘా
  • త్వరలో గ్రీన్‌జోన్‌లోకి జిల్లా

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో కరోనా ఖతం అయ్యింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారందరూ కోలుకున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన 65ఏండ్ల వృద్ధుడు మృతి చెంది న సంఘటన మినహా మిగతా వారంతా నెలరోజుల్లో కోలుకొని  ఇంటికి చేరుకున్నారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారితోనే జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు బయట పడింది. మొత్తం 38మందికి పాజిటివ్‌ రాగా జిల్లాకేంద్రంలో 31కేసులు, తాండూరులో 4, పరిగిలో 2, మర్పల్లి మండల కేంద్రంలో ఒక కేసు నమోదైంది. వీరిలో జిల్లా కేంద్రానికి చెందిన ఒకరు మృతి చెందగా, మిగతా 37 మంది కరోనా నుంచి కోలుకొని గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. చివరగా గురువారం జిల్లా కేంద్రానికి చెందిన 45 ఏండ్ల వ్యక్తికి నెగెటివ్‌ నిర్ధారణ కావడంతో గాంధీ ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. దీంతో రెడ్‌జోన్‌లో ఉన్న జిల్లాను గ్రీన్‌జోన్‌లోకి మార్చేందుకుగాను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిపాదనలు పంపింది. జిల్లాలో నెల రోజులుగా ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడంతో గ్రీన్‌జోన్‌లోకి మార్చేందుకు ప్రతిపాదించారు. ఒకట్రెండు రోజుల్లో జిల్లా గ్రీన్‌జోన్‌లోకి మారనుంది. వైరస్‌ నియంత్రణకు ప్రజాప్రతి నిధులు, అధికారులు తీవ్రంగా శ్రమించారు. లాక్‌డౌన్‌ అమలు తీరును కలెక్టర్‌ పౌసుమి బసు, ఎస్పీ నారాయణ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. మంత్రి సబితా రెడ్డి కరోనా కట్టడి చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా పాజిటివ్‌, ప్రైమరీ కాంటాక్ట్స్‌, సెకండరీ కాంటాక్ట్స్‌ కలిపి మొత్తం 659 రక్త నమూనాలను సేకరించి పంపగా, 623 మందికి నెగెటివ్‌ వచ్చింది. 

గత నెల 4న మొదటి పాజిటివ్‌ కేసు...

జిల్లా నుంచి మర్కజ్‌ వెళ్లొచ్చిన వారి జాబితా ఆధారంగా ఒక్కొక్కరి శాంపిల్స్‌ సేకరించి పంపగా ఏప్రిల్‌ 4న జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ నగర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి తొలి కరో నా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ 4 నుంచి 19 వరకు వరుసగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ వెళ్లొచ్చిన వారు నిర్లక్ష్యంగా అధికారులకు సమాచారమివ్వకపోగా పలువురిని కలవడంతో ప్రైమరీ, సెకండరీ కాంటా క్ట్స్‌ కలిపి మొత్తం 38 మందికి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 20మంది మర్కజ్‌కు వెళ్లగా వీరిలో 8 మందికి (వికారాబాద్‌-3, తాండూర్‌-2, పరిగి-2, మర్పల్లి-1) మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. వీరి నుంచి మరో 30మందికి సోకింది. పరిగి, మర్పల్లిలో పాజిటివ్‌ వచ్చిన వారితో ఎవరికీ సోకలేదు. తాండూరు పట్టణంలో ఇద్దరి నుంచి మరో ఇద్దరికి, జిల్లాకేంద్రంలో ముగ్గురు నుంచి 28మందికి వ్యాప్తి చెందింది. జిల్లాకేంద్రంలోని ఓ మత ప్రచార కార్యాలయ నిర్వాహకుడు ఒక్కడితోనే 25మందికి సోకింది. జిల్లాకేంద్రంలో 31 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా రిక్షా కాలనీలో 19, వెంకటేశ్వర కాలనీలో 6, బీటీఎస్‌ కాలనీలో 4, మధు కాలనీలో 2 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత నెల 15వ తేదీ నుంచి 19 వరకు వరుసగా రిక్షా కాలనీలో 19మందికి పాజిటివ్‌ రాగా, 19వ తేదీన చివరి కేసు నమోదైంది. ఢిల్లీ నుంచి వచ్చి రిక్షా కాలనీలోని ఓ ప్రార్థనా మందిరంలో ఉన్న 13మందిలో 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. అనంతరం క్రమంగా బాధితులు కోలుకొని రోజుకు ఒకరిద్దరు చొప్పున డిశ్చార్జ్‌ అయ్యారు. తొలుత తాండూరుకు చెందిన బాధితుడు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యాడు. 

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు..

జిల్లాలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేశారు. ఏ ఒక్కరిని బయటకు రానివ్వకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. అత్యవసరమైతే తప్ప ఎవరైనా బయటకు వస్తే కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలు విధించారు. వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్‌, తాండూరు, పరిగి పట్టణాలతోపాటు మర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 8 కంటైన్‌మెంట్‌ జోన్లలో పక్కా నిఘా పెట్టిన జిల్లా పోలీసు అధికారులు ఆయా కాలనీల్లో డ్రోన్‌ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. సీ జోన్లలో ప్రజలు బయటకు రాకుండా కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువులను ఇంటి వద్దకే సరఫరా చేశారు. కంటైన్‌మెంట్‌ జోన్లను పూర్తిగా దిగ్బంధం చేశారు. చెక్‌పోస్టుల వద్ద పోలీసు, రెవెన్యూ, వైద్య, అటవీ శాఖ సిబ్బందితో గట్టి నిఘా పెట్టారు. కర్ణాటక సరిహద్దు నుంచి ఏ ఒక్కరూ జిల్లాలో ప్రవేశించకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

అందరి సహకారంతోనే కట్టడి

ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతోనే జిల్లాలో కరోనాను కట్టడి చేయగలిగాం. జిల్లాలో పాజిటివ్‌ నిర్ధారణ అయిన ప్రాంతాలను బారికేడ్లతో కట్టడి చేశాం. కంటైన్‌మెంట్‌ జోన్లలోని ప్రజలంతా సంయమనంతో ఇండ్ల నుంచి బయటకు రాకుండా సహకరించారు. చెక్‌పోస్టుల వద్ద కూడా గట్టి నిఘా పెట్టి జిల్లాకు ఇతరులెవరూ రాకుండా చర్యలు తీసుకున్నాం. అదే విధంగా జిల్లాకు వచ్చిన వలస కార్మికులందరినీ హోంక్వారంటైన్‌ చేశాం. వారందరిపైనా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాం.

- ఎస్పీ ఎం. నారాయణ


logo