ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - May 10, 2020 , 01:12:12

రిజిస్ట్రేషన్లు షురూ

రిజిస్ట్రేషన్లు షురూ

  • ప్రారంభమైన భూములు,వాహనాల రిజిస్ట్రేషన్లు
  • మూడు రోజుల్లో జిల్లాలో60 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు
  • సుమారు రూ. 6 లక్షల ఆదాయం
  • 50 వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా..
  • ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికే..
  • మాస్కు ధరించడం.. భౌతిక దూరం పాటించడం తప్పనిసరి 
  • కార్యాలయాల వద్ద ఏర్పాట్లు చేసిన అధికారులు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో లాక్‌డౌన్‌ సడలింపు సందడి మొదలైంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలకు, నిర్మాణ రంగానికి సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం, ఒక్కొక్క రంగంలో ఆంక్షలను ఎత్తివేస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే భూములు, వాహనాల రిజిస్ట్రేషన్లకు కూడా సడలింపులివ్వడంతో రెండు,మూడు రోజులుగా జిల్లాలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి జిల్లాలోని నాలుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మొదటి రోజు ఒకట్రెండు రిజిస్ట్రేషన్లు అయినప్పటికీ తదనంతరం పుంజుకున్నది. ప్రధానంగా ఇళ్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల్లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు మరింత పుంజుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే గత 40 రోజులకుపైగా అన్ని రంగాలు స్తంభించడంతో ఇప్పటికిప్పుడు భూముల రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేదు. మూడు రోజుల్లో జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌, పరిగి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 60 డాక్యుమెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాగా రూ.6 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వికారాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 13 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కాగా రూ.3.77 లక్షలు ఆదాయం చేకూరింది. పరిగి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 10 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ప్రధానంగా గ్రామాల్లోని ఇంటి స్థలాలకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. వీటి ద్వారా సుమారు రూ.45 వేల వరకు ఆదాయం వచ్చింది. తాండూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వ్యవసాయ భూములకు సంబంధించి 10 రిజిస్ట్రేషన్లు కాగా రూ.లక్ష ఆదాయం వచ్చినట్లు సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయం అధికారి జబ్బార్‌ తెలిపారు. కొడంగల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మూడు రోజుల్లో 27 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ పూర్తికాగా, రూ.1.41 లక్షల ఆదాయం ప్రభుత్వ ఖజనాకు సమకూరింది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద ప్రతీ ఒక్కరూ భౌతికదూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 

నో మాస్క్‌- నో ఎంట్రీ...

లాక్‌డౌన్‌ సడలింపుతో ఆర్టీఏ కార్యాలయాల్లో ఈనెల 7వ తేదీ నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల్లో వాహనాల రిజిస్ట్రేషన్లతోపాటు ఆర్టీసీ బస్సుల ఫిట్‌నెస్‌ ప్రక్రియ చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. వికారాబాద్‌, పరిగి, తాండూరు ఆర్టీఏ కార్యాలయాల్లో 50-60 వాహనాల రిజిస్ట్రేషన్లు అయినట్లు అధికారులు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో వాహనాల రిజిస్ట్రేషన్లు పుంజుకునే అవకాశాలున్నాయన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్‌తోపాటు లైసెన్స్‌ కోసం వచ్చేవారు ఆన్‌లైన్‌లోనే స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. నో మాస్క్‌-నో ఎంట్రీని జిల్లాలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో అమలు చేస్తున్నారు. వాహనదారులు కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. 

మాస్కు ఉంటేనే అనుమతి..

  • డీవీ రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి 

కరోనా వైరస్‌ దృష్ట్యా వికారాబాద్‌, తాండూరు, పరిగి రవాణా శాఖ కార్యాలయాల్లో నో మాస్క్‌-నో ఎంట్రీని అమలు చేస్తున్నాం. ప్రతీ ఒక్కరూ భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశాం. లాక్‌డౌన్‌ సడలింపు ఇచ్చినందున మరో రెండు, మూడు రోజుల్లో వాహనాల రిజిస్ట్రేషన్లతోపాటు మిగతా సేవల కోసం వచ్చే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. logo