శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - May 09, 2020 , 01:49:48

గ్రీన్‌జోన్‌లోకి జిల్లా..

గ్రీన్‌జోన్‌లోకి జిల్లా..

  • కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర సర్కారు
  • ‘గాంధీ’ నుంచి మరో ఇద్దరు డిశ్చార్జ్‌

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రెడ్‌జోన్‌లో ఉన్న జిల్లాను గ్రీన్‌జోన్‌లోకి మార్చాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మరో రెండు,మూడు రోజుల్లో గ్రీన్‌జోన్‌లోకి మార్చుతూ కేంద్రం నుంచి ఉత్తర్వులు రానున్నాయి. జిల్లాలో గత 20 రోజులుగా ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడంతో నేరుగా గ్రీన్‌జోన్‌లోకి మార్చేందుకు ప్రతిపాదించారు. జిల్లాలో కిందటి నెల 19న చివరిగా కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. కరోనా బాధితులు కోలుకొని రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున డిశ్చార్జ్‌ అవుతున్నారు. ఇప్పటివరకు 31మంది గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే చికిత్స పొందుతున్నారు. వీరు కూడా ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ కానుండడంతో ప్రభుత్వం జిల్లాను గ్రీన్‌జోన్‌లోకి మార్చాలని నిర్ణయించింది. వైరస్‌ నుంచి కోలుకొని శుక్రవారం జిల్లాకు చెందిన మరో ఇద్దరు గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి ఒకరు, శుక్రవారం మరొకరు డిశ్చార్జయ్యారు. వీరిద్దరు జిల్లాకేంద్రంలోని రిక్షా కాలనీకి చెందిన వారని అధికారులు వెల్లడించారు. మొత్తం 38 పాజిటివ్‌ కేసుల్లో ఒకరు మృతి చెందగా, 31 మంది కోలుకోవడంతో జిల్లాలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 6కు తగ్గింది. జిల్లా కేంద్రంలో 31 పాజిటివ్‌ కేసులు, తాండూరులో 4, పరిగిలో 2, మర్పల్లి మండల కేంద్రంలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. పాజిటివ్‌ నిర్ధారణ అయినవారితోపాటు ప్రైమరీ కాంటాక్ట్స్‌, సెకండరీ కాంటాక్ట్స్‌ కలిపి మొత్తం 659 మంది రక్త నమూనాలను సేకరించి పంపగా, 623మందికి నెగెటివ్‌, 38 మందికి పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలో ప్రస్తుతం సాధారణ గృహ నిర్బంధంలో 15,657 మంది ఉండగా, శుక్రవారం 1364 మంది ముంబయి, థానే, ఫుణె ప్రాంతాల నుంచి వలస కార్మికులు కులకచర్ల, దోమ మండలాలకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 28 రోజుల గృహ నిర్బంధాన్ని 10,458 మంది పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు.


logo