ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - May 01, 2020 , 01:29:52

కూలీలు సామాజిక దూరం పాటించాలి

కూలీలు సామాజిక దూరం పాటించాలి

  • పలు గ్రామాల్లో ‘ఉపాధి’ పనులను పరిశీలించిన కలెక్టర్‌

మోమిన్‌పేట్‌ : కూలీలు సామాజిక దూరం పాటించాలని కలెక్టర్‌ పౌసుమి బసు సూచించారు. మండల పరిధిలోని గోవిందపురంలో గురువారం సర్పంచ్‌ ఆశమ్మతో కలిసి కలెక్టర్‌ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వానకాలంలో నీటిని సంరక్షించేందుకు 1700 గుంతలను కూలీలతో తవ్వించనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత లచ్చానాయక్‌ తండాలో పర్యటించి పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని, ట్రాక్టర్‌ ద్వారా చెత్తను సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మాస్కులు లేకుండా గ్రామస్తులు గుంపులుగా తిరగడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కులు పంపిణీ చేయాలని డీఆర్డీవో కృష్ణన్‌కి సూచించారు. మిషన్‌ భగీరథ నీటిని పరీక్షించాలని అధికారులకు సూచించారు. 

కార్డు లేనివారికి రేషన్‌ ఇవ్వడం కుదరదు..

రాళ్లగూడుపల్లిలో రేషన్‌ బియ్యం రావడం లేదని కొందరు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా, రేషన్‌కార్డులో పేరున్న వారందరికీ పంపిణీ చేశామని లేనివారికి రేషన్‌ ఇవ్వడం కుదరదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రిజిస్టర్లు, ఓపీ, ప్రసూతి గదులను పరిశీలించారు. దవాఖానకు వచ్చిన గర్భిణులతో మాట్లాడుతూ గ్రామంలో ఆశవర్కర్లు సకాలంలో పౌష్టికాహారం అందిస్తున్నరా? అని ఆరా తీశారు. దవాఖానలో విజిటింగ్‌ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని డాక్టర్లకు సూచించారు. శ్రీశక్తి భవనంలో అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సమావేశంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులను సభ్యులుగా చేర్చుకొని, గుర్తింపు కార్డులను జారీ చేయాలని, పంటను నేరుగా పొలం నుంచే కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో కృష్ణన్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో శైలజరెడ్డి, డీఎల్‌పీవో అనిత, ఏవో రాధ, ప్రాథమిక వైద్యాధికారి సుధీర్‌, ఎంపీపీ వసంత, ఏపీవోలు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.


logo