గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - May 11, 2020 , 01:37:21

పది నిమిషాల పని.. ఆరోగ్యానికి ఉండదు హాని..

పది నిమిషాల పని.. ఆరోగ్యానికి ఉండదు హాని..

  • మంత్రి కేటీఆర్‌ పిలుపుతో కదిలిన ప్రజాప్రతినిధులు
  • దోమల నివారణ చర్యలు చేపట్టిన నాయకులు

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చిన ‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు స్పందించారు. తమ ఇండ్లతోపాటు పరిసరాల్లో దోమల నివారణ చర్యలు చేపట్టారు. పూలకుండీలు, డబ్బాలు, డ్రమ్ముల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి, వాటిని శుభ్రం చేశారు. కొడంగల్‌లోని ఓ పంక్చర్‌ దుకాణం వద్ద తొట్టిలో నిల్వ ఉన్న నీటిని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పారబోశారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో పూలకుండీలను శుభ్రం చేశారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ తన ఇంటి పరిసరాల్లో చెత్తను తొలగించి యాంటీ లార్వా మందులు చల్లారు. వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న పరిమళ్‌ తమ నివాసాల్లో చెత్తను తొలగించారు. నిల్వ ఉన్న నీటిని పారబోశారు. పరిగి మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ అశోక్‌, కమిషనర్‌ తేజిరెడ్డి నీరు నిల్వ ఉన్న పాత్రలను శుభ్రం చేయడంతోపాటు పాత సామగ్రిని చెత్త సేకరణ వాహనంలో వేశారు. ప్రజలందరూ ప్రతి ఆదివారం ఇంటి శుభ్రతకు పది నిమిషాలు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు సూచించారు. 

-వికారాబాద్‌ నెట్‌వర్క్‌


logo