శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - May 04, 2020 , 01:01:54

ఇడిసి పెడితే.. నడిసి పోతం!

ఇడిసి పెడితే.. నడిసి పోతం!

  • తాండూరు నుంచి బీహార్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలకు వెళ్లేందుకు సిద్ధమైన  వలస కూలీలు
  • సర్దిచెప్పినా వినకపోవడంతో పంపేందుకు అధికారుల సన్నాహాలు

తాండూరు, నమస్తే తెలంగాణ : తాండూరు ప్రాంతంలోని సిమెంట్‌ ఫ్యాక్టరీలు, పాలీషింగ్‌ యూనిట్లలో పనిచేసే వలస కార్మికులు స్వస్థలాలకు పయనమయ్యారు. ఇప్పటికే కొందరు సొంత, అద్దె వాహనాల్లో తరలివెళ్లగా, ఆర్థిక పరిస్థితి బాగోలేని జార్ఖండ్‌, బీహార్‌ రాష్ర్టాలకు చెందిన 300మంది ఆదివారం కాలినడకన వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న అడిషనల్‌ ఎస్పీ రషీద్‌, డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఆర్డీవో వేణుమాధవరావు, తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు వారిని తాండూరు పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌కు తరలించారు. ఇక్కడే ఉంటే అన్ని వసతులు కల్పిస్తామని, లాక్‌డౌన్‌ తర్వాత వెళ్లవచ్చని సూచించారు. వారు వినకపోవడంతో స్వగ్రామాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 

220 కిలోమీటర్లు కాలినడకన..

కొడంగల్‌, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపు ఇవ్వడంతో వలస కూలీలు స్వస్థలాలకు ప్రయాణమయ్యారు. వనపర్తి జిల్లా పామిరెడ్డిపల్లి తూర్పుతండా, పాలమూరు జిల్లా పెద్దమందడి ప్రాంతానికి చెందిన లక్ష్మణ్‌నాయక్‌, బిచ్చునాయక్‌ కుటుంబ సభ్యులు  జహీరాబాద్‌కు వలస వెళ్లారు. కరోనా నేపథ్యంలో రవాణా సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సమేతంగా కాలినడకన బయలుదేరి శనివారం రాత్రి కొడంగల్‌ పట్టణ అంబేద్కర్‌ కూడలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ వారిని పలుకరించగా 40 రోజులుగా పనులు లేక, తిండి దొరకక ఆకలి బాధలు పడ్డామని వాపోయారు. మూడు రోజుల కింద జహీరాబాద్‌ నుంచి బయలుదేరామని, దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణం చేశామని చెప్పారు. స్వగ్రామానికి చేరుకునేందుకు మరో 120 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉందన్నారు. కొడంగల్‌ 2వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ మధుసూదన్‌యాదవ్‌ వారికి బ్రెడ్‌ పంపిణీ చేశారు. తమకు దారిలో భోజనాలు ఏర్పాటు చేసిన వారికి కూలీలు ధన్యవాదాలు తెలిపారు.


logo