గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - May 09, 2020 , 01:49:49

స్వగ్రామాలకు తరలివస్తున్న వలస కూలీలు

స్వగ్రామాలకు తరలివస్తున్న వలస కూలీలు

కులకచర్ల : ఫుణె, ముంబయి నగరాల నుంచి కులకచర్ల మండలానికి అధిక సంఖ్యలో వలస కూలీలు చేరుకుంటున్నారు. మహారాష్ట్రలో వైరస్‌ విజృంభిస్తుండటంతో స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. మూడు రోజుల్లో సుమారు 850మంది బస్సులు, వివిధ వాహనాల ద్వారా తండాలు, గ్రామాలకు చేరుకోగా, వారందరినీ అధికారులు 28 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. వలస కూలీలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి సమాచారాన్ని తెలియజేయాలని మండల వైద్యాధికారి డాక్టర్‌ మురళీకృష్ణ, తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ వెంకటేశ్‌, సీహెచ్‌వో చంద్రప్రకాశ్‌ కోరారు. 

191 మంది హోం క్వారంటైన్‌

బొంరాస్‌పేట : మండల పరిధిలో ఈ నెల 1వ తేదీ నుంచి నుంచి ఇప్పటివరకు 191 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచామని శుక్రవారం మండల వైద్యాధికారి రవీంద్రయాదవ్‌ తెలిపారు. వీరంతా ముంబయి, ఫుణె నుంచి స్వస్థలాలకు తిరిగి వచ్చారన్నారు. వలస కూలీలు ఎవరూ బయట తిరుగొద్దని సూచించారు. శని, ఆదివారాల్లో మరికొంతమంది కూలీలు రానున్నారని, వారిని కూడా క్వారంటైన్‌ చేస్తామన్నారు.

వివరాలు నమోదు చేయించుకోవాలి 

పరిగి, నమస్తే తెలంగాణ : ఇతర రాష్ర్టాల నుంచి గ్రామాలకు వస్తున్న ఈ ప్రాంతానికి చెందిన వలస కూలీలు, ఇతరులు తమ వివరాలను గ్రామ పంచాయతీలు, వైద్య,ఆరోగ్య కేంద్రంలో నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ వారి సూచనల మేరకు అందరూ హోం క్వారంటైన్‌లో ఉండి, వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. 


logo