ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - May 09, 2020 , 00:52:55

రూ.25 వేల లోపు రుణాలు ఒకే దఫాలో..

రూ.25 వేల లోపు రుణాలు ఒకే దఫాలో..

  • జిల్లాలో రూ. 42.32 కోట్ల పంట రుణాలు మాఫీ
  • రూ. లక్షలోపున్నవి మూడు విడుతల్లో..
  • 38,311మంది రైతులకు లబ్ధి

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీని నేరవేరుస్తున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ పంట రుణమాఫీ నిధులు విడుదల చేసి రైతుబాంధవుడిగా నిలిచారు. రూ.లక్షలోపు పంట రుణాలను నాలుగు దఫాలుగా మాఫీ చేసేందుకు నిర్ణయించిన ప్రభుత్వం గురువారం మొదటి దఫాగా రూ.25 వేలలోపు రుణాలను మాఫీ చేసింది. ఈ మేరకు రూ.1,210 కోట్లను ఆర్థిక శాఖకు విడుదల చేసింది. సంబంధిత రుణమాఫీ సొమ్ము నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు, మూడు రోజుల్లో జమ కానుంది. ఎమ్మెల్యేల ద్వారా రుణమాఫీ చెక్కులను అందించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించినప్పటికీ కరోనా దృష్ట్యా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడుతగా ఒకేదఫాలో రూ.25 వేలలోపు రుణాలను మాఫీ చేయడంపై జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. రుణమాఫీయే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నది.

జిల్లాలో 19,332 మంది రైతులకు లబ్ధి...

జిల్లాలో 25 వేలలోపు ఉన్న రూ.42.32 కోట్ల రుణాలకు సంబంధించిన వివరాలు బ్యాంకుల వద్ద సిద్ధంగా ఉన్నాయి. 19,332మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. బ్యాంకుల్లో మాఫీ డబ్బులు జమ అయిన వెంటనే బ్యాంకర్లు రైతులకు రుణమాఫీ ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నారు. తొలుత ఒకే దఫాలో రూ.25 వేలలోపు రుణాలను మాఫీ చేస్తున్న ప్రభుత్వం, తదనంతరం మూడు విడుతల్లో మిగతా రుణాలను మాఫీ చేయనున్నది. రూ.లక్షలోపు పంట రుణాల మాఫీతో జిల్లాలోని 38,311 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. రూ.లక్షలోపు రుణాలు సుమారుగా రూ.312 కోట్లు ఉన్నట్లు జిల్లా లీడ్‌ బ్యాంకు అధికారులు వెల్లడించారు. మొదటి దఫా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జిల్లావ్యాప్తంగా రూ.705 కోట్ల రుణాలను మాఫీ చేసింది. నాలుగేళ్లలో చేయాల్సిన మాఫీని మూడేళ్లలో పూర్తి చేసి రైతు ప్రభుత్వంగా నిలిచింది. తొలి విడుతలో జిల్లాలోని 1,42,336 మంది రైతులు ప్రయోజనం పొందారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనతో అనేక భూసమస్యలు పరిష్కారం అయ్యాయి. 

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం..

బొంరాస్‌పేట : రూ.25 వేలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తూ నిధులు విడుదల చేసినందుకు బొంరాస్‌పేట మండలం అల్లికాన్‌పల్లిలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు క్షీరాభిషేకం చేశారు. రూ.లక్ష రుణం తీసుకున్న రైతులకు కూడా విడుతల వారీగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ నర్సమ్మ, ఎంపీటీసీ ఎల్లప్ప, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, మహిళా విభాగం అధ్యక్షురాలు కవిత తదితరులు పాల్గొన్నారు.

మరింత ఉత్సాహంగా వ్యవసాయం చేస్తం...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌ రైతులకు మాట ఇచ్చినట్టే ముందుగా రూ. 25వేల అప్పులను మాఫీ చేస్తున్నడు. చాలా సంతోషంగా ఉంది. మాలాంటి తక్కువ భూమి ఉండి, అప్పు తీసుకున్నోళ్లకు ఎంతో మేలు జరుగుతది. క్రాప్‌లోన్‌ మాఫీ అయితున్నది.. ఇక మరింత ఉత్సాహంగా వ్యవసాయం చేసుకుంటం.

-కొత్త బలిజ వేణు, రైతు, పీరంపల్లి

సీఎం సార్‌కు రుణపడి ఉంటం...

కష్టాల్లో రుణమాఫీ చేసి సీఎం కేసీఆర్‌ రైతుల పాలిట దేవుడిలా నిలిచిండు. రైతులమంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటం. గతంలో తీసుకున్న అప్పులు తీర్చాలంటే నానా ఇబ్బందులు పడేటోళ్లం. పంటలు సక్రమంగా పండేవి కావు. నేడు ప్రభుత్వం రుణాలు మాఫీ చేయడంతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నది. నా అప్పును మాఫీ చేసినందుకు సీఎం సార్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 

-పోలెపల్లి రాములు, రైతు, పీరంపల్లి, కులకచర్ల 

బ్యాంకర్ల వద్ద జాబితా సిద్ధం...

రూ.25 వేల రుణాల మాఫీకి సంబంధించి జిల్లాలోని ఆయా బ్యాంకుల వద్ద జాబితా సిద్ధంగా ఉంది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే మాఫీ సొమ్ము జమ కానుంది. ఆ వెంటనే బ్యాంకర్లు రైతులకు కొత్త రుణాలను ఇచ్చే ప్రక్రియను చేపడుతారు. 

- సుమలతారెడ్డి, జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ 


logo