బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - May 04, 2020 , 01:01:55

పరిశ్రమలకు ఊరట..!

పరిశ్రమలకు ఊరట..!

  • పలు కంపెనీల పునఃప్రారంభానికి సర్కారు అనుమతులు
  • ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌
  • తాండూరులో తెరుచుకున్నసిమెంట్‌ పరిశ్రమలు
  • ఒకట్రెండు రోజుల్లో నాపరాయి పరిశ్రమలు కూడా..
  • లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయామంటున్న యజమానులు
  • సడలింపుపై సర్వత్రా హర్షం

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలతోపాటు పారిశ్రామిక వాడల్లోని కంపెనీలు పనులు చేసుకునేందుకు జిల్లా ఉన్నతాధికారులు అనుమతినిచ్చారు. ఈ మేరకు శనివారం పునఃప్రారంభించేందుకు కలెక్టర్‌ పౌసుమి బసు ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్‌లో భాగంగా ప్రభుత్వం కొన్ని రంగాలకు సడలింపు ఇవ్వడంతో జిల్లాలోని పలు పరిశ్రమలు తిరిగి తెరుచుకున్నాయి. సిమెంట్‌ పరిశ్రమలతోపాటు ఐరన్‌, స్టీల్‌ కంపెనీలు, సున్నపురాయి, సాధారణ ఇంజినీరింగ్‌ తదితర పరిశ్రమలకు అనుమతులిచ్చారు. వికారాబాద్‌ మున్సిపాలిటీ శివారెడ్డిపేట్‌లోని ఇండస్ట్రియల్‌ పార్కులోని పరిశ్రమలకు కూడా అనుమతిచ్చారు. ఈ క్రమంలో వలస కార్మికులు సొంత రాష్ర్టాలకు వెళ్లిపోయినప్పటికీ స్థానికంగా ఉన్నవారికి యాజమాన్యాలు ఉపాధి కల్పించనున్నాయి. తాండూరు మండలంలోని సీసీఐ సిమెంట్‌ పరిశ్రమతోపాటు ఇండియా సిమెంట్‌, పెన్నా సిమెంట్‌ పరిశ్రమల్లో తిరిగి ఉత్పత్తి ప్రారంభం కానున్నది. సీసీఐ, పెన్నా పరిశ్రమలు శనివారం తెరుచుకున్నాయి. ఐరన్‌, స్టీల్‌ పరిశ్రమలకు సంబంధించి పరిగి మండలంలోని సుగుణ మెటల్స్‌తోపాటు సావిత్రి స్టీల్‌ పరిశ్రమలకు, పెద్దేముల్‌ మండలంలోని పెట్రోకెమ్‌ ఇండస్ట్రీ, ఏజీఆర్‌పీకేఎమ్‌ ఇండస్ట్రీ, వసుధ మినరల్స్‌, ఆసియా బ్రౌన్‌ బ్లీన్‌ ఇండస్ట్రీ, వికారాబాద్‌ శివారెడ్డిపేట్‌ పారిశ్రామిక వాడలోని రాఘవేంద్ర పుల్వరైజర్స్‌, బీఎంసీ ఇండస్ట్రీల్లో పనులు ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా దాదాపు 350మందికి ఉపాధి లభిస్తుందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. జిల్లాకు ప్రధాన ఆదాయంగా ఉన్న నాపరాతి పరిశ్రమలు కూడా ఒకట్రెండు రోజుల్లో తెరుచుకోనున్నాయి. నాపరాతి పరిశ్రమలపై ఆధారపడి వేల కుటుంబాలు బతుకుతున్నాయి. తిరిగి ప్రారంభంకానుండడంతోపాటు వ్యాపారులతోపాటు కార్మికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశ్రమల నిర్వాహకులకు అధికారులు ఆదేశించారు. 

లాక్‌డౌన్‌తో తీవ్ర నష్టం..

  • పి.రాంచంద్రారెడ్డి, పాలీషింగ్‌ యూనిట్‌ యజమాని, తాండూరు 

  లాక్‌డౌన్‌తో పాలీషింగ్‌ యూనిట్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. దినసరి కూలీలు కూడా ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు అప్పుల్లో కూరుకుపోయే దుస్థితి వచ్చింది. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో చిన్న పరిశ్రమలైన పాలీషింగ్‌ యూనిట్ల యజమానాలకు ఊరట లభించింది. 

సడలించడంపై సంతోషంగా ఉంది..

  • మల్లేశ్‌, పెట్రోకెమ్‌ ఇండస్ట్రీస్‌, సూపర్‌వైజర్‌, పెద్దేముల్‌

లాక్‌డౌన్‌ వల్ల ఈ సీజన్‌లో సుమారు రూ. 40-50 లక్షలు నష్టపోయాం. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో మా సుద్ద కంపెనీలో సుమారు 3-4 వేల టన్నుల రా మెటీరియల్‌ను స్టాక్‌ చేసి ఉంచే వాళ్లం. లాక్‌డౌన్‌తో అది కుదరలేదు. ఇప్పుడు కంపెనీ నడిచే పరిస్థితి లేదు. ఎండాకాలంలో గనులలో తవ్వకాలు జరిగితేనే కంపెనీలకు కావాల్సిన సుద్ద లభించేది. ఏదిఏమైనా కనీసం ఇప్పుడైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంతవరకు సడలింపులు ఇవ్వడంపై చాలా సంతోషంగా ఉంది.


logo